మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చిన సోనూ, ఆశన్న తదితరులపై ప్రస్తుతం సోషల్ మీడియాలో సీరియస్ చర్చ నడుస్తున్నది. ముఖ్యంగా వాళ్లు మూకుమ్మడిగా ఆయుధాలు వదిలేసి, పోలీసుల ఎదుట లొంగిపోవడాన్ని నెటిజన్లు, మేధావుల్లో ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు. కొందరైతే వారిని ద్రోహులుగానే అభివర్ణిస్తున్నారు. ఇలాంటి మేధావులపై ఇటీవల సోనూ, ఆశన్న తదితరులు తీవ్రంగా విరుచుకు పడుతూ మాజీ మావోయిస్టుల పేరుతో పెట్టిన ఒక పోస్టు వైరల్ అవుతున్నది. ఈ నేపథ్యంలో చరిత్రకు, రాజకీయాలకు సంబంధించిన కొన్ని వివరాలు ఇవే..

ఆయుధాలు వదిలేయడం ఇదే మొదలు కాదు..
సాయుధ పోరాటం చేస్తున్న పలు సంస్థలు, సంస్థ మొత్తంగానో లేకుంటే ఒక చీలిక వర్గమో ఆయుధాలను వదిలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకుని రాజ్యాంగ పరిధిలోకి వచ్చి పనిచేసిన ఘటనలు భారత చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లోని నాగాలాండ్‌లో నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్(ఎన్ఎస్సీఎన్), అస్సాంలోని యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం(ఉల్ఫా), బోడో తెగకు చెందిన నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్(ఎన్డీఎఫ్బీ), మిజోరాంలో మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) వంటి పోరాట సంస్థలు గతంలో కేంద్ర ప్రభుత్వాలతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుని, పలుమార్లు చర్చలు జరిపి, చివరకు ఒక అంగీకారానికి వచ్చి మూకుమ్మడిగా ఆయుధాలను వదిలేసిన, చట్టబద్ధంగా పనిచేసిన ఘటనలు ఉన్నాయి. ఈ సందర్భాల్లో ఆయా సంస్థల్లో ఒక వర్గం ఆ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ చర్చలను బహిష్కరించి, సాయుధ ఉద్యమాన్ని కొనసాగించిన చరిత్ర కూడా ఉంది. పక్క దేశం శ్రీలంకలో కూడా తమిళ పోరాటవాద సంస్థ ఎల్టీటీఈ 1987లో శాంతి ఒప్పందం కుదుర్చుకుని ఆయుధాలు అప్పగించింది. ఆ నిర్ణయం తప్పని గుర్తించి తర్వాత మళ్లీ ఆయుధాలు చేబూనింది.

ప్రభుత్వాలతో ఒప్పందాల తర్వాతే..
అయితే, ఆయుధాలు వదిలేసి లొంగిపోయిన ప్రతి సందర్భంలోనూ ఆ పోరాట సంస్థ లేదా దానిలోని చీలిక వర్గం ప్రతినిధులు మొదట కేంద్ర ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నారు. తదుపరి ప్రభుత్వ ప్రతినిధి బృందంతో దశల వారీగా చర్చలు జరిపారు. చివరకు, రాజకీయ అంశాలకు సంబంధించి, తమ లక్ష్యానికి సంబంధించి కొన్ని డిమాండ్లను నెరవేర్చేలా ప్రభుత్వాన్ని ఒప్పించి, ఫార్మల్‌గా ఒక ఒప్పంద పత్రంపై సంతకాలు చేసిన తదుపరి మాత్రమే తమ గెరిల్లా బలగాలను ఆయుధాలతో సహా బయటకు రప్పించి ప్రభుత్వ బలగాల ఎదుట సరెండర్ చేయించారు. లీగల్ సంస్ధలుగా ఏర్పడి పోరాటం చేశారు.. ఇంకా చేస్తున్నారు.

సోనూ, ఆశన్న చెబుతున్న ప్రకారం దేశంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక మార్పులెన్నో జరిగాయి. ఉత్పత్తి సంబంధాలు మారాయి. పెట్టుబడిదారీ సంబంధాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అర్థ వలస, అర్ధ భూస్వామ్య సమాజానికి పనికివచ్చే దీర్ఘకాలిక సాయుధ పోరాటం పని చేయదు. జనజీవన స్రవంతిలోకి వచ్చి రాజ్యాంగ పరిధిలో పనిచేయాలి. ఈ విషయంలో పార్టీ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లోనే కగార్ దాడిలో తీవ్ర నష్టాలు జరుగుతున్న నేపథ్యంలో తాము తప్పనిసరి స్థితిలో ఆయుధాలు వదిలేసి లొంగిపోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. లొంగిపోవడం ద్వారా ప్రాణ నష్టాలు
నివారిస్తున్నామని, భవిష్యత్తులో కూడా తాము ప్రజల మధ్య ఉండి పనిచేస్తామని అంటున్నారు. మారిన సామాజిక పరిస్థితుల్లో విప్లవ లక్ష్యం కోసం రాజ్యాంగ పరిధిలో పని చేస్తామని స్పష్టం చేస్తున్నారు.
ఏం చేయాల్సివుండింది?
అయితే, మౌలిక పంథాతో మీరు విభేదించినట్లయితే, ఆ విభేదాలను పరిష్కరించలేని పరిస్థితులు మావోయిస్టు పార్టీలో కనుక ఉంటే మీరు ఏం చేయాలి?
1. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మధ్యవర్తుల ద్వారా సంప్రదించి ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని చర్చలు జరపాలి. మీ షరతులు వారి ముందు పెట్టాలి. చివరకు ఒక అవగాహనకు రావాలి.
2. ప్రభుత్వంతో ఒక ఒప్పంద పత్రంపై సంతకాలు చేయాలి.
3. మీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటో, మావోయిస్టు పార్టీ నుంచి చీలిక వర్గంగా వ్యవహరిస్తారా? లేక కొత్త పార్టీ పేరుతో పనిచేస్తారా? వంటి విషయాలపై స్థూలంగా ఒక ప్రకటన చేయాలి.
4. ఆ పైన మీ బలగాలను, కేడర్లను రప్పించి ఆయుధాలతో సహా లొంగిపోవాలి. ఒప్పందంలో ఉన్న అంశాల ప్రకారం మీ తదుపరి కార్యాచరణను ప్లాన్ చేసుకోవాల్సింది.
(సంస్థ మొత్తంగా ఆయుధాలు వదిలేసినప్పుడు లేదా అందులోని ఒక చీలిక వర్గం సంస్థ రాజకీయ పంథాతో విభేదించి బయటకు వచ్చి ఆయుధాలు వదిలేసినప్పుడు చరిత్రలో అది ద్రోహం కిందికి రాలేదు. రాజకీయ పరిష్కారం కింద మాత్రమే పరిగణించారు. కాకపోతే, పోరాటాన్ని కొనసాగిస్తున్న వర్గం మాత్రం దాన్ని ద్రోహం కిందే పరిగణించారు.)
పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఉండడమేమిటి?
ఇవేమీ లేకుండా మీరు అడవి నుంచి నేరుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు వచ్చి ప్రభుత్వ ప్రముఖుల సమక్షంలో ఆయుధాలతో లొంగిపోవడం మూలంగానే మీపై ఇంత పెద్దయెత్తున వ్యతిరేక ప్రచారం జరుగుతున్నది. అలాగే, లొంగుబాటు తర్వాత మీతో సహా మీ సహచరులందరూ ఇప్పటికీ గడ్చిరోలి, జగ్దల్‌పూర్, బీజాపూర్ పోలీస్ హెడ్ క్వార్టర్లలోనే ఉంటున్నారు. ఇలా ఆరు నెలల పాటు ఉండాలని కేంద్ర హోం శాఖ నిబంధన పెట్టినట్లు కూడా ప్రచారం జరుగుతున్నది. లొంగిపోయిన క్యాడర్లను వివిధ పునరావాస కేంద్రాల్లో ఉంచి వారికి వివిధ వృత్తులు నేర్పిస్తున్నట్లుగా ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ తన ఫేస్‌బుక్ పేజీలో ఫొటోలతో సహా పోస్ట్ చేశారు.
ఈ పరిస్థితుల్లో ప్రజలకు, పౌర సమాజానికి అనుమానాలు ఏర్పడడం సహజం. పార్టీ రాజకీయ పంథాతో విభేదించి బయటకు వచ్చామని మీరు మరీ మరీ చెబుతున్నా, డాక్యుమెంట్లు, లేఖలు పంపిస్తున్నా ఎవరూ నమ్మడం లేదు. ఇప్పటిదాకా చరిత్రలో అనేక మంది సీనియర్, జూనియర్ మావోయిస్టు నేతలు అనారోగ్య కారణాలతోనో.. విభేదాలతోనో లొంగిపోయిన విధంగానే.. మీరు కూడా లొంగిపోయారని అనుకుంటున్నారు. ఆయుధాలు పోలీసులకు అప్పగించారు కనుక, మూకుమ్మడిగా లొంగిపోయారు కనుక మీది ద్రోహం అని కూడా అంటున్నారు. ఇలా కాకుండా మీరు చర్చలు-కాల్పుల విరమణ-చర్చలు-ఒప్పందం-లొంగుబాటు-కొత్త రాజకీయ కార్యాచరణ ప్రకటన.. ఈ పద్ధతిని కనుక అనుసరించి వుంటే మీపై ఇన్ని విమర్శలు వచ్చేవి కావు.
మేం పై పద్ధతిని (చర్చలు-కాల్పుల విరమణ-చర్చలు-ఒప్పందం-లొంగుబాటు-కొత్త రాజకీయ కార్యాచరణ ప్రకటన..) పాటించాలనే అనుకున్నాం.. కాని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించలేదు.. అని కూడా మీరంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలా సహకరించనంత మాత్రాన చేతులెత్తేయడం విప్లవకారుల లక్షణం కాదు కదా.. అదీ భవిష్యత్తులో కూడా విప్లవ లక్ష్యం కోసం రాజ్యాంగ పరిధిలో పనిచేస్తాం.. అంటున్న మీ లక్షణం కాకూడదు.
ప్రత్యామ్నాయాలు లేవా?
మీ షరతులకు ప్రభుత్వాలు స్పందించకపోతే ఏం చేయాలి? ప్రత్యామ్నాయాలు వెదకాల్సి వుండింది.
1. పౌర సమాజాన్ని సంప్రదించాల్సివుండింది. వారికి అడవి పరిస్థితులు చెప్పి వుండాల్సింది.
2. కొన్ని నష్టాలకు ఓర్చి అయినా మీ వర్గాన్ని నిలబెట్టుకుంటూనే మధ్యవర్తుల ద్వారా ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాల్సి వుండింది.
3. ప్రభుత్వాలు స్పందించే వరకూ ఆత్మరక్షణ ఎత్తుగడలను చేబట్టాల్సి వుండింది.
4. ఇతర ఆచరణ సాధ్యమయ్యే ఎత్తుగడలను అవలంభించాల్సి వుండింది.
అంతేకాని మీరు అవలంభించిన పద్ధతి మాత్రం సరైంది కాదనే విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. ఇప్పటికైనా మీరు పోలీస్ హెడ్ క్వార్టర్ల నుంచి బయటకు వచ్చి మీ పంథాపై స్పష్టత ఇవ్వండి. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించండి. మాపై పోలీసుల, ప్రభుత్వాల ఒత్తిడి ఉంది.. అలా చేయలేమంటే.. ఇక మీరు ఇలాంటి నిందలను భరించడానికి సిద్ధంగా ఉండండి.
నోట్: సోషల్ మీడియాలో చర్చ వ్యక్తిగత విమర్శలు, దాడుల స్థాయికి చేరడం శోచనీయం. విమర్శలను రాజకీయంగా, సైద్ధాంతికంగా చేయాలి కాని వ్యక్తులను కేంద్రంగా చేసుకోవడం వల్ల బయటి సమాజంలో పలచన కావడం మినహా.. ఎలాంటి ఉపయోగం ఉండదు.
-మార్కండేయ
