మావోయిస్టు పార్టీ ఓటమిపై నేను రాజకీయ విశ్లేషణ రాసిన తర్వాత నా పైన కొందరు అప్రజాస్వామికంగా దాడి చేస్తున్నారు. వారు ప్రజాస్వామికంగా నేను రాసిన విషయాలను విభేదిస్తూ, విమర్శిస్తూ ఏమైనా రాసుకోవచ్చు. కాని నా పైన వ్యక్తిగత దాడి చేస్తూ నన్ను బాధ పెడుతున్నారు. నేను పార్టీలోకి వెళ్లిందీ, తిరిగివచ్చిందీ ఏ పరిస్థితుల్లో అనే వివరాలు నేను రాసిన సంపాదకీయాల(నమస్తే తెలంగాణ ఎడిట్ పేజీలో వచ్చాయి.) సంపుటి మలుపు పబ్లికేషన్స్ నుంచి వచ్చిన ’’మరోకోణం‘‘ అనే పుస్తకంలో ఉన్నాయి. ఆ పుస్తకానికి నేను ’నా మాట‘ రాశాను. అందులో ఈ వివరాలు మీరు చదవవచ్చు.
అయితే, కాలానుగుణంగా స్థల కాల పరిస్థితులపై ఆయా వ్యక్తుల అభిప్రాయాల్లో మార్పులు రావచ్చు. నమస్తే తెలంగాణలో రాసిన 42కు పైగా వ్యాసాలు, వార్తలు, మరోకోణం పుస్తకం లింక్, దిశకు వచ్చిన తర్వాత రాసిన వ్యాసాలు విడి విడి పోస్టుల్లో పెడతాను. ప్రస్తుతానికి నేను ‘మరోకోణం’ పుస్తకానికి నా ముందుమాట ఇక్కడ పెడుతున్నాను. ఈ పుస్తకం పూర్తి పీడీఎఫ్ కావాలన్నా, నమస్తే తెలంగాణలో దిశలో వచ్చిన నా వ్యాసాలను చదవాలన్నా నా పర్సనల్ వెబ్ సైట్ https://www.marokonam.com/ ఓపెన్ చేసి ఎవరైనా చదవవచ్చు. పుస్తకం పీడీఎఫ్ కావాలంటే.. డౌన్ లోడ్ చేసుకోవాలనుకుంటే.. https://www.marokonam.com/…/marokonam-a-compilation-of… ఓపెన్ చేయవచ్చు. బస్తర్లో జనతన జైత్రయాత్ర పుస్తకం డౌన్ లోడ్ చేసుకోవాలనుకుంటే..
https://www.marokonam.com/…/janatana-jaitrayatra-in-bastar ఓపెన్ చేయవచ్చు.
నా మాట: జర్నలిజానికి నమస్తే..
సుమారు పదిహేడేళ్లకు పైగా విప్లవోద్యమంలో పనిచేసిన తర్వాత 2000 ఆగస్టులో కొన్ని స్వీయాత్మక బలహీనతలు, తొందరపాటు నిర్ణయం మూలంగా నేను అజ్ఞాతవాసానికి స్వస్తి చెప్పి ఈ ప్రపంచంలోకి వచ్చాను. నాపై ఉన్న కేసులను చట్టబద్దంగా ఎదుర్కొని 43 రోజుల పోలీసు కస్టడీ, నాలుగు నెలల జైలు జీవితం అనంతరం అన్ని కేసుల్లో కోర్టు నుంచి బెయిలు పొంది బయటకు వచ్చాను. 1983లో పరీక్షలు రాసి ముగించిన డిగ్రీలో ఉత్తీర్ణుడనయ్యానని తెలిసి తదుపరి జీవితాన్ని ప్లాను చేసుకున్నాను.మావోయిస్టు పార్టీ నాకు నేర్పిన రాజకీయ, భాషా జ్ఞానాలను వినియోగించుకుని జర్నలిజంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రవేశపరీక్ష రాసి బీసీజేలో సీటు సంపాదించాను. సంవత్సరం తర్వాత దానిని ముగించి ఎంసీజేలో సైతం ఓయూ క్యాంపస్లో అడ్మిషన్ పొందాను.
ఈలోగా మూతపడిన ఆంధ్రజ్యోతి దినపత్రికను పున:ప్రారంభిస్తున్నారని విని దరఖాస్తు చేసాను. ఆ సంస్థ ఎండీ రాధాకృష్ణ గారిని కలిసి నా గురించి వివరించాను. ఆయన వెంటనే స్పందించి నన్ను అప్పటి ఎడిటర్ రామచంద్రమూర్తి సార్, కట్టా శేఖర్రెడ్డి సార్లకు అప్పగించారు. అలా ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల మొదటిబ్యాచ్ విద్యార్థిగా వాళ్లిద్దరి శిక్షణలో 2002 సెప్టెంబర్ 5న నేను నా జర్నలిస్టు కెరీర్ను ఆరంభించాను. అక్టోబర్ 15న ఆంధ్రజ్యోతి ప్రారంభమైనప్పటి నుంచి 10 నెలల పాటు సెంట్రల్ డెస్కులో పనిచేసాను. అక్కడ ఇప్పటి సాక్షి ఎడిటర్ మురళి సార్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లమన్న తదితర సీనియర్ జర్నలిస్టుల నుంచి చాలా నేర్చుకున్నాను.
మావోయిస్టు పార్టీకి చెందిన సైనిక వ్యవహారాల పత్రిక జంగ్ వర్కింగ్ ఎడిటర్గా, వ్యాస రచయితగా, అనువాదకుడిగా గతంలో పనిచేసిన అనుభవం నాకు బాగా ఉపయోగపడింది. పత్రిక పెద్దల వద్ద మంచి మార్కులే కొట్టేసాను. అయితే, ఓ వైపు చాలీచాలని జీతం, మరోవైపు కోర్టుల చుట్టూ తిరగడానికయ్యే ఖర్చులు నన్ను బాగా ఇబ్బంది పెట్టాయి. ఇల్లు గడువడం కష్టమైంది. వేతనం పెంచుమని లేదంటే కనీసం నన్ను సొంత జిల్లా కరీంనగర్కు బదిలీ చేయమని నేను చేసిన విజ్ఞప్తికి ఎండీ గారు అంగీకరించారు. స్వగ్రామం ఏరడపల్లిలో మాకు ఇల్లు, కొంచెం పొలం వున్నాయి కనుక ఖర్చులు తగ్గుతాయని, కోర్టుకు వెళ్లడం కూడా సులువవుతుందని నా ఉద్దేశం.
అలా 2003 జులైలో నన్ను సబ్ ఎడిటర్ గా కరీంనగర్ యూనిట్కు పంపించారు. అదే నా జర్నలిస్టు జీవితానికి కీలక మలుపయింది. అక్కడ నా ప్రతిభను నిరూపించుకోవడానికి చక్కని అవకాశం దొరికింది. అనతికాలంలోనే కరీంనగర్ డెస్క్ ఇన్చార్జిగా, ఆ వెంటనే రెండు జిల్లాల (ఆదిలాబాద్-కరీంనగర్) ఎడిషన్ ఇన్చార్జిగా ప్రమోటయ్యాను. అక్కడ పనిచేసిన ఐదేళ్ల కాలంలో నేనేంటో నిరూపించుకున్నాను. 2009 ప్రారంభంలో ఏబీఎన్ చానల్ కోసమని నన్ను, మరికొందరిని హైదరాబాదుకు బదిలీ చేసారు. మొదట ఎన్నికల స్పెషల్ డెస్కులో, తర్వాత చానల్ ఆఫీసులో పనిచేసి ప్రత్యేక పరిస్థితుల్లో ఎండీ రాధాకృష్ణ గారి అభ్యర్థన మేరకు ఆంధ్రజ్యోతి హైదరాబాదు సిటీబ్యూరో ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్నాను.
సిటీ డెస్క్ పర్యవేక్షణ సైతం నిర్వహిస్తూ చీఫ్ రిపోర్టర్/చీఫ్ సబ్ ఎడిటర్ స్థాయికి ఎదిగాను. 2010 ఆగస్టు మొదటివారంలో శేఖర్రెడ్డి సార్ నాకు కాల్ చేసాడు. తెలంగాణ ఉద్యమానికి దన్నుగా ఒక దినపత్రికను ప్రారంభించడానికి టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారని చెప్పాడు. ఆయనతో ప్రాథమిక చర్చలు ముగిసాయని, బయటకు వచ్చి నీతో మాట్లాడుతున్నానన్నాడు. నువ్వు కూడా లీడింగ్ టీంలో చేరితే బాగుంటుందని సూచించాడు. మరేమీ ఆలోచించకుండా నేను ఓకే చెప్పాను. పనిచేస్తున్నది ఓ పెద్ద పత్రిక అయినా, సరిపోయేంత వేతనం వస్తున్నా, ఆ సంస్థ ఎండీకి నాపై ఎనలేని విశ్వాసం ఉన్నా నేను నమస్తే తెలంగాణ (అప్పటికి ఇంకా ఆ పేరు ఖరారు కాలేదు) వైపే మొగ్గు చూపాను.
ఉద్యమ పత్రికగా వస్తున్నది కనుక నా భావాలను ప్రజలతో పంచుకోవడానికి విస్తృత అవకాశాలు దొరుకుతాయని ఆశించడం అందుకు మొదటి కారణం. జర్నలిస్టు కెరీర్లో నాకు గురువుగా, మిత్రుడిగా, విమర్శకుడిగా ఉన్న శేఖర్రెడ్డి సార్ నుంచి ఆ ప్రతిపాదన రావడం రెండవ కారణం.ఆ క్షణం నుంచే నేను నమస్తే తెలంగాణ కోసం పనిచేయడం ఆరంభించాను. పదవి ఏదో తెలువకున్నా, జీతం ఖరారు కాకున్నా శేఖర్రెడ్డి సార్తో టచ్లో ఉంటూ ఆయన చెప్పిన విధులను నిర్వర్తించాను. ఆ సంవత్సరం అక్టోబర్ 12న నమస్తేలో న్యూస్ ఎడిటర్గా చేరాను. అప్పటి పరిస్థితుల్లో నాకు న్యూస్ నెట్వర్క్ ఇన్చార్జి, స్టేట్ బ్యూరో చీఫ్, సెంట్రల్ డెస్క్ ఇన్చార్జి బాధ్యతల్లో ఏదో ఒకటి అప్పగించాలని శేఖర్రెడ్డి సార్, అప్పటికే పత్రిక ఎడిటర్గా చేరిన అల్లమన్న ఉద్దేశంగా ఉండింది. తగిన వ్యక్తులు దొరక్కపోతే బ్యూరో చీఫ్/సెంట్రల్ డెస్క్ ఇన్చార్జిగా పనిచేయడానికి నేను సిద్ధమని, అయితే కింది స్థాయి జర్నలిస్టులతో నేరుగా సంబంధం ఉండే న్యూస్ నెట్వర్క్ ఇన్చార్జి బాధ్యతలు నాకిష్టమని వారికి తెలిపాను.
తర్వాతికాలంలో నెట్వర్క్ ఇన్చార్జిగానే నేను నమస్తేలో చిరపరిచితుడనయ్యాను. అల్లమన్న లేదంటే శేఖర్రెడ్డి సార్లతో కలిసి అన్ని జిల్లాలు తిరిగి రిపోర్టర్లను రిక్రూటు చేసుకోవడం, డెస్క్ స్టాఫ్ ను నియమించడం, టాబ్లాయిడ్ల రూపురేఖలను ప్లాన్ చేయడం వంటి బాధ్యతలను నిర్వర్తించాను. కిందిస్థాయి నుంచి వచ్చినవాడిని కనుకనూ, కార్మికవర్గ స్పృహ ఉండడం మూలంగానూ నేను ఏ రోజూ నా పోస్టును చూసి మురిసిపోలేదు. ఆఫీసు బాయ్ నుంచి ఎడిటర్ వరకూ బాధ్యతలు వేరైనా అందరూ బేసిక్ గా మనుషులేనన్న సూత్రాన్ని పాటించాను. ప్రారంభకాలంలో అల్లమన్నకు అనధికార పీఏగా సైతం వ్యవహరించాను. పత్రిక ప్రారంభంలో నెలసరి వేతనాలిస్తున్నప్పుడు తన వద్ద సేఫ్ లేదు కనుక పెద్ద మొత్తంలో నగదును ఉంచలేనని క్యాషియర్ చెప్పినప్పుడు ఆ నగదును ఇంటికి తీసుకువచ్చి మరునాడు సిబ్బందికి పంపిణీ చేసే డ్యూటీ సైతం నిర్వర్తించాను.
పత్రికలో నేను పనిచేసిన ఏడేళ్ల కాలంలో ఒక్కో జిల్లాకు కనీసం ముప్పై సార్లయినా వెళ్లివుంటాను. అలా కిందిస్థాయిలో పనిచేసే అనేక మంది రిపోర్టర్లతో నాకు సాన్నిహిత్యం ఏర్పడింది. నెట్వర్క్ అంతా ఒక టీంగా రూపుదిద్దుకుంది. ఉద్యమకాలంలో పత్రిక మనుగడకు అవసరమైనప్పుడు నెట్వర్క్ ఆధ్వర్యంలో అడ్వర్టయిజ్మెంట్స్ చేసి కంపెనీకి భారీగా రెవెన్యూ సమకూర్చాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ అవసరం రాలేదు కానీ, పత్రికను రాష్ట్రంలో నెంబర్ వన్ చేయాలన్న లక్ష్యంతో మేనేజ్మెంటు ఇచ్చిన కర్తవ్యాలను విజయవంతంగా పూర్తి చేసాం. ఫలితంగా సర్క్యులేషన్ బాగా పెరిగింది.
అల్లమన్న, శేఖర్రెడ్డి సార్ల సహాయ సహకారాలతో ఎడిటోరియల్ పరంగా కూడా టాబ్లాయిడ్లలో అనేక మార్పులు తెచ్చాం. పేజీల సంఖ్య పెంచాం. స్థానిక వార్తల కోసం నియోజకవర్గ పేజీలు ప్రవేశపెట్టాం. అనేక శీర్షికలను, కొత్త ఫీచర్లను ప్రారంభించాం. పోటీ పత్రికలకు దీటుగా నమస్తే తెలంగాణను తీర్చిదిద్దే క్రమంలో అన్ని వర్గాల పాఠకుల ఆదరణ పొందేలా చర్యలు చేపట్టాం. కొత్త రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను, ప్రజాభిప్రాయాన్ని, అన్ని పార్టీల, ప్రజాసంఘాల వార్తలను ప్రముఖంగా ప్రచురించాం.
ఈ క్రమంలోనే పత్రిక యాజమాన్యంలో మార్పు జరిగింది. కొత్త యాజమాన్యం వార్తల, వ్యాసాల ప్రచురణలో పరిమితులు విధించడం మొదలుపెట్టింది. ఈ పరిమితులు తర్వాతికాలంలో ఆంక్షలుగా మారి అధికార పక్షం వార్తలు తప్ప మరే వార్తలూ ప్రచురించవద్దనే వరకు వచ్చింది. ఏ పత్రిక యాజమాన్యానికైనా కొన్ని అభిప్రాయాలూ, ఆబ్లిగేషన్లూ ఉండడం సహజం. దానిని అర్థం చేసుకోవచ్చు. అయితే, అవి దినపత్రిక సహజ లక్షణానికి విరుద్ధంగా ఉండకూడదన్నది జర్నలిజం మౌలిక సూత్రం. అది మరిచిపోతే పాఠకుల్లో పత్రిక విశ్వసనీయత తగ్గిపోతుంది. అప్పుడు ఏదైనా విషయాన్ని పేజీలకు పేజీలు రాసుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు.
ఇదే విషయాన్ని నేను, నాతో పాటు లీడింగ్ టీంలో ఉన్న సీనియర్ జర్నలిస్టులు, కిందిస్థాయి రిపోర్టర్లు, డెస్క్ సిబ్బంది, సర్క్యులేషన్-అడ్వర్టయిజ్మెంటు విభాగాల పెద్దలు పలుమార్లు చర్చించాం. యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాం. ఇలాంటి విషయాల్లో సహజంగానే నేను కొంచెం ఎక్కువ చొరవ చూపాను. నా రాజకీయాభిప్రాయాల వల్లనూ, విభిన్న వర్గాలకు, పార్టీలకు సంబంధించిన పాఠకుల్లో నా ఆధ్వర్యంలో సంవత్సర చందాలు భారీగా చేయించిన మూలంగానూ ఈ వైఖరి నాకు అనివార్యమైంది. అయితే, ఇదే నా ఉద్యోగం ఊడిపోవడానికి కారణమవుతుందని ఊహించలేదు. అననుకూల పరిస్థితుల్లో 2017 ఆగస్టులో నేను సంస్థ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చాను.
టీనేజీ వయసులోనే రంగనాయకమ్మ రచనల ప్రభావంతో నేను నాస్తికుడిగా మారాను. డిగ్రీ చదువుతున్నప్పుడు గతితర్కాన్ని, మార్క్సిజం-లెనినిజాన్ని అధ్యయనం చేసి భారతదేశంలో ఉన్న అర్థవలస-అర్థభూస్వామ్య వ్యవస్థను మార్చాలంటే నూతన ప్రజాస్వామిక విప్లవం మినహా మరో మార్గం లేదని మనస్ఫూర్తిగా నమ్మాను. నేను పుట్టిన కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, మెట్పల్లి, పెద్దపల్లి తదితర ప్రాంతాల్లో అప్పటికి సాగుతున్న రైతాంగ పోరాటాలు, చదివిన ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో నడుస్తున్న విద్యార్థి ఉద్యమాలు నన్ను ప్రభావితుడిని చేసాయి. నేనున్న ప్రభుత్వ మేనేజ్మెంట్ హాస్టల్లో అమరుడు పులి రాములు మొదలుకొని అనేక మంది రాడికల్ విద్యార్థి నేతలు నన్ను అటు వైపు వెళ్లేలా ప్రోత్సహించారు.
అమరుడు, అప్పటి పీపుల్స్ వార్ జిల్లా కమిటీ సభ్యుడు అయిన సాయిని ప్రభాకర్, ప్రస్తుత మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి (అప్పుడు కరీంనగర్ జిల్లా కార్యదర్శి) ముప్పాళ లక్ష్మణావు అలియాస్ గణపతిలతో నాలుగైదు సార్లు నేను జరిపిన సంభాషణలు చివరకు నన్ను ఆ పార్టీలోకి ఫుల్ టైమర్ గా చేరేలా చేసాయి. మావోయిస్టు పార్టీలో ఫుల్టైమర్గా నేనున్న పదిహేడు సంవత్సరాల్లో వివిధ పట్టణాల ఆర్గనైజర్ గా మూడేళ్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకమిటీ చీఫ్ కొరియర్గా మూడేళ్లు పనిచేసాను. కొరియర్ ఉన్నప్పుడే ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ముఖ్యంగా మిలిటరీ రచనలను అనువాదం చేయడం ఆరంభించాను.
అది నా విప్లవ జీవితాన్ని మలుపు తిప్పింది. పార్టీలో ప్రత్యేకించి మిలిటరీ రంగానికి కేటాయించిన మొట్టమొదటి ఫుల్ టైమర్ ను నేనే కావడం విశేషం. తర్వాతి రోజుల్లో జంగ్ వర్కింగ్ ఎడిటర్గా, గెరిల్లా యుద్ధ మెలకువలపై వ్యాసాల/పుస్తకాల రచయితగా, అనువాదకుడిగా, మిలిటరీ ఇన్స్ట్రక్టర్ గా పనిచేస్తూ జార్ఖండ్ సహా దేశంలోని అనేక ప్రాంతాలు తిరిగాను. పెరూ, ఫిలిప్పైన్స్, నేపాల్, శ్రీలంక, కాశ్మీర్, పంజాబ్ లలో సాగిన గెరిల్లా పోరాటాలను సూక్ష్మస్థాయిలో పరిశీలించాను.
అయితే, అధ్యయనమొక్కటే సరిపోదని గుర్తించి ప్రత్యక్ష ఆచరణలోకి దిగాను. దండకారణ్యంలో దళ కమాండరు స్థాయి నుంచి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా వివిధ బాధ్యతలు నిర్వహించి సిద్ధాంతానికీ ఆచరణకూ మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకున్నాను. ఆదివాసుల్లో మావోయిస్టు పార్టీకి ఎంతటి ఉన్నతమైన స్థానముందో గుర్తించాను. ఈ క్రమంలోనే నాలో కొన్ని వ్యక్తిగత బలహీనతలు ప్రవేశించాయి.
వివిధ దేశాల విప్లవోద్యమాలను, గెరిల్లా పోరాటాలను మిలిటరీ కోణంలో అధ్యయనం చేసిన నేపథ్యంలో నేను స్వీయాత్మక ధోరణులకు గురయ్యాను. కేంద్ర నాయకత్వం కంటే కూడా మిలిటరీ విషయాలు నాకే ఎక్కువ తెలుసుననే భావంతో వాదించడం ఆరంభించాను. నేను పార్టీ ముందు పెట్టి, తిరస్కారానికి గురైన(గెరిల్లా జోన్ ను ప్రాథమిక, ఉన్నత స్థాయిలుగా విభజించడం, గెరిల్లా ఆర్మీ వగైరా) ప్రతిపాదనల్లో కొన్ని తర్వాతి కాలంలో సరైనవని నిరూపించబడడం, స్వయానా కేంద్ర కమిటీ ఆ విషయాన్ని గుర్తించడం నాలో మరింత అహంభావాన్ని పెంచింది.
ఫలితంగా నాకు కేంద్ర కమిటీ సమర్థతలపై విశ్వాసం సన్నగిల్లింది. ఆ సమయంలోనే రాజకీయంగా నాకు అత్యంత సన్నిహితుడైన కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ నల్లా ఆదిరెడ్డి కొయ్యూరు ఎన్కౌంటర్లో అమరుడు కావడం నా నైతిక స్థయిర్యాన్ని దెబ్బతీసింది. విశ్వాసం లేని కేంద్ర కమిటీ కింద పని చేయడం కంటే బయటకు వెళ్లడం మంచిదనే తొందరపాటు నిర్ణయం తీసుకున్నాను. విషాదమేమిటంటే ఏ విషయాల్లోనయితే నేను కేంద్ర కమిటీ సమర్థతలను శంకించానో, వాటిని పటాపంచలు చేసే నిర్ణయాన్ని నేను నాగపూర్ జైలులో ఉన్న కాలంలోనే మావోయిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ గణపతి ప్రకటించారు.
తీవ్ర పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయడం మినహా నేనేమీ చేయలేకపోయాను.
అందుకే పార్టీ బయటకు వచ్చాక, జర్నలిస్టుగా కుదురుకున్నాక వృత్తి బాధ్యతలు సంపూర్ణంగా నిర్వర్తిస్తూనే ప్రవృత్తిగా వ్యాసరచన చేయాలనుకున్నాను. నేను నమ్మిన భావాలను, వివిధ సమకాలీన అంశాలపై నాకేర్పడిన అభిప్రాయాలను ప్రజానీకంతో పంచుకోవడం ఆరంభించాను. ఆంధ్రజ్యోతిలో చేరిన మొదట్లోనే సెంట్రల్ డెస్క్ పనుల్లో భాగంగా అనేక కథనాలు రాసాను. జాతీయ-అంతర్జాతీయ అంశాలపై అనువాద రచనలు చేసాను. ఎడిట్ పేజీకి సైతం కొన్ని వ్యాసాలు రాసాను. కరీంనగర్కు బదిలీ అయిన తర్వాత నా పరిధి కుంచించుకుపోవడం మూలాన అవకాశం అంతగా దొరకలేదు. మానేరు ముచ్చట్లు పేరిట టాబ్లాయిడ్లో కొన్ని వారాలు కాలమ్ నిర్వహించినా అవి స్థానిక అంశాలపైనే ఆధారపడి రాసినవి.
2009లో తిరిగి హైదరాబాదుకు వచ్చి సిటీ బ్యూరోచీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాయడానికి తీరికే దొరకలేదు. ఉద్యమ ఆకాంక్షలతో వచ్చిన నమస్తే తెలంగాణ నాకు ఆ అవకాశాన్ని కల్పించింది. పత్రికకు సంబంధించిన నెట్వర్క్, డెస్క్ లు, టాబ్లాయిడ్లు కుదురుకున్న తర్వాత 2011 చివరి నుంచి 2013 జూలై వరకు సంపాదకీయ పేజీలో వ్యాసాలు రాసాను. నాకు అత్యంత ఆసక్తి ఉన్న అంశాలైన ప్రపంచీకరణ, పరాయీకరణ, ఉద్యమాలు, ప్రభుత్వాల నిర్బంధం, సామ్రాజ్యవాదం, ప్రజాప్రతిఘటన, విప్లవపార్టీలు.. తదితర అనేక జాతీయ అంతర్జాతీయ విషయాలపై కేంద్రీకరించాను. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసిన నేపథ్యంలో పేజీని మొత్తంగా ఆ అంశాలకే కేటాయిస్తే బాగుంటుందనే భావనతో తాత్కాలికంగా రాయడం ఆపేసాను.
ఈలోగా తెలంగాణ కల సాకారం కావడం, టిఆర్ఎస్ గెలిచి ఉద్యమ నాయకుడే సీఎం పదవిని చేపట్టడం జరిగిపోయింది. పత్రిక అంతర్గత విషయాల్లోనూ భారీమార్పుల నేపథ్యంలో ఇక నేను రాయాల్సిన అవసరమూ రాలేదు. ఈ పుస్తకంలోని వ్యాసాలన్నీ వివిధ పత్రికలు, పుస్తకాలు, వెబ్సైట్లలో వచ్చిన సమాచారం ఆధారంగా నాకున్న దృక్కోణంలో రాసినవే. ఒక్కో వ్యాసం కోసం కనీసం నాలుగైదు రోజుల పాటు నెట్ ను జల్లెడ పట్టాను. ఉదహరణకి అమెరికాలో నయా బానిసలు రాయడానికి పదిహేను రోజులు పట్టింది. మరికొన్ని వ్యాసాల కోసం కూడా లోతైన అధ్యయనం చేసాను. నాకు పట్టున్న అంశాలపై మాత్రం సులభంగానే రాయగలిగాను. దొరికిన సమాచారంలో పరస్పర విరుద్ధంగా ఉన్న విషయాలను తర్కబద్దంగా పరిశీలించాను. నాకున్న జ్ఞానంతో వ్యాసరూపంలో పాఠకుల ముందుంచాను.
ఇప్పుడీ వ్యాసాలనన్నింటినీ పుస్తకంగా తెద్దామని కొందరు మిత్రులు ప్రతిపాదించినప్పుడు ముందు నేను నిరాసక్తత ప్రదర్శించాను. పుస్తకం వేసుకునే స్థాయి నాకు లేదనిపించింది. అయితే, ‘మలుపు’ మిత్రుడు బాల్రెడ్డి నా వెంటపడి ఒప్పించాడు. నేను రాసిన వివిధ విషయాలను ఒకచోట చేర్చడం వల్ల ఉపయోగంగా ఉంటుందని కన్విన్స్ చేసాడు. నా పేరున ఇప్పటికే విరసం మిత్రులు ఒక చిన్న పుస్తకం (బస్తర్లో జనతన జైత్రయాత్ర) వేసివుండడం వల్ల ఒకరకంగా ఇది నా రెండవ పుస్తకం. పైన చెప్పినట్లు ఈ పుస్తకం క్రెడిట్ అంతా మిత్రుడు బాల్రెడ్డికే చెందుతుంది.
ఇక, ఈ వ్యాసాలన్నీ నమస్తే తెలంగాణలో ప్రచురితమవడానికి ప్రధాన కారకుడు అప్పటి ఎడిటర్ అల్లమన్న (మీడియా అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ).. ప్రేరకుడు నమస్తే తెలంగాణ అప్పటి సీఈఓ, ఇప్పటి ఎడిటర్ శేఖర్రెడ్డి సార్.. నిజానికి కాలమ్ రాయడానికి నన్ను ఒత్తిడి చేసింది వాళ్లిద్దరే. నమస్తే సంపాదకీయ పేజీలో అన్నీ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష, ఆంధ్రా పాలకుల వివక్ష, వివిధ రంగాల్లో వెనుకబాటుతనం వంటి అంశాలపైనే వ్యాసాలు వస్తున్నాయని, నువ్వు జాతీయ-అంతర్జాతీయ అంశాలపై రాయమని ప్రోత్సహించారు. ప్రతి వ్యాసాన్నీ చదివి మార్పులు సూచించారు. వాళ్లిద్దరికీ అలాగే నమస్తే తెలంగాణ దినపత్రిక యాజమాన్యానికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
తప్పులు లేకుండా, ఏమాత్రం కత్తిరించకుండా ఎడిట్ పేజీలో నా వ్యాసాలను అందంగా కూర్చిన మిత్రులు సామ మల్లారెడ్డి, ఆసరి రాజులకు కృతజ్ఞతలు. అడగగానే తన విలువైన సమయాన్ని కేటాయించి, నా వ్యాసాల వెనుక ఉన్న రాజకీయ అవగాహనను లోతుగా చర్చించి, ముందుమాట రాసి ఈ పుస్తకాన్ని సర్వసమగ్రం చేసిన ప్రముఖ విప్లవ రచయిత వరవరరావు సార్ కు విప్లవాభివందనాలు. అందంగా, అర్థవంతంగా కవర్ డిజైన్ చేసిన రమణజీవికి కృతజ్ఞతలు.
