మావోయిస్టు పార్టీకి షెల్టర్ జోన్‌గా తెలంగాణ ఉపయోగపడుతోందా? ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కగార్ దాడులు తీవ్రంగా కొనసాగుతున్న వేళ.. మిగిలిన మావోయిస్టులందరూ సరిహద్దు దాటి ఇటువైపు వచ్చారా? కొంతకాలం కర్రెగుట్టల్లో తలదాచుకుని ఇప్పుడు తెలంగాణలోని వివిధ జిల్లాలకు చేరారా? అగ్రనేతలు దేవ్‌జీ, దామోదర్, పాపారావు కూడా వీరిలో ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు మావోయిస్టు వ్యవహారాల విశ్లేషకులు. ఇటీవల డీజీపీ ఎదుట లొంగిపోయిన ఫస్ట్ బెటాలియన్ కమాండర్ బార్సె దేవా చెప్పిన అంశాలు ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయని వాళ్లంటున్నారు. గత రెండు రోజులుగా వివిధ తెలుగు, జాతీయ చానెళ్లకు, పత్రికలకు ఇంటర్వ్యూలిస్తున్న దేవా పలు విషయాలను కెమెరా ముందు కాకుండా ఆఫ్ ద రికార్డుగా చెప్పాడని అంటున్నారు. తనను ఇంటరాగేట్ చేసిన ఇంటెలిజెన్స్ అధికారులకు దేవా ఇంత కంటే ఎక్కువే చెప్పి ఉంటాడని వాళ్లు అంచనా వేస్తున్నారు.
హిడ్మా కూడా కరీంనగర్‌లోనే..?
ఒక హిందీ చానెల్ కోసం దేవా ఇంటర్వ్యూ తీసుకున్న విలేకరి ఈ విషయాన్ని తన రిపోర్టులో ఉటంకించారు. కర్రె గుట్టల నుంచి సెప్టెంబర్ చివరలో తెలంగాణకు వచ్చినట్టు, తర్వాతి కాలంలో నెలన్నర, రెండు నెలల పాటు కరీంనగర్ సిటీలో షెల్టర్ తీసుకున్నట్టు ఆఫ్ ద రికార్డుగా దేవా తనకు చెప్పాడని ఆ రిపోర్టర్ వివరించారు. అనగా అరెస్టయినట్టుగా చెబుతున్న డిసెంబర్ 29కి ముందు.. అక్టోబర్ 1 తర్వాత మూడు నెలల కాలంలో దేవా బృందం కరీంనగర్‌లో గడిపింది.
అలాగే ‘‘అక్టోబర్ 26 వరకూ హిడ్మా తనతోనే ఉన్నాడని, 27న తన నుంచి విడిపోయి విజయవాడ వెళ్లాడని, నవంబర్‌లో ఎన్‌కౌంటర్ అయ్యాడని’’ దేవా చెప్పాడు. అంటే హిడ్మా కూడా అక్టోబర్ 1 నుంచి 27 వరకూ కరీంనగర్‌లోనే దేవాతో ఉన్నాడని భావించవచ్చా? అనే విషయాన్ని విశ్లేషకులు ఎత్తి చూపుతున్నారు. తెలంగాణ నుంచే హిడ్మా విజయవాడ వెళ్లాడని గతంలో మీడియాలో వార్తలు వచ్చిన విషయం గమనిస్తే ఇది నిజమేనని భావించవచ్చునని వాళ్లంటున్నారు.
దేవ్‌జీ, దామోదర్ తదితరుల కోసం గాలింపు?
ఈ నేపథ్యంలోనే పోలీసులు అలర్ట్ అయ్యారని తెలుస్తోంది. దేవ్‌జీ, దామోదర్, పాపారావు వంటి మిగిలిన మావోయిస్టు అగ్రనేతలు కూడా తెలంగాణలోనే ఎక్కడో ఒకచోట షెల్టర్ తీసుకుని వుండవచ్చునని వాళ్లు అనుమానిస్తున్నారు. దేవా పట్టుబడిన విధంగానే వాళ్లు కూడా త్వరలోనే దొరకడమో, లొంగిపోవడమో జరుగుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయా నేతల లొంగుబాటుకు పోలీసులు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. లొంగుబాటు చూపించే వరకూ దేవా, కంకణాల రాజిరెడ్డిల ఆనుపానులు వెల్లడించని పోలీసులు.. మిగతావారి విషయంలో కూడా అదే ధోరణి అవలంభించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. అకస్మాత్తుగా ఏదో ఒకరోజు మిగతా నేతల లొంగుబాట్లను కూడా ప్రకటించే అవకాశముందని అంటున్నారు.
