సెకండ్ వేవ్ కరోనా కేసులతో దేశం విలవిలలాడుతున్నది. ఫస్ట్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పట్టి ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారో లేదో సెకండ్ వేవ్ తలుపులు తట్టింది. మహారాష్ట్రలో మొదలై రాజధాని ఢిల్లీని చుట్టుముట్టి అతివేగంగా దేశంలోని అన్ని రాష్ట్రాలకూ విస్తరించింది. ఫస్ట్ వేవ్ కొనసాగిన సంవత్సర కాలంలో(2020 మార్చ్ 1 నుంచి 2021 ఫిబ్రవరి 9 వరకు) దేశవ్యాప్తంగా కోటి ఎనిమిది లక్షల పైచిలుకు కేసులు, లక్షా 55 వేలకు పైగా మరణాలు నమోదు కాగా, సెకండ్ వేవ్ మొదలైన ఫిబ్రవరి 10 నుంచి మే 21 వరకు కేవలం 100 రోజుల్లో కోటిన్నర కేసులు, లక్షా 35 వేల మరణాలు నమోదు కావడం విశేషం. కేసుల తీవ్రతకు జడిసి ఒక్క మధ్యప్రదేశ్, ఈశాన్యంలోని ఒకటి రెండు చిన్న రాష్ట్రాలు మినహా మిగతా అన్నీ సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించాయి. ఆస్పత్రుల్లో బెడ్లకు, ఆక్సిజన్‌కు, మందులకు, టెస్టింగ్ కిట్లకు, అంబులెన్సులకు తీవ్రమైన కొరత ఏర్పడింది. ప్రాణవాయువు దొరక్క, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అందక చనిపోయిన వారి సంఖ్య ప్రతిరోజూ వందల్లోనే ఉంటున్నది. మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించడానికి శ్మశానాల్లో ఖాళీ లేక కుప్పలు కుప్పలుగా మృతదేహాలను ఖననం/దహనం చేసే పరిస్థితి నెలకొన్నది.
ఇంత జరిగినా మోడీ సర్కారుకు నిమ్మకు నీరెత్తినట్లు కూడా లేదు. రోమ్ నగరం కాలిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించాడన్న సామెతను గుర్తుచేస్తున్న చందంగానే అది వ్యవహరిస్తున్నది. కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొనే బాధ్యతను రాష్ట్రాలకు వదిలేసింది. తగినంత ఆక్సిజన్‌ను సరఫరా చేయడంలో, లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌ను, టెస్టింగ్ కిట్లను, వ్యాక్సిన్లను సమకూర్చడంలో ఘోరంగా విఫలమైంది. ఓ వైపు మహారాష్ట్రలో సెకండ్ వేవ్ విజృంభిస్తోందన్న నిజాన్ని పెడచెవిన పెట్టి కుంభమేళాకు అనుమతినిచ్చి లక్షలాది మంది వైరస్ బారిన పడడానికి కారణమైంది. బెంగాల్‌ను కబళించాలన్న ఆతృతలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహింపజేసి పల్లె పల్లెనా బాధితులు పెరగడానికి దోహదపడింది.
నిజానికి, కరోనా సెకండ్ వేవ్ రాబోతున్నదని గత సంవత్సరం అక్టోబర్‌లోనే డబ్య్లుహెచ్‌ఓ, ఐసీఎంఆర్, సీసీఎంబీ వంటి సంస్థలు హెచ్చరించాయి. దేశ విదేశాలకు చెందిన పలువురు శాస్త్రజ్నులు, వైద్యనిపుణులు సైతం ఇదే విషయాన్ని నొక్కిచెప్పారు. 2020 నవంబర్ 11న మహారాష్ట్ర ప్రభుత్వం సెకండ్ వేవ్ విషయంలో ఒక సర్క్యులర్‌ను జారీచేసింది. 2021 జనవరి-ఫిబ్రవరిలో సెకండ్ వేవ్ రాబోతున్నదని చెబుతూ వివిధ విభాగాలు చేబట్టాల్సిన చర్యలను అందులో సూచించింది. కేసులు తగ్గుతున్నాయని సంబరపడరాదని హెచ్చరించింది. కాని, మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మాత్రం సోయి కొరవడింది. సెకండ్ వేవ్ వస్తే ఏం చేయాలో ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంలో అది విఫలమైంది. భారీగా కేసులు వస్తే మౌలిక సదుపాయాలకు తీవ్ర కొరత ఏర్పడుతుందని తెలిసి కూడా అప్రమత్తం కాలేదు. అప్పటికే కొవిషీల్డ్, కొవాక్జిన్ వంటి టీకాలు ప్రయోగదశలో సత్ఫలితాలు ఇస్తున్నా పట్టించుకోలేదు. దేశ జనాభాకు సరిపడా డోసుల సరఫరాకు ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ఆ టీకాల తయారీ సంస్థలు అడిగిన ఆర్థిక సాయం చేయలేదు. చివరకు, జనవరి 16న ఫ్రంట్‌లైన్ వారియర్లకు వ్యాక్సినేషన్ చేపట్టాలన్న నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా కనీస ముందుచూపును ప్రదర్శించలేకపోయింది. పైగా, తయారైన ఆ కొద్ది డోసుల్లోనూ బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, సౌదీ అరేబియా వంటి 95 దేశాలకు 6.64 కోట్ల డోసులను దాతృత్వం పేరిట పంపించింది. తీరా ఇప్పుడు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. టీకాల స్టాకు లేక పలు రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేసాయి. టెస్టులు కూడా అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి.
కాగా, సెకండ్ వేవ్ పీక్ స్టేజ్‌ను దాటేసి కేసుల తీవ్రత తగ్గుతున్న ప్రస్తుత సమయంలో థర్డ్ వేవ్ కరోనా గురించిన హెచ్చరికలు మొదలయ్యాయి. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు విజయరాఘవనే స్వయంగా థర్డ్ వేవ్ వస్తున్నదని ఇటీవలే వ్యాఖ్యానించారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా, సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా, వైట్‌హౌస్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆంటోని ఫౌచి సహా పలువురు నిపుణులు మన దేశంలో థర్డ్ వేవ్ రాకతప్పదని హెచ్చరించారు. ఈ లోపలే జనాభాలోని పద్దెనిమిదేళ్లు దాటిన అందరికీ టీకా వేయడం, ప్రజలు తమ సామాజిక వర్తనను మార్చుకోవడం, ఆస్పత్రుల మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకోవడం, లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌ను సమకూర్చుకోవడం ద్వారానే ఆ వేవ్ నుంచి మనను కాపాడుకోవచ్చని వాళ్లు అభిప్రాయపడ్డారు. ఆందోళన కలిగించే విషయమేమంటే, ఈ వేవ్‌లో వైరస్ ప్రధానంగా 13 ఏళ్ల లోపు పిల్లలపై దాడి చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
సెకండ్ వేవ్‌ను అంచనా వేయడంలో, అర్థం చేసుకోవడంలో, అప్రమత్తమై చర్యలు చేపట్టడంలో ఘోరంగా విఫలమైన మోడీ సర్కారు థర్డ్ వేవ్ పైనా అంత సీరియస్‌గా ఉన్నట్లు కనిపించడం లేదు. ఆక్సిజన్, మందుల దిగుమతి విషయంలో, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగిరపర్చే విషయంలో చేపడుతున్న చర్యలు ఆశించిన స్థాయిలో లేవని చెప్పవచ్చు. దేశ జనాభా 133.26 కోట్లలో 18 ఏళ్లు, ఆ పైబడినవారు 84.19 కోట్ల మంది ఉండగా, ఇప్పటివరకు కేవలం 4.12 కోట్ల మందికి మాత్రమే డబుల్ డోస్ పడిందంటే (మరో 14.63 కోట్ల మంది సింగిల్ డోస్ తీసుకున్నారు.) సర్కారు చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ మరో 80 కోట్ల మందికి టీకా అందాల్సివుంది. 2021 సంవత్సరాంతానికల్లా 267 కోట్ల డోసులను సమకూర్చుకుని వయోజనులందరికీ టీకా వేస్తామని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ చెప్పినా, ఆయన మాటలు నమ్మశక్యంగా లేవు. అన్ని రాష్ట్రాల్లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్త నడకనే సాగుతోంది. ప్రస్తుత వేగమే కొనసాగితే హెర్డ్ ఇమ్యూనిటీకి అవసరమైన 70 శాతం జనాభాకు టీకా వేసే లక్ష్యం చేరడానికి మరో రెండున్నరేళ్లకు పైగా పట్టే అవకాశం ఉందని బ్లూమ్‌బర్గ్ నివేదిక హెచ్చరించింది. ఇక రెండేళ్లు పైబడిన పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేయడానికి అనుమతులు వస్తే ఇంకో సంవత్సరం గ్యారంటీగా పడుతుందనడంలో ఎలాంటి సందేహంలేదు.
ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలి. కరోనా అదుపు కోసం భారీగా అదనపు నిధులు కేటాయించాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలి. ఆయుష్మాన్ భారత్‌లో అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ చేరేలా, అందులో కొవిడ్ చికిత్సను కూడా చేర్చేలా చర్యలు చేపట్టాలి. వీలైనంత త్వరగా, వీలైనంత మందికి టీకా అందేలా నిల్వలను సమకూర్చుకోవాలి. అందుబాటులోకి వచ్చిన కొత్త టీకాలను కూడా అనుమతించాలి. ప్రజల్లో ఆరోగ్య, సామాజిక వర్తన విషయాల్లో చైతన్యం పెంచాలి.
– డి మార్కండేయ
(దిశ సౌజన్యంతో..)