ఒడిషాలోని కందమాల్ జిల్లాలో ఈరోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు ఉయికె గణేశ్@పాక హన్మంతు మరణించాడు. గణేశ్ మృతితో మావోయిస్టు పార్టీకి నాయకత్వం వహిస్తున్న కేంద్రకమిటీలో ప్రస్తుతం ఐదుగురే మిగిలారు. గణపతి@ముప్పాళ లక్ష్మణ్‌రావు, సంగ్రామ్@మల్లా రాజిరెడ్డి, దేవ్‌జీ@తిప్పిరి తిరుపతి తెలంగాణ వాళ్లు కాగా, సాగర్@మిసిర్ బెస్రా, ఆనల్ దా@పతీరాం మాంఝీ బిహార్, జార్ఖండ్‌కు చెందిన వాళ్లు. 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత కార్యదర్శి బసవరాజు@నంబళ్ల కేశవరావు, మిలిటరీ చీఫ్ హిడ్మా సహా పలువురు సీసీ సభ్యులు ఎన్‌కౌంటర్లలో చనిపోగా, సోనూ@మల్లోజుల వేణు, ఆశన్న@ తక్కెళ్లపల్లి వాసుదేవరావు తమ అనుచరులతో కలిసి ఆయుధాలతో లొంగిపోయారు. మరికొందరు వ్యక్తిగతంగా కూడా లొంగిపోయారు. ఒకప్పుడు 20 మందికి పైగా కేంద్రకమిటీ సభ్యులతో, ఐదుగురు పొలిట్‌బ్యూరో సభ్యులతో సమర్థవంతమైన నాయకత్వం కలిగిన మావోయిస్టు పార్టీ కేవలం ప్రస్తుతం ఐదుగురు సభ్యుల కమిటీతో అత్యంత బలహీనంగా మారింది.
ఆ ఇద్దరు బిహార్, జార్ఖండ్‌లకే పరిమితం..
ఈ ఐదుగురు సీసీ సభ్యుల్లోనూ గణపతి అంతర్జాతీయ వ్యవహారాలు చూస్తున్నాడు కనుక ఫీల్డులో లేడు. దేశంలోని ఏదైనా పట్టణ ప్రాంతంలోనో లేక విదేశాల్లోనో ఆయన తలదాచుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. వయసు సహకరించని రీత్యా సంగ్రామ్ కూడా బయటే ఉండివుండవచ్చునని వాళ్లంటున్నారు. ఇక, బిహార్, జార్ఖండ్‌లకు చెందిన మిసిర్ బెస్రా, ఆనల్ దా 50లలో ఉండి పాక్షికంగా తక్కువ వయసు కలిగివున్నప్పటికీ వాళ్లు ఆ రాష్ట్రాల ఉద్యమాలకే పరిమితమై ఉంటున్నారు. అక్కడ కూడా తీవ్ర నిర్బంధం కొనసాగుతూ, ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి కనుక వాళ్లు భవిష్యత్తులో అక్కడి నుంచి బయటకు వచ్చే పరిస్థితులు లేవని కూడా పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
దేవ్‌జీ పైనే మావోయిస్టు పార్టీ భవిష్యత్తు?
ఈ పరిస్థితుల్లో దండకారణ్యం, ఏఓబీ(ఆంధ్ర-ఒడిషా సరిహద్దు), సీఓబీ(ఛత్తీస్‌గఢ్-ఒడిషా సరిహద్దు), ఎంఎంసీ(మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్), తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విప్లవోద్యమాన్ని నడిపించడానికి ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడు, సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ అయిన దేవ్‌జీ మాత్రమే మిగిలివున్నాడు. సోనూ, ఆశన్నల లొంగుబాటు పంథాను వ్యతిరేకిస్తున్న మావోయిస్టు పార్టీకి నాయకుడిగా ఉన్నాడు కనుక ఆయనపై కేంద్ర-రాష్ట్ర బలగాలు కేంద్రీకరించి పనిచేస్తున్నాయి. విజయవాడలో అరెస్టయిన మావోయిస్టుల్లో దేవ్‌జీ గార్డులు ఉన్న నేపథ్యంలో తనను కూడా పోలీసులు అరెస్టు చేశారనే ప్రచారం తీవ్రంగా జరిగింది. హక్కుల సంఘాలు హైకోర్టుకు కూడా వెళ్లాయి. అయితే, ఆయన సేఫ్‌గానే ఉన్నారని, దండకారణ్యంలోనే ఉన్నారని తదుపరి వెలువడిన మావోయిస్టు పార్టీ ప్రకటనలు వెల్లడించాయి.
ఆనుపానులు తెలియకుండా జాగ్రత్తలు..
తన కోసం అత్యున్నత స్థాయిలో గాలింపు జరుగుతున్నదని గుర్తించిన దేవ్‌జీ కూడా తన ఆనుపానులు పోలీసులకు తెలియకుండా చాకచక్యంగా వ్యవహరిస్తున్నాడు. తన అరెస్టు గురించి ఎంతగా ప్రచారం జరిగినా, సోనూ, ఆశన్నలు పార్టీ పంథాపై ఎన్ని విమర్శలు గుప్పించినా ఇప్పటి వరకూ దేవ్‌జీ స్పందించలేదు. అలా స్పందించిన తక్షణం ఆయన జాడ తెలుసుకోవచ్చుననే అంచనాతో భద్రతాబలగాలున్నట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా పాక హన్మంతు ఎన్‌కౌంటర్‌తో మరోమారు దేవ్‌జీ గురించిన చర్చ అన్ని వర్గాల్లో జరుగుతోంది.
