మావోయిస్టు మాజీ దళపతి గణపతి లొంగిపోతారా?

(దూడం మార్కండేయ)

ఎప్పుడా అంటూ దేశమంతా ఎదురుచూసిన ఆ క్షణం రానే వచ్చిందనుకున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో మావోయిస్టుల భారీ లొంగుబాట్లు ఉంటాయని మీడియాకు సమాచారం వచ్చిన వెంటనే ఊహాగానాలు మొదలయ్యాయి. సీఎం సమక్షంలో అంటున్నారు కనుక తప్పనిసరి ఆ దళపతి ఉంటాడనుకున్నారు. తీరా చూస్తే 130 మంది వివిధ స్థాయిలకు చెందిన నక్సలైట్లు 124 వివిధ రకాల ఆయుధాలతో లొంగిపోయారు. కాని ఆ సుప్రీం జాడే లేదు. కొండపల్లి సీతారామయ్య తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు గాంచిన ఆ మనిషి వెంటనే జనజీవన స్రవంతిలోకి రావాలని రేవంత్ సైతం పిలుపునిచ్చారు. ఆయన వస్తే, ప్రాణాలకు భద్రత కల్పిస్తామని, ఆరోగ్యాన్ని కాపాడుతామని హామీ ఇచ్చారు.

ఇంతకీ అందరూ ఎదురు చూసిన మావోయిస్టు మాజీ దళపతి గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు ఎందుకు లొంగిపోలేదు? అసలు ఆయన ఎక్కడున్నారు? నేపాల్‌లో ఉన్నారా? ఇండియాలోనే ఉన్నారా? కొన్ని మీడియాల్లో వచ్చినట్లు ఆయన ఆనుపానులు తెలంగాణ ఎస్ఐబీకి తెలిసిపోయాయా? వారి అదుపులోనే ఉండి అరెస్టు చూపడం కాకుండా లొంగుబాటుకు ఒప్పించే ప్రయత్నంలో జాప్యం జరుగుతున్నదా? అందులో భాగంగానే అమెరికాలో ఉన్న ఆయన కుమారుడి చేత ‘‘నాన్నా.. ఒక్కసారి కనిపించవా..’’ అంటూ ఆడియో విడుదల చేయించారా? లేదంటే.. ఆయన గురించి వస్తున్న వార్తలన్నీ వట్టి మీడియా ఊహాగానాలేనా? నేపాల్‌లోనో, మరే దేశంలోనో ఆయన రహస్యంగా ఉన్నారా? మన దేశంలోనే ఏదో ఒక నగరంలో లేక మారుమూల చిన్న పట్టణంలో స్థిరపడ్డారా? అమిత్ షా పెట్టిన డెడ్‌లైన్ 2026 మార్చి 31 వరకూ సైలెంట్‌గా ఉండి ఆ తర్వాత అసలు నిజాలు కుండ బద్దలు కొడతారా? ఇవన్నీ జవాబివ్వలేని ప్రశ్నలు..

ఒక కొండపల్లి సీతారామయ్య.. ఒక గణపతి..

లొంగుబాటు సభలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లు.. కొండపల్లి సీతారామయ్యకు ఎంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయో, అంతకన్నా మించిన పాపులారిటీ సంపాదించిన నేత గణపతి. బీఎడ్ వరకూ చదివి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా కొంతకాలం ఉద్యోగం చేసిన ఆయన గొప్ప మేధావి. గ్రౌండ్ లెవెల్లో ఒక ఏరియా సెంట్రల్ ఆర్గనైజర్‌గా పనిచేసి జగిత్యాల జైత్రయాత్రలో రైతాంగాన్ని సమీకరించిన ఆచరణవాది. భారతదేశంలో విప్లవోద్యమం ఉన్న అన్ని రాష్ట్రాలనూ, ప్రాంతాలనూ తిరిగిన అనుభవశీలి. శ్రీకాకుళ పోరాటం ఓటమి పాలై విప్లవ శ్రేణులు నిరాశ నిస్పృహల్లో మునిగివున్న వేళ.. ఎమర్జెన్నీ అనంతరం తెలంగాణలో ఉద్యమాన్ని నిర్మించి పీపుల్స్ వార్ పార్టీని స్థాపించి, నడిపించిన గొప్పనేత కొండపల్లి. వయసు తెచ్చిన అనారోగ్యంతో అదే కొండపల్లి సీతారామయ్య ఉద్యమంతో సజీవ సంబంధాలు తెగిపోయిన, పొలిటికల్ బ్యాలన్స్ కోల్పోయిన పరిస్థితుల్లో, పగ్గాలు చేపట్టి ఉద్యమాన్ని 16 రాష్ట్రాలకు విస్తరింపజేసి ఐక్య మావోయిస్టు పార్టీని నిర్మించిన మరో గొప్పనేత గణపతి. ఆయన నాయకత్వంలోనే పీఎల్జీఏ ఏర్పాటు జరిగింది. దక్షిణ బస్తర్, అబూజ్మాడ్, సరండా వంటి ప్రాంతాలు గెరిల్లా స్థావరాలుగా మారాయి. జిల్లా స్థాయి జనతన సర్కార్లు ఏర్పడి పాలించాయి. కొండపల్లికి మించిన ఫీల్డు అనుభవం, ప్రజల చైతన్య స్థాయిలను అంచనా వేసి, ఆచరణను సిద్ధాంతానికి మేళవించే సామర్థ్యం గణపతి సొంతం.

లొంగిపోతే అదొక హిస్టారికల్ వండర్..

అలాంటి గణపతి.. ఒక సోనూలా, ఒక దేవ్‌జీలా ప్రభుత్వం ఎదుట లొంగిపోవడం అంటే.. నిజంగానే అది ఒక హిస్టారికల్ వండర్ అవుతుంది. మారిన సామాజిక-ఆర్థిక-రాజకీయ పరిస్థితుల్లో దీర్ఘకాలిక సాయుధ పోరాటం ఆచరణ సాధ్యం కానిదని కనుక ఆయన నమ్మితే.. ఉద్యమం వ్యూహాత్మక వెనకడుగులో ఉందని సీసీ అంచనా వేసిన 2018 కాలంలోనే మొత్తం పార్టీ వ్యూహం-ఎత్తుగడలను మార్చడానికి పూనుకునేవారు. ఇప్పుడు సోనూ చెబుతున్నట్లుగా మావోయిస్టు పార్టీని లీగలైజ్ చేసి చట్టబద్ధ ఉద్యమాలను నిర్మించేవారు. సీసీ నేరుగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఈశాన్య రాష్ట్రాల్లో జరిగినట్టుగా శాంతి ఒప్పందం కుదుర్చుకుని జనజీవన స్రవంతిలోకి వచ్చేవాళ్లు. అప్పుడు అనేక మంది నేతలు, కేడర్లు చనిపోవడం, ఆ తర్వాత ఆయుధాలతో, ఆయుధాలు లేకుండా మూకుమ్మడిగా లొంగిపోవడం జరిగేదే కాదు.

కార్యదర్శి మార్పు ఎందుకు జరిగింది?

కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న గణపతికి 2018లో ఆరోగ్య కారణాలతో విశ్రాంతినిచ్చి, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్చార్జిగా ఉన్న బసవరాజును నియమించడం వెనక ఏం జరిగింది? ఈ విషయంలో కూడా అనేక ఊహాగానాలున్నాయి. పీపుల్స్ వార్ పార్టీతో ఎంసీసీ కలిసిన తర్వాత మిలిటరీకి ప్రాధాన్యం పెరిగిందని, రాజకీయాలు, పార్టీ నిర్మాణం రెండవ స్థానానికి వచ్చాయని విశ్లేషకులు అంటున్నారు. ఎంసీసీ వర్గం మద్దతుతోనే బసవరాజు నియామకం జరిగిందని వాళ్ల అభిప్రాయం. ‘‘2024 నవంబర్‌లో ముగ్గురు పొలిట్‌బ్యూరో సభ్యులం కలిశామని, అప్పుడు నేను పంథా మార్పు గురించి వాదించానని’’ లొంగిపోయిన సోనూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. బసవరాజు దాన్ని వ్యతిరేకించాడని, గణపతి మౌనంగా ఉన్నాడని ఆయన అన్నారు. అంటే గణపతి ఏ అభిప్రాయంతో ఉన్నట్లు? దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథా విఫలమైందనే అభిప్రాయంతో ఉన్నారా? లేదా పాత లైనుకే కట్టుబడి ఉన్నారా?

ఫీల్డుకు దూరంగా..

కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత గణపతి.. పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. అమృత్ పేరుతో పలు ప్రకటనలు కూడా విడుదల చేశారు. అంటే ఆయనకు దండకారణ్యం, తెలంగాణ, జార్ఖండ్, ఏఓబీ లాంటి పలు ఉద్యమ ప్రాంతాలతో డైరెక్ట్ కనెక్షన్ తెగిపోయింది. మధ్య భారత ఉద్యమాన్ని మొత్తం కార్యదర్శి బసవరాజే చూశారు. అయినప్పుడు లొంగిపోయిన కేడర్ల నుంచి గణపతి ఆచూకీ దొరకడం అసంభవమనే చెప్పవచ్చు. ఆయన వ్యక్తిగత సిబ్బంది, కొరియర్లకు తప్ప మరొకరికి ఆయన ఆనుపానులు తెలిసే అవకాశమే లేదు. అయినప్పుడు తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్న వార్తలను నమ్మవచ్చా?

రాజిరెడ్డి, దేవ్‌జీల లొంగుబాటుతోనే ఈ గందరగోళం?

అయితే, సోనూ, ఆశన్నలు ఆయుధాలతో లొంగిపోయిన అనంతరం వారిపై ద్రోహులన్న ముద్ర వేసి పేపర్ ప్రకటనలు ఇచ్చిన సీసీ సభ్యుల్లో గణపతి మినహా అందరూ (చంద్రన్న, సుజాతక్క, మల్లా రాజిరెడ్డి, దేవ్‌జీ తదితరులు) ఈ మధ్య కాలంలో లొంగిపోవడం, రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశమవడం మూలంగా గణపతి లొంగుబాటు వార్తలను మీడియా స్పెక్యులేట్ చేసింది. ప్రజలు నమ్మారు. అసలు పంథాను కొనసాగిస్తారనుకున్న వర్గం లొంగుబాటు మూలంగా మొత్తం పార్టీయే చట్టబద్ద మార్గానికి వచ్చిందన్న సంకేతాలు వెళ్లాయి. ఫలితంగా దిశ సహా ప్రధాన స్రవంతి మీడియా అంతా గణపతి లొంగుబాటు వార్తలను ప్రచురించింది.

మార్చి 31లోగా గణపతి లొంగుబాటు పక్కానా?

అమిత్ షా డెడ్‌లైన్ ఈ నెల 31లోగా గణపతి సహా మిగిలివున్న అందరు మావోయిస్టు నేతలు, సభ్యులు లొంగిపోతారని, లొంగిపోవాలని ప్రస్తుతం పౌరసమాజంలో మెజారిటీ కోరుకుంటోంది. ఇప్పటికీ రేపో, మాపో, 10 రోజులకో, నెలాఖరుకో గణపతి లొంగుబాటు పక్కా అని వాదించేవాళ్లు కోకొల్లలు. ఆయన లొంగిపోతేనే దేశంలో మావోయిస్టు శకానికి ముగింపు పలకవచ్చని అటు మోడీ ప్రభుత్వం కూడా ప్రణాళికలు రచిస్తోంది. మరి ఏం జరగనుంది? గణపతి లొంగిపోతారా? లేక అంతా సద్దుమణిగాక సంచలన ప్రకటనతో బాంబు పేలుస్తారా? కాలమే సమాధనమివ్వగలదు.

==========================

 

(దిశ సౌజన్యంతో)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version