Friday, January 9, 2026

మల్లోజుల, ఆశన్న ఆధ్వర్యంలో త్వరలో కొత్త మావోయిస్టు పార్టీ.. ఏర్పడేది అప్పుడే!

మాజీ మావోయిస్టులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనూ, తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నల నేతృత్వంలో త్వరలో ఒక కొత్త మావోయిస్టు పార్టీ రూపుదిద్దుకోనున్నది. సాయుధ బాటలో కాకుండా భారత రాజ్యాంగ పరిధిలో పని చేయనున్నది. ఒక జాతీయ పత్రికకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆశన్న ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. ‘‘మీ భవిష్యత్తు కార్యక్రమం ఏమిటి? బస్తర్‌లోనే ఉంటారా? లేక స్వస్థలం వరంగల్ వెళతారా? అన్న ప్రశ్నకు ఆయన కొత్త పార్టీ విషయం ప్రస్తావించారు. ‘‘ప్రజల కోసం రాజ్యాంగ పరిధిలో పని చేస్తామని, మరోమారు ఆయుధాలు చేపట్టబోమని స్పష్టం చేశారు. పునరావాసంగా వచ్చే 40 లక్షల కోసం తాము జనజీవన స్రవంతిలోకి రాలేదని, ఆ డబ్బును తాను ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం వినియోగిస్తానని వివరించారు. కొత్త సంస్థను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నుంచి భూమిని అడుగుతామని, ఏ రకమైన వ్యాపారం చేయబోనని తెలిపారు.

పునరావాసమా? కొత్త పార్టీయా..?

అక్టోబర్‌లో 60 మంది మావోయిస్టు కేడర్లతో సోనూ, 210 మందితో ఆశన్న ఆయుధాలతో సహా లొంగిపోయిన తర్వాత.. లొంగుబాట్ల పర్వం వరసగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణ డీజీపీ ఎదుట కూడా 41 మంది నక్సలైట్లు 24 ఆయుధాలతో లొంగిపోయారు. ఇంటెలిజన్స్ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టు కేడర్ల సంఖ్య 600కు పైనే ఉంటుంది. వీరందరూ ప్రస్తుతం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఉంటున్నారు. కేంద్ర హోం శాఖ విధించిన ఆరు నెలల గడువు తర్వాత వీరందరూ ప్రజల్లోకి వస్తారని, వారి ఇష్టాఇష్టాలను బట్టి తమ ఇళ్లకు వెళ్లిపోవడమో, ప్రభుత్వ పునరావాసంలో భాగంగా ఏదో ఒక ఉపాధి పొందడమో జరుగుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పోలీసు అధికారి చెప్పారు. అయితే, ఇప్పుడు ఆశన్న చెప్పిన విషయాన్ని బట్టి వారిలో కొంత మంది కొత్త పార్టీలో చేరి పని చేయవచ్చునని కూడా ఆయన వివరించారు.

పార్టీ పేరు ఎలా ఉంటుంది?

సుమారుగా 2026 ఏప్రిల్, మే నెలల్లో కొత్త పార్టీ ఏర్పడవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. కొత్త పార్టీ పేరులో మావోయిస్టు లేదా కమ్యూనిస్టు అనే పదాలు ఉంటాయా? అది కూడా సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) పార్టీల లాగే చట్టబద్ధంగా పనిచేస్తుందా? ఎన్నికల్లో పాల్లొంటుందా? తదితర విషయాలు భవిష్యత్తులో వెలుగులోకి రానున్నాయి.

Latest News