(దూడం మార్కండేయ)
గురువారం సీపీఐ ఆఫీసుకు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి తదితరులు వస్తారని వచ్చిన వార్తల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఏ కారణం వల్లనో వారి ఆ సందర్శన రద్దయినా, చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. గత నెలాఖరులో రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయిన దేవ్‌జీ వర్గం.. తాము రాజకీయ జీవితం కొనసాగిస్తామని, చట్టబద్ధమైన పద్ధతుల్లొ ప్రజల పక్షాన పోరాడతామని చెప్పిన విషయం తెలిసిందే. వీరి లొంగుబాటు సమయంలో ఆయుధాలు అప్పగించక పోయినా, ఆ తర్వాత వీరి వర్గం అంతా సరెండర్ అయినప్పుడు భారీ మొత్తంలో ఆటోమాటిక్ రైఫిళ్లు సహా పలు ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో ఒక చర్చ విప్లవాభిమానుల్లో, రాజకీయ పరిశీలకుల్లో, జనరల్‌గా ప్రజల్లో మొదలైంది. అక్టోబర్‌లో లొంగిపోయిన సోనూ-ఆశన్న వర్గం.. ఇప్పుడు లొంగిపోయిన దేవ్‌జీ వర్గం కలువచ్చు కదా.. ఒకే వేదిక ఏర్పాటు చేసుకుని పోరాడవచ్చు కదా.. అనేదే ఈ చర్చ సారాంశం.
కొత్త రాజకీయ వేదిక కోసం ఆలోచిస్తున్నామని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో సోనూ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. గత వారం రాయ్‌పూర్ వెళ్లి ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ కార్యకలాపాలను పరిశీలించిన ఆశన్న టీం.. ఈ వారం తెలంగాణకు వచ్చివెళ్లింది. వారి ఐదు రోజుల పర్యటనలో తమ కుటుంబాల సందర్శనతో పాటు వరంగల్ సమీపంలోని బట్టుపల్లిలో అమరుల కుటుంబాలకు పరామర్శ తదితర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆశన్న.. తాము చట్టబద్ధంగా పనిచేసే కొత్త దారి కోసం వెతుకుతున్నామని, ఇప్పుడున్న పార్టీల్లో అయితే చేరబోమని స్పష్టం చేశారు. తాము తొందర పడదల్చుకోలేదని, నలభై ఏళ్లుగా అన్నీ త్యాగం చేసిన తాము ఇకముందు కూడా ప్రజల కోసమే పనిచేస్తామని వివరించారు.
ఇద్దరి మార్గం ఒకటేనా?
అయితే, ఇప్పుడు కీలకమైన ప్రశ్న ఏమిటంటే.. సోనూ-ఆశన్న వర్గం లొంగిపోయినప్పుడు వారిపై ద్రోహులు అంటూ ముద్ర వేసిన దేవ్‌జీ వర్గం ఇప్పుడు తాము కూడా చట్టబద్ధంగా పనిచేస్తామని చెప్పారు కనుక ఇద్దరి దారుల్లో తేడా ఏముందని విప్లవాభిమానులు, పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఆయుధాలు అప్పగించడం, అప్పగించకపోవడం కూడా ఇప్పుడు సమస్య కాదని, అందరు చేసింది అదే కదా అంటున్నారు. బయటకు రావడానికి కారణం.. దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథా విఫలమైందని, తాత్కాలిక పోరాట విరమణే తక్షణ మార్గమని సోనూ వర్గం చెప్పి లొంగుబాట పట్టిందని, దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, సుజాతక్క తదితరులు మాత్రం అనారోగ్యం, వృద్ధాప్యం.. అంటూ ఇతర కారణాలు చెప్పారని గుర్తు చేస్తున్నారు. కాని భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన మార్గం మాత్రం ఇద్దరూ చట్టబద్ధ పోరాటమే చేస్తామని ప్రకటించారని అంటున్నారు.
ఏకమైతేనే బలమైన వేదిక?
భవిష్యత్తు కార్యాచరణపై ఇద్దరి మధ్య పెద్దగా తేడా లేనప్పుడు రెండు వర్గాలు ఏకమైతే బలమైన ఒక వేదిక తయారవుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైనప్పటి నుంచి మార్చి 10, 2026 వరకు మొత్తం 2650 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయినట్లు నివేదికలు తెలుపుతున్నాయని, జైళ్లలో ఉన్నవారి సంఖ్య కలిపితే, ఇది మూడు వేలకు చేరవచ్చని అంటున్నారు. ఇంతమంది పూర్తికాలం పనిచేస్తూ ఒక రాజకీయ పార్టీని లేదా వేదికను ఏర్పాటు చేసి నడిపిస్తే అనతికాలంలోనే ఒక బలమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వామపక్షాలు కూడా కలిస్తే?
దేవ్‌జీ వర్గాన్ని తమ ఆఫీసుకు ఆహ్వానించిన సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) గ్రూపులు కనుక మాజీ మావోయిస్టులతో ఏకమైతే, దేశ రాజకీయాల్లో కీలక మార్పు వచ్చే అవకాశమందని విశ్లేషిస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనమవుతున్న పరిస్థితుల్లో ఇది మంచి ప్రత్యామ్నాయంగా మారవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నక్సల్బరీ-శ్రీకాకుళ పోరాటాలు, ఇప్పుడు మావోయిస్టుల దీర్ఘకాలిక సాయుధ పోరాటం ఓటమి పొందిన నేపథ్యంలో అన్ని కమ్యూనిస్టు పార్టీలు కలిసి కొత్త దారి కోసం అన్వేషించడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. సోనూ-ఆశన్న, దేవ్‌జీ వర్గాలు ఈ కోణంలో ఆలోచించాలని, తమ మధ్య ఉన్న ఇతర విభేదాలను పక్కన పెట్టి ప్రజల మేలు కోసం కలవాలని విన్నవిస్తున్నారు.
