మాజీ మంత్రి ఈటల రాజేందర్ త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న చర్చ రాష్ట్రంలో జోరుగా నడుస్తోంది. ఇటీవల మీడియాకు ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో ఆయన ఈ మేరకు సంకేతాలివ్వడం ఇందుకు కారణం కావచ్చు. వివిధ పార్టీలకు, ప్రజాసంఘాలకు చెందిన పలువురు నేతలను రహస్యంగానో, బహిరంగంగానో కలువడం కూడా ఈ చర్చకు తోడైంది. అయితే, బీజేపీ అగ్రనేతలు ఈటలతో టచ్‌లో ఉన్నారని, ఆయన ఆ పార్టీలో చేరడం ఖాయమని.. కాదు, రేవంత్‌రెడ్డితో జతకట్టి కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించబోతున్నారని వాదించేవాళ్లు కూడా లేకపోలేదు. ఇప్పటికే రాష్ట్రంలో టీఆర్ఎస్ సహా మూడు ప్రధాన రాజకీయ పార్టీలు, మరో నాలుగైదు చిన్నాచితక పార్టీలు ఉన్నాయి. ఉన్న ప్రతిపక్ష పార్టీలకే తగినంత ఆదరణ లేని పరిస్థితుల్లో కొత్త పార్టీని తెలంగాణ ప్రజానీకం ఆదరించి అక్కున చేర్చుకుంటారా? ఓట్లేసి గెలిపిస్తారా? అన్న ప్రశ్నలు కూడా తలెత్తడం సహజమే.
ఉమ్మడి రాష్ట్రాన్ని సుమారు 42 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో అందరికీ తెలిసిన విషయమే. నడిపించే నాయకుడు లేకుండా, ఎవరు ముందుంటే వాళ్లను వెనక్కి లాగేసే ఎండ్రికాయల కథ ఆ పార్టీలో నడుస్తోంది. ప్రజలను కూడగట్టే మాటటుంచి కార్యకర్తలను సమీకరించడం కూడా దానికి చేతకావడంలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీయే టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయమన్న టాక్ జనంలో ఉండేది. ఎన్నికల తర్వాత పలువురు ఎమ్మెల్యేలు అధికారపార్టీలోకి ఫిరాయించడం, ముఖ్యనేతల మధ్య అంతర్గత తగువులాటలు దాని ప్రతిష్ఠను దిగజార్చాయి. రెండేళ్ల నుంచి రథసారథిని ఎంపిక చేసుకోలేని కడుదీన స్థితి ఆ పార్టీది.
కాంగ్రెస్ బలహీనతలను ఆసరా చేసుకుని రాష్ట్రంలో వేగంగా బలపడుతున్న పార్టీ బీజేపీ. కేంద్రంలో అధికారంలో ఉండడం, మోడీ, అమిత్‌షా లాంటి అగ్రనేతలు తెలంగాణపై కేంద్రీకరించడం, స్థానికంగా కూడా బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లాంటి యువనేతలు ముందుండడం ఆ పార్టీకి కలిసివచ్చింది. దుబ్బాక అసెంబ్లీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించి ఆ పార్టీ దూసుకెళ్తున్నట్టే కనిపించింది. అయితే, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీ సర్కారుతో మితృత్వం నెరపడం, వాళ్లిద్దరి మధ్య రాజీ ఒప్పందం కుదిరిందన్న వార్తల నేపథ్యంలో ఇటీవల ఆ పార్టీ స్థానిక నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. కాంగ్రెస్‌ను కోలుకోకుండా చేయడమనే ఉమ్మడి లక్ష్యానికి అనుగుణంగా మోడీ-కేసీఆర్ వ్యూహాత్మకంగా కలిసి నడుస్తున్నారన్న చర్చ రాజకీయవర్గాల్లో ఉంది. సాగర్ ఉపఎన్నికలో ఈ విషయం ప్రస్ఫుటమైంది. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటుందని విశ్వసించడం కష్టమే. పైగా జనాభాలో 15 శాతానికి పైగా మైనారిటీలు, నక్సలైట్ ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో హిందూ మతతత్వ నినాదాలు ఎంత వరకు ఓట్లను రాబడతాయన్నదీ ప్రశ్నార్థకమే.
ఇక, టీడీపీ, సీపీఐ, సీపీఎం లాంటి పార్టీలు రాష్ట్రంలో దాదాపు తమ ఉనికిని కోల్పోయాయి. దళితనేత మంద క్రిష్ణ ఎమ్మార్పీయస్‌ను పార్టీగా మార్చినా ఇంతవరకు అది తన గుర్తింపును చాటుకోలేదు. వైఎస్ తనయ షర్మిల కూడా తను పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించినా, పక్కరాష్ట్ర ముఖ్యమంత్రికి స్వయానా చెల్లెలు అయిన కారణంగా ఆమె చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారని ఆశించలేం. పైగా ఆమెకు ఉద్యమ చరిత్ర కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మరో కొత్త పార్టీ ఏర్పడి అధికార టీఆర్ఎస్‌ను సమర్థవంతంగా ఢీకొంటుందని భావించడం సాధారణ పరిస్థితుల్లో అయితే కష్టమే. కాని, కేసీఆర్‌తో భుజం కలిపి నడిచి, తెలంగాణ కోసం సర్వస్వం ధారపోసి, పోటీచేసిన ప్రతి ఎన్నికలో గెలుస్తూ పదమూడేళ్ల పాటు సుదీర్ఘంగా పోరాడిన ఈటల రాజేందర్ నేతృత్వంలో కొత్త ప్రాంతీయ పార్టీ ఏర్పడితే అది ప్రత్యేక సందర్భమే అవుతుంది. ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా ఉన్న రేవంత్‌రెడ్డి, అంతగా రాజకీయ అనుభవం లేని బండి సంజయ్‌ల కంటే ఈటల అన్ని కోణాల్లో పైచేయి కలిగివుంటాడనడంలో ఎవరికీ సందేహం ఉండకపోవచ్చు. వారిద్దరికీ లేని తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఈటలకు ఉపకరించవచ్చు. పార్టీ పెట్టి ఓ కోదండరాం చేయలేని పనిని ఈటల చేయగలడనే నమ్మకం కూడా ఎక్కువమందిలో ఉండివుండవచ్చు.
ఇక్కడ మనం తమిళనాడు పరిస్థితిని ఉదహరణగా తీసుకోవచ్చు. 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి సుమారు పదిహేనేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ తదనంతరం నామరూపాల్లేకుండా పోయింది. బీజేపీ సహా ఇతర ఏ జాతీయ పార్టీ అక్కడ ఇప్పటివరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ గెలవడం కాదు కదా.. కనీసం గౌరవప్రదమైన సీట్లను సాధించడంలో ఘోరంగా విఫలమయ్యాయి. ప్రత్యేక ద్రవిడనాడు నినాదంతో ఉద్యమించి, రాజభాష పేరుతో హిందీని రుద్దడంపై సుదీర్ఘంగా పోరాడి, అస్తిత్వ రాజకీయాలను అంటిపెట్టుకుని ఉన్న డీఎంకే (ద్రవిడ మున్నేట్ర కజగం) 1967లో అక్కడ అధికార పగ్గాలు చేపట్టింది. ఆ తర్వాత 54 ఏళ్లు గడిచినా ద్రవిడేతర పార్టీలేవీ అక్కడ ప్రజాదరణకు నోచుకోలేదు. చివరకు, ముఖ్యమంత్రి కరుణానిధికి సహచరుడిగా, ఆప్తమిత్రుడిగా ఉన్న ఎం జీ రామచంద్రన్ (ఎంజీఆర్) 1972లో పార్టీని చీల్చి ఏఐఏడీఎంకే (ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం)ను ఏర్పాటుచేసిన తర్వాత గాని అధికార మార్పిడి జరగలేదు. అప్పటినుంచి ఆ రెండు పార్టీలు కుండమార్పిడి పద్ధతిలో రాష్ట్రాన్ని పాలిస్తున్నాయి.
నేడు తెలంగాణలో కూడా సరిగ్గా అలాంటి పరిస్థితే ఉన్నది. ఇక్కడ కూడా తెలంగాణ అస్తిత్వ పోరాటం నడిచి విజయవంతమై టీఆర్ఎస్ అధికారం చేపట్టింది. ఉద్యమసారథి ముఖ్యమంత్రయ్యారు. ఏడేళ్లు గడిచింది. కేసీఆర్ పాలనపై ప్రజల్లో క్రమక్రమంగా వ్యతిరేకత పెరిగిపోతున్నది. అయినా ఆయనకు ప్రత్యామ్నాయం కనిపించడంలేదు. ఈ పరిస్థితుల్లో ఆయనకు సహచరుడిగా, ప్రధాన అనుచరుడిగా, విశ్వాసపాత్రుడిగా ఉన్న ఈటల ఇప్పుడు తిరగబడ్డారు. కొవిడ్ పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానంటున్నారు. ఎంజీఆర్ లాగా సఫలమవుతారా? లేక కోదండరాం లాగా విఫలమవుతారా? అన్నది ఆయన అనుసరించబోయే వ్యూహం పైన, రాజకీయ విధానాల పైన, ప్రజాకర్షక కార్యక్రమాల పైన ఆధారపడివుంటుంది. మన రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీలకు ఇక కాలం చెల్లినట్లేనా? ఇకముందు, తెలంగాణ పేరు తగిలించుకున్న పార్టీలకే ఆదరణ ఉంటుందా? ఈటల విఫలమైన పరిస్థితుల్లో ఏ హరీశ్‌రావో.. ఇంకే నాయకుడో ఆ పని చేయాల్సిందేనా? రాష్ట్రంలో తమిళనాడు తరహా రాజకీయాలు రావాల్సిందేనా? ఇలాంటి విషయాలన్నీ ఆసక్తికరమైనవి.. ఆహ్వానించదగినవి..
-డి మార్కండేయ
(దిశ సౌజన్యంతో..)