Friday, January 9, 2026

తెలంగాణలోనే మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ? పోలీసులు ఏం చెబుతున్నారు?

మావోయిస్టు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) ఫస్ట్ బెటాలియన్ కమాండర్ బార్సె దేవా, మరికొందరు సభ్యులు తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేత, కేంద్రకమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఎక్కడ ఉన్నాడనే చర్చ మరోమారు జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, కాకినాడ, ఏలూరు పట్టణాల్లో జరిగిన మావోయిస్టుల అరెస్టుల సందర్భంలో దేవ్‌జీ కూడా వారిలో ఉన్నాడనే చర్చ జరిగింది. ఆయన ప్రాణాలకు హాని ఉందని, హిడ్మాలాగే ఆయననూ ఎన్‌కౌంటర్ చేయనున్నారని పౌరహక్కుల సంఘాలు ఆరోపించాయి. ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. కోరుట్లకు చెందిన దేవ్‌జీ కుటుంబం సైతం ఆయన జాడ చెప్పాలని డిమాండ్ చేసింది. అయినప్పటికీ దేవ్‌జీ జాడ తెలియలేదు.

మావోయిస్టు రహిత ప్రాంతంగా బస్తర్?

తదుపరి జరిగిన పరిణామాల్లో దేవ్‌జీ క్షేమంగా ఉన్నాడని పేర్కొంటూ మావోయిస్టు పార్టీ పేరుతో ఒక ప్రకటన వచ్చింది. దాంతో దేవ్‌జీ జాడకు సంబంధించిన చర్చకు ఫుల్ స్టాప్ పడింది. అయితే, తాజాగా బెటాలియన్ కమాండర్ దేవాతో సహా 20-25 మంది మావోయిస్టులను ములుగు జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్తలు వచ్చాయి. వీరు అరెస్టయ్యారా? లేక లొంగిపోయారా? ఆయుధాలు వెంట తెచ్చారా? వగైరా విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. వీరిని వచ్చే రెండు మూడు రోజుల్లో తెలంగాణ డీజీపీ ఎదుట ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేవా వెంట ఉన్నవాళ్లందరూ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టు కేడర్లేనని సమాచారం. వీరి లొంగుబాటు లేదా అరెస్టుతో దాదాపుగా బస్తర్ ప్రాంతం మావోయిస్టు రహితంగా మారినట్లేనని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

మరి దేవ్‌జీ ఎక్కడ ఉన్నాడు?

ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా ప్రకారం బస్తర్‌ ప్రాంతంలో ప్రభుత్వ బలగాల ఆధిపత్యం, ఆపరేషన్ కగార్ దాడి తీవ్రత రీత్యా మావోయిస్టులు తిరగలేని పరిస్థితి ఉంది. వారికి ఆహారం, ఇతర సామగ్రి దొరకడం కూడా కష్టంగా మారింది. ఫలితంగా కేడర్లందరినీ ఆ ప్రాంతం విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లమని నాయకత్వం ఆదేశాలిచ్చినట్లుగా సమాచారం. అలా వచ్చిన కొంత మంది ఆ మధ్య ఆదిలాబాద్‌లో ఆయుధాలతో సహా పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేవా తదితరులు కూడా అదే బాటలో నడిచారంటున్నారు. దేవ్‌జీ, ఆయన రక్షణ సిబ్బంది, ఇంకా మిగిలిన పాపారావు లాంటి నేతలు కూడా తెలంగాణకే వచ్చారా? అన్న విశ్లేషణ నిఘా వర్గాల్లో జరుగుతోంది.

దేవ్‌జీ కూడా లొంగిపోతాడా?

తెలంగాణలో ప్రవేశించిన దేవ్‌జీ ఏం చేస్తాడు? లొంగిపోతాడా? లేక రహస్యంగా ఉంటూ తన వర్గాన్ని కాపాడుకుంటాడా? అన్న చర్చ పోలీసు వర్గాల్లో నడుస్తోంది. తను కనుక లొంగిపోతే ఇక మావోయిస్టు పార్టీ ఓటమి సంపూర్ణమవుతుంది. కాని, దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథాలో మావోయిస్టు పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో దేవ్‌జీ ముందుంటాడని, విప్లవోద్యమాన్ని పూర్తిగా నిర్మూలించడం ఏ ప్రభుత్వాలకూ సాధ్యం కాదని విప్లవ మేధావులు నమ్ముతున్నారు. దేవ్‌జీ లొంగిపోతాడా? లేక పోరాటాన్ని కొనసాగిస్తాడా? అన్న విషయానికి భవిష్యత్తే సమాధానం ఇవ్వగలదు.

 

Latest News