38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఏర్పాట్లు ఎన్టీఆర్ స్టేడియంలో వేగంగా జరుగుతున్నాయి. కరోనా తర్వాత బుక్ ఫెయిర్‌కు వచ్చే సందర్శకుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ముఖ్యంగా ఈతరం యువతీ యువకులు, జెన్‌జీ తరం సైతం పెద్దయెత్తున వచ్చి పుస్తకాలు కొంటున్నారు. జిల్లాల నుంచి కూడా సందర్శకులు వచ్చి చూసి పోతున్నారు. ఆ పది రోజులూ హైదరాబాద్ వీధులు పుస్తకాల శోభను సంతరించుకుంటున్నాయనడంలో కూడా అతిశయోక్తి లేదు.
ప్రముఖులు కలిసే చోటు..
బుక్ ఫెయిర్ అనేది కొత్త, పాత పుస్తకాలను చూడడానికి, పరిచయం చదివి కొనాలో లేదో డిసైడ్ కావడానికే కాకుండా పుస్తక ప్రియులు, కవులు, రచయితలు ఒక చోట కలిసి వివిధ సామాజిక విషయాలపై అభిప్రాయాలను పంచుకోవడానికి కూడా ఉపయోగపడుతున్నది. పుస్తకాల ఆవిష్కరణ అనేది మరో ఉత్తేజకరమైన కార్యక్రమంగా, తెలంగాణ సమాజంలో ప్రముఖులుగా పేరుగాంచిన వ్యక్తులను చూసి, పరిచయం చేసుకునేందుకు ఈ తరానికి వేదికగా కూడా ఉపయోగపడుతున్నది. ఎన్ని రోజులు ఎంత శ్రమకోర్చి తిరిగినా కలువని వాళ్లు ఇక్కడ కలుస్తారు.
నా మటుకు నేను పుస్తకాలను చూడడానికే కాకుండా నా మిత్రులను, పరిచయమున్న వారిని, ఇతర ప్రముఖులను కలువడానికి ఉపయోగించుకుంటాను. ఒక బుక్ ఫెయిర్ లో చూసినవాళ్లను మళ్లీ మరో బుక్ ఫెయిర్ లోనే కలిసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. సో.. ఈసారి కూడా మరింత మంది మిత్రులను కలువడానికి ఎక్కువ రోజులు ఫెయిర్ కు రావడానికి ప్లాన్ చేసుకుంటాను.
డిజిటల్ తెరకు దూరం అవగలమా?
చివరగా, బుక్ ఫెయిర్ కు వచ్చినవాళ్లు పుస్తకాలు కొనడంలో చూపించిన ఉత్సాహాన్ని వాటిని వీలైనంత త్వరగా చదవడానికి ఉపయోగించాలి. ఎందుకంటే మొబైల్స్, టాబ్లెట్స్, లాప్‌టాప్‌లు, డెస్క్ టాప్‌లపై చదవడం అలవాటైన తరం మనది. అరవైకి పైబడిన వాళ్లూ, ఇరవై లోపల ఉన్నవాళ్లూ డిజిటల్ స్క్రీన్లకు అలవాటు పడిపోయారు. ఫలితంగా, నా పరిశీలన ప్రకారం ఎక్కువ మంది పుస్తకాలు కొంటున్నారు కాని వాటిని బుక్ షెల్ఫ్ లకే పరిమితం చేస్తున్నారు.
కొత్త ఏడాదిలోనైనా ప్రతి రోజూ నిర్ణీత సమయాన్ని డిజిటల్ తెరకు దూరంగా ఉండడానికి పుస్తకాలను చదివేందుకు ఉపయోగించుకోవాలని అప్పటి, ఇప్పటి తరానికి విన్నవించుకుంటున్నాను.
