మరోకోణం : మావోయిస్టుల ఓటమి.. సైనిక విశ్లేషణ

మావోయిస్టులు పరాజయం పొందడం వెనకాల ఉన్న ప్రధాన కారణాలను గత వారం రాశాను. ఈ వారం ఆ ఓటమిని సైనికంగా విశ్లేషిస్తాను. గత వారం పొందిన అనుభవం దృష్ట్యా.. ఈ సైనిక సమీక్ష రాయడానికి నాకున్న అర్హతలను పాఠకులకు చెప్పడం బాధ్యతగా భావిస్తాను. పూర్తికాలం కార్యకర్తగా 1983లో పార్టీలో చేరి 1988 నుంచి మిలిటరీ సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొన్నాను. ఆ సంవత్సరమే ప్రారంభమైన ‘‘జంగ్’’ మిలిటరీ పత్రికలో పనిచేశాను. 1989 మిలిటరీ క్యాంపులో శిక్షణ పొందిన అనంతరం పార్టీలోనే మిలిటరీ రంగానికి కేటాయించిన మొట్టమొదటి ఫుల్‌టైమర్ అయ్యాను.

1995 వరకూ జంగ్ వర్కింగ్ ఎడిటర్‌గా ఉంటూ ఎడిటోరియల్ బోర్డులో ఉన్న ఇద్దరు సీసీ సభ్యుల సాయంతో పత్రికను నడపడంతో పాటు మిలిటరీ సాహిత్యాన్ని జంగ్ స్టడీ సిరీస్, గెరిల్లా యుద్ధశాస్త్రంపై ట్రెయినింగ్ మాన్యువల్స్ రూపొందడంలో నా వంతు పాత్ర నిర్వహించాను. కొన్ని మిలిటరీ క్యాంపుల్లో శిక్షకుడిగా వ్యవహరించాను. 1989-1995 కాలంలో పలుమార్లు అడవికి, బయటకు తిరుగుతూ మిలిటరీ శాస్త్రంలో సిద్ధాంతం, ఆచరణ రెండింట్లో అనుభవం సంపాదించాను. శ్రీలంక తమిళ ఈలం, నేపాల్, ఫిలిప్పైన్స్, పెరూలో అప్పటికి ఉధృతంగా సాగుతున్న సాయుధ పోరాటాలను లోతుగా అధ్యయనం చేసి వ్యాసాలు, విశ్లేషణలు రాశాను.

1995 సెప్టెంబర్‌లో జంగ్‌ను వదిలి దండకారణ్యం(డీకే)లో పూర్తికాలం పనిచేయడానికి వెళ్లాను. మొదట అహెరి దళ కమాండర్/ఏరియా కమిటీ కార్యదర్శి/డివిజనల్ కమిటీ(డీవీసీ) సభ్యునిగా బాధ్యతలు నిర్వహించాను. 1997లో గడ్చిరోలి డీవీసీ కార్యదర్శిగా, ఎస్‌జడ్సీ సభ్యునిగా ప్రమోటయ్యాను. 1998 నుంచి 2000 ప్రారంభంలో బయటకు వచ్చేవరకూ సెంట్రల్ స్కోమా(సెంట్రల్ సబ్‌కమిటీ ఆన్ మిలిటరీ అఫైర్స్-తర్వాత ఏర్పడిన కేంద్ర మిలిటరీ కమిషన్‌కు ఇది తొలిరూపం) సభ్యునిగా, డీకే స్కోమా ఇన్చార్జిగా వ్యవహరించాను. నేను ఎందుకు బయటకు వచ్చానో నా ‘‘మరోకోణం’’ పుస్తకం నా మాటలో వివరంగా రాశాను.

మావోయిస్టు పార్టీ సైనిక ఓటమికి కారణాలు:
1. ప్రత్యేక తమిళ ఈలం కోసం సుదీర్ఘకాలం పోరాడిన ఎల్టీటీఈ 2009 మేలో శ్రీలంక ఆర్మీ చేతిలో ఓటమి పొందింది. ఆ దేశ ఉత్తర, పూర్వ తమిళ ప్రాంతాల్లోని మెజారిటీ భూభాగాన్ని సుమారు పాతికేళ్ల పాటు తన కంట్రోలులో ఉంచుకుని, పాలించి, 40వేలకు మించిన రెగ్యులర్ సైన్యాన్ని కలిగిన ఎల్టీటీఈ.. స్థావరయుద్ధంలో ఇరుక్కుపోయి చివరకు పరాజయం పాలైంది. వేలాది మంది గెరిల్లాలు, కమాండర్లు చివరి వరకూ పోరాడి, అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్‌ సహా అందరూ వీరోచిత మరణం పొందారు.

2. ఈ చారిత్రక పరిణామాన్ని మావోయిస్టు పార్టీ 2010లో సమగ్రంగా సమీక్షించింది. క్రాంతి పత్రికలో ఈలం-1, 2, 3, 4 దశల యుద్ధాల్లో శ్రీలంక ప్రభుత్వ బలగాలు, ఎల్టీటీఈ బలగాలు చేపట్టిన వ్యూహం-ఎత్తుగడలను వివరించింది. చివరలో, ‘‘ఎల్టీటీఈ ఓటమి-గుణపాఠాలు’’ శీర్షికతో టైగర్ల పరాజయానికి కారణాలను 8 పాయింట్లుగా ఇచ్చింది. ఇందులోని 2వ పాయింటు సారాంశం ఇలా ఉంది.

‘‘భూభాగాన్ని కోల్పోతున్నామని, శత్రు బలగాల చుట్టివేతకు గురవుతున్నామని తెలిసి కూడా ఎల్టీటీఈ తన స్థావర యుద్ధతంత్రాన్ని వదలలేదు. చివరి వరకూ అది పొజిషనల్ వార్‌ఫేర్‌నే అనుసరించింది. అలా కాకుండా టైగర్లు తమ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్‌ను విస్తరించి, గెరిల్లా యుద్ధతంత్రానికి మారాల్సివుండింది. అలా చేయని ఫలితంగా అది సైనిక విన్యాసాలు చేసే చొరవను కోల్పోయింది. చివరి వరకూ పోరాడితే, తమిళ ప్రజలపై మారణకాండను చూసి అంతర్జాతీయ సముదాయం స్పందించి, జోక్యం చేసుకుని యుద్ధం ఆపుతారని అది ఆశించింది. అది జరగక భంగపడింది.’’

3. టైగర్ల ఓటమిని మావోయిస్టు పార్టీ సరిగ్గానే సమీక్షించింది. తమిళ ప్రాంతాల వైశాల్యమే పరిమితమైనప్పుడు, అందులోని తమ ఏరియా కుంచించుకుపోతున్నప్పుడు ఎల్టీటీఈ ఒకచోట ఉండి చేసే స్థావర యుద్ధాన్ని అనుసరించాల్సింది కాదని చెప్పింది. సుదీర్ఘకాలం కొంత భూభాగాన్ని తన కంట్రోలులో ఉంచుకుని, పాలించిన టైగర్లు దాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడలేదని వివరించింది. రెగ్యులర్ ఆర్మీ, నేవీ, ఏయిర్‌ఫోర్స్ ఉన్నా, ఏళ్ల తరబడి పోరాడిన అనుభవం ఉన్నా కానీ, సైనిక విన్యాసాలు చేయడానికి తగినంత భూభాగం లేనప్పుడు, చుట్టివేతకు గురైనప్పుడు వాళ్లు అక్కడి నుంచి బయటకు వచ్చి గెరిల్లా యుద్ధం చేయాల్సివుండిందని అభిప్రాయపడింది. అంతర్జాతీయ సముదాయం మద్దతుపై అతి అంచనా వేసుకుని భంగపడిందని విమర్శించింది.

4. అయితే, ఎల్టీటీఈ అనుసరించిన సైనిక వ్యూహం-ఎత్తుగడలను సరైన రీతిలో విశ్లేషించిన మావోయిస్టు పార్టీ, తాను కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నప్పుడు ఆ గుణపాఠాన్ని పరిస్థితులకు తగ్గట్లుగా ఆన్వయించుకోవడంలో విపలమైంది. టైగర్లలాగే పీఎల్జీఏ బలగాలు కూడా పరిమిత ప్రాంతంలో(నారాయణపూర్, బీజాపూర్, సుక్మా జిల్లాల్లోని చెప్పుకోదగిన ప్రాంతం) ఇరుక్కుపోయాయి. పోలీసు, పారా మిలిటరీ బలగాలు ఆపరేషన్ కగార్‌లో భాగంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. కార్పెట్ సెక్యూరిటీ క్యాంపింగ్ ఎత్తుగడలను అవలంభిస్తూ క్రమ పద్ధతిలో దట్టమైన అడవుల లోలోపలకు చొచ్చుకు వస్తున్నాయి. చుట్టివేత దాడులకు పూనుకుంటున్నాయి. మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ మెయిన్ ఫోర్స్, సెకండరీ ఫోర్స్, ప్రజా మిలీషియా బలగాలు అన్నీ కలిపినా ఓ ఐదు వేలకు మించి వుండవు. 300 క్యాంపుల్లో ఉన్న భద్రతాబలగాలు కనీసం రెండు లక్షలు ఉంటాయి. ఆ విషయాన్ని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో తన 2024 ఆగస్టు సర్క్యులర్‌లో వెల్లడించింది. అయినప్పుడు శత్రు దాడిని ప్రతిఘటించడానికి, బలగాలను రక్షించుకోవడానికి ఎలాంటి వ్యూహం-ఎత్తుగడలను చేపట్టి ఉండాల్సింది? టైగర్ల ఓటమి నుంచి నేర్చుకున్న గుణపాఠాలను తమ పరిస్థితులకు అన్వయించుకుని తగిన నిర్ణయాలు తీసుకుని వుండాలి కదా..

5. కానీ కేంద్ర కమిటీ కాని, పొలిట్‌బ్యూరో కాని, కేంద్ర మిలిటరీ కమిషన్ కానీ ఆ కర్తవ్యం నెరవేర్చడంలో విఫలమయ్యాయి. 2010లోనే ఎల్టీటీఈ ఓటమికి తాము చెప్పుకున్న కారణాలను గమనంలోకి తీసుకోలేదు. 2024 జనవరిలో మొదలైన కగార్ దాడి తీవ్రత తెలుస్తున్నప్పటికీ, చుట్టివేతకు గురవుతున్నామని అర్థమవుతున్నప్పటికీ తమ రాజకీయ, మిలిటరీ వ్యూహం-ఎత్తుగడలను మార్చుకోవడంలో ప్రాప్తకాలజ్ఞత(స్పాంటేనిటీ)కి గురయ్యాయి.

6. 2024 ఆగస్టు సర్క్యులర్‌లో ఆపరేషన్ కగార్ గురించిన అంచనాలను పొలిట్‌బ్యూరో సరిగ్గానే ఇచ్చింది. జనవరిలో ప్రారంభమైన ఈ యుద్ధచర్యలో శత్రువు ఇదివరకెన్నడూ లేని స్థాయిలో భారీ దాడికి పూనుకుంటున్నాడని వివరించింది. గతంలో కొనసాగిన ఆపరేషన్ గ్రీన్‌హంట్‌, ఆపరేషన్ సమాధాన్‌లకు ఈ కగార్ పూర్తి భిన్నమైనదని తెలిపింది.

7. కగార్ యుద్ధ లక్ష్యం మావోయిస్టుల నుంచి బస్తర్ ప్రాంతాన్ని, ప్రత్యేకించి అబూజ్మాడ్, దక్షిణ బస్తర్ గెరిల్లా స్థావరాలను 2025 చివరకల్లా విముక్తి చేయడంగా హోంమంత్రి అమిత్ షా నిర్దేశించారని సర్క్యులర్‌లో వివరించింది. అన్ని రకాల బలగాలు కలిపి బస్తర్‌లో సుమారు ఏడు లక్షలు ఉంటాయని అలర్ట్ చేసింది. ఈ బలగాలు అత్యాధునిక టెక్నాలజీని, శాటిలైట్స్, డ్రోన్స్‌, నైట్ విజన్ డివైసెస్‌ను వాడుతున్నాయని తెలిపింది.

8. కగార్ దాడి ప్రధానంగా చుట్టివేత దాడుల రూపంలో కార్పెట్ క్యాంపింగ్ ద్వారా జరగనుందని కూడా పొలిట్‌బ్యూరో అంచనా వేసింది. కార్పెట్ క్యాంపింగ్ అంటే ఉద్యమ ప్రాంతాలను చిన్న చిన్న క్లస్టర్లుగా విభజించి ప్రతి 5 నుంచి 10 కి.మీ.లకు ఒక క్యాంపును ఏర్పాటు చేయడమని తెలిపింది. ఫలితంగా పీఎల్జీఏ బలగాల మొబిలిటీకి పరిమితులు ఏర్పడతాయని, బెటాలియన్, కంపెనీ స్థాయి పెద్ద ఫార్మేషన్లు తిరగడం కష్టమవుతుందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో దాడులు చేస్తున్నప్పుడు తప్ప మిగతా అన్ని సమయాల్లో ఎనిమిది మందితో కూడిన సెక్షన్ల రూపంలోనే తిరగాలని, ఆత్మరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది.

9. అయితే, కగార్ దాడిపై ఇన్ని జాగ్రత్తలను చెప్పిన పొలిట్‌బ్యూరో కీలకమైన నిర్ణయం తీసుకోవడంలో బ్లండర్ మిస్టేక్ చేసింది. ఆ సర్య్కులర్‌లోని 25వ పేజీలో, ఇతర పేజీల్లో ఇలా చెప్పింది. ‘‘మన ప్రధాన బలగాలను, ప్రధాన నాయకత్వాన్ని యుద్ధరంగం నుంచి పాక్షికంగా ఎక్కువ కాలం దూరంగా తరలించడం.. వ్యూహాత్మక తిరోగమనం(స్ట్రాటజికల్ రిట్రీట్) కిందికి వస్తుంది. ప్రధాన బలగాలు మినహా ఇతర ద్వితీయ, తృతీయ బలగాల్లో కొంత భాగాన్ని, పార్టీ నాయకత్వంలో కొంత భాగాన్ని యుద్ధరంగం నుంచి పాక్షికంగా తక్కువకాలం దూరంగా తరలించడం.. ఎత్తుగడల రీత్యా తిరోగమనం(టాక్టికల్ రిట్రీట్) కిందికి వస్తుంది.’’

10. ‘‘ప్రస్తుతం(2024 ఆగస్టు) డీకే గెరిల్లా జోన్‌లో మనం చేపట్టాల్సింది టాక్టికల్ రిట్రీట్. ప్రధాన బలగాలను ఇక్కడే ఉంచి, ఇతర బలగాలలో, పార్టీ నాయకత్వంలో కొంత భాగాన్ని కార్పెట్ సెక్యూరిటీ ఉన్న ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు తరలించాలి. ఇక్కడున్న ప్రధాన బలగాలు మారిన పరిస్థితుల్లో చిన్న ఫార్మేషన్లుగా తిరగాలి. దాడుల సమయంలో కలవడం, తర్వాత విడిపోవడం ప్రాతిపదికన బెటాలియన్లు, కంపెనీలు, ప్లాటూన్లు పనిచేయాలి.’’

11. పై నిర్ణయమే మావోయిస్టు పార్టీ, పీఎల్జీఏ బలగాల పాలిట అశనిపాతంలా పరిణమించిందని తదుపరి జరిగిన పరిణామాలను బట్టి చెప్పవచ్చు. సర్య్కులర్‌లో పొలిట్‌బ్యూరో చెప్పిన ప్రభుత్వ కగార్ యుద్ధవ్యూహాన్ని, ఎత్తుగడలను మిలిటరీపరంగా విశ్లేషిస్తే అబూజ్మాడ్, దక్షిణ బస్తర్ ప్రాంతాల నుంచి పార్టీ చేయాల్సింది టాక్టికల్ రిట్రీట్ కాదు. స్ట్రాటజికల్ రిట్రీట్ చేయాలి. భారత మిలిటరీ, పారా మిలిటరీ బలగాల సంఖ్య, ఆయుధసంపత్తి, వనరులతో పోల్చితే, మావోయిస్టు బలగాలకు హస్తి మశకాంతరం వంటి తేడా ప్రస్ఫుటంగా కనపడుతుంది. కేవలం నారాయణపూర్, బీజాపూర్, సుక్మా జిల్లాల్లోని పరిమిత ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన మెయిన్ ఫోర్స్‌గా ఉన్న ఒక బెటాలియన్, కొన్ని కంపెనీలు, సెకండరీ ఫోర్స్‌గా ప్లాటూన్లు, సెక్షన్లు యుద్ధ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నాయి. శత్రువు ప్రతి 5 నుంచి 10 కిమీ.ల పరిధిలో 500-1000 మంది బలగాలతో కూడిన ఒక క్యాంపును కార్పెట్ సెక్యూరిటీలో భాగంగా ఏర్పాటు చేస్తూ చుట్టుముడుతున్న విషయాన్ని పొలిట్‌బ్యూరో పట్టించుకోలేదు.

12. 2024 ప్రారంభంలోనే ఈ పరిస్థితి ఉందంటే సమీప భవిష్యత్తులో మరిన్ని క్యాంపులు ఏర్పాటుచేసి గెరిల్లా ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టి, దాడులు కొనసాగిస్తారనే అంచనాకు అది రావాల్సివుండింది. మూడు జిల్లాల ప్రాంతంలో మొత్తం 300 పోలీసు క్యాంపులు ఉన్న పరిస్థితుల్లో గెరిల్లా బలగాలు మనగలగడం కష్టమని పొలిట్‌బ్యూరో గుర్తించి వ్యూహాత్మక రిట్రీట్‌(స్ట్రాటజికల్ రిట్రీట్‌)కు నిర్ణయం తీసుకోవాల్సింది. ప్రధాన బలగాలను, సీసీ ప్రధాన కార్యదర్శి సహా ముఖ్య నాయకత్వాన్ని డీకేకు బయటి ప్రాంతాలకు ఒక ప్లాన్ ప్రకారం తరలించాల్సివుండింది.

13. ఈ తప్పుడు నిర్ణయమే తదుపరి భద్రతా బలగాలు క్రమంగా గెరిల్లా ప్రాంతాలను చుట్టుముడుతూ, ఒక్కో గ్రామాన్ని స్వాధీనంలోకి తీసుకుంటూ విజయం పొందడానికి దారితీసింది. మారుమూల అడవుల్లోకి, అబూజ్మాడ్‌లోని షెల్టర్ జోన్లలోకి చొచ్చుకురావడం, చుట్టుముట్టడం, కార్డన్ సెర్చ్ చేసి మావోయిస్టు నాయకత్వాన్ని, కేడర్లను నిర్మూలించడం జరిగిపోయింది. బసవరాజ్ సహా పలువురు కేంద్ర కమిటీ సభ్యులు, ఇతర స్పెషల్ జోన్, డివిజన్, ఏరియా స్థాయి పార్టీ నేతలు, కేడరు, పీఎల్జీఏ కమాండర్లు, గెరిల్లాలు ఇలాంటి చుట్టివేత దాడుల్లోనే మరణించారు.

14. బెటాలియన్, కంపెనీ స్థాయి ఫార్మేషన్లను గెరిల్లా స్థావర ప్రాంతాల్లోనే ఉంచిన ఫలితంగా వాటి కదలికలను, క్యాంపుల ఉనికిని పోలీసులు డ్రోన్స్, శాటిలైట్స్ ద్వారా చాలా సులభంగా గుర్తించగలిగారు. ప్రభుత్వ బలగాల కంట్రోలులోకి వచ్చిన గ్రామాల్లో ఏర్పరచుకున్న ఇన్ఫార్మర్ నెట్వర్క్ కూడా వారికి బాగా ఉపయోగపడింది. వచ్చిన సమాచారాన్ని వాడుకుని, టెర్రయిన్ పైన పట్టున్న స్థానిక ఆదివాసీలతో కూడిన డీఆర్‌జీ బలగాల సహకారంతో దాడులు చేసి తీవ్ర నష్టాలను కలిగించింది.

15. మొత్తంగా చూస్తే, కేవలం 40-50 లక్షల మంది జనాభా కలిగి పరిమిత ప్రాంతంలో చేస్తున్న సాయుధ పోరాటం బయటి సమాజపు నైతిక, రాజకీయ, ఆర్థిక మద్దతు లేకుండా ఎక్కువకాలం మనలేదనే విషయాన్ని గుర్తించడంలో మావోయిస్టు నాయకత్వం విఫలమైంది. మిగతా దేశం సంగతి వదిలేసినా, డీకేలోనే ప్రజల మద్దతు తగ్గుతున్నదని 2011లో తీర్మానించిన విషయాన్ని.. ఆ తర్వాత 13 ఏళ్లు గడిచినా గుర్తించకపోవడం, స్థల కాల పరిస్థితులకు తగిన నిర్ణయాలు తీసుకోకపోవడం చివరకు అనివార్య పరాజయానికి దారి తీసిందని చెప్పవచ్చు.

నోట్: ఇది కేవలం సైనిక సమీక్ష మాత్రమే. గత వారం రాసిన రాజకీయ విశ్లేషణతో ఆన్వయించి అర్థం చేసుకోవాలి.

– దూడెం మార్కండేయ
దిశ ఎడిటర్
editor@dishadaily.com

మరోకోణం: మావోయిస్టుల ఓటమి.. రాజకీయ విశ్లేషణ – Marokonam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version