Friday, January 9, 2026

టాక్టికల్ రిట్రీటే ఏకైక మార్గం.. చిన్న టీంలుగా తిరగాలంటూ మావోయిస్టు పార్టీ సర్క్యులర్..

ఆయుధాలు వదిలేద్దామని, ఇక రహస్య ఉద్యమాలు చేయడం కష్టమని మావోయిస్టు పార్టీలో గత రెండేళ్ల నుంచే అంతర్గత చర్చ జరుగుతున్నట్లుగా నిన్న కొన్ని దిన పత్రికలు, టీవీ చానెళ్లు వార్తలు పబ్లిష్ చేశాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తర రాష్ట్రాల కమిటీలు ఈ అభిప్రాయంతో ఉన్నాయని 2024 ఆగస్టులో వెలువడిన పొలిట్ బ్యూరో సర్క్యులర్ లో అలా ఉన్నట్టు రాశాయి. అంటే సోనూ అలియాస్ మల్లోజుల వేణు లేఖ బయటకు రాకముందే ఇలాంటి చర్చ ఆ పార్టీలో ఉన్నట్లు ఆ వార్తల్లో ఉన్నది.
ఇది పూర్తిగా అబద్ధం. ఆ డాక్యుమెంటులోని 12వ పేజీలో ఇలా ఉంది. ’’A section of party members in Maharashtra, Tamilnadu, Karnataka, Kerala and the states of North region have wrong opinions that we cannot mobilise the broad masses in class struggle if the party is secret. So, they are not prepared for secret life. They are not able to build and mould the party invincible to the enemy.‘‘
(అంటే మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఉత్తర రాష్ట్రాలకు చెందిన కొంత మంది పార్టీ సభ్యులు ’’పార్టీ రహస్యంగా ఉంటే వర్గపోరాటంలో విశాల ప్రజారాశులను సమీకరించలేమనే అభిప్రాయంతో ఉన్నాయి. అంటే రహస్య జీవితానికి వాళ్లు సిద్ధంగా లేరు. శత్రు దుర్భేద్యమైన పార్టీని నిర్మించడం, అటువైపు మళ్లించడం వారికి సాధ్యపడడం లేదు.‘‘)
పొలిట్ బ్యూరో పేరుతో వెలువడిన ఆ సర్క్యులర్ లో నిజానికి చాలా విషయాలు ఉన్నాయి.
1. 2020లో వెలువడిన పార్టీ రాజకీయ నిర్మాణ సమీక్ష డాక్యుమెంటు 2007 పార్టీ కాంగ్రెస్ జరిగిన నాటి నుంచి 2020 వరకు ఉద్యమాన్ని సమీక్షించింది. దేశవ్యాప్తంగా విప్లవోద్యమం తాత్కాలిక వెనకడుగులో ఉందని ప్రకటించింది. 2020 నుంచి 2024 జూలై వరకు ప్రస్తుత సర్క్యులర్ దేశవ్యాప్త ఉద్యమాన్ని 31 పేజీల్లో సమీక్షించింది.
2. సీసీ సభ్యులు, ఆయా రాష్ట్ర కమిటీల సభ్యులు చాలా మంది అమరులు కావడం, అరెస్టు కావడం, లొంగిపోవడం జరిగిన ఫలితంగా ప్రస్తుతం పార్టీ నాయకత్వం చాలా బలహీనపడింది. దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని కమిటీలతో సమన్యయం లేక గైడ్ చేయలేకపోతోంది.

ఇప్పటికీ తాత్కాలిక వెనకడుగులోనే..

3. శత్రుదాడి తీవ్రతను అర్థం చేసుకోని కారణంగా పార్టీకి, పీఎల్జీఏకు రాసిలో, వాసిలో తీవ్ర నష్టాలు జరిగాయి. ఫలితంగా ఇప్పటికీ 2020 డాక్యుమెంటులో చెప్పిన తాత్కాలిక వెనకడుగు పరిస్థితే ఉంది.
4. అర్ధవలస, అర్థభూస్వామ్య సంబంధాల్లో చెప్పుకోదగిన మార్పులు వచ్చినా ఇప్పటికీ గుణాత్మక మార్పు రాలేదు. అందుకని వ్యూహం-ఎత్తుగడల్లో మార్పు ప్రశ్నే ఉదయించదు. దీర్ఘకాలిక సాయుధ పోరాటమే మన పంథాగా ఉంటుంది.
5. అయితే చాలా రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక మార్పులు జరిగిన మాట వాస్తవం. ఇందుకోసం దేశం మొత్తాన్ని ఏడు కేటగరీలుగా విభజించాలి. ఎక్కడ పెట్టుబడిదారీ సంబంధాలు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి? మార్కెట్ ఏ స్థాయిలో ప్రభావం చూపుతోంది? వగైరా పరిస్థితులను ఆయా రాష్ట్ర కమిటీలు విశ్లేషించి ఈ కేటగరీలు చేస్తూ సీసీకి రిపోర్ట్ పంపించాలి.
6. ఆ రిపోర్ట్ అందిన తర్వాత ఏ కేటగరీ ప్రాంతానికి ఎలాంటి పోరాట ఎత్తుగడలు పాటించాలో సీసీ నిర్ణయించాలి. ప్రస్తుతం (2024) ఈ పని నడుస్తోంది.

కగార్ వల్ల ఎందుకు నష్టపోయాం?

7. శత్రువు తలపెట్టిన ఆపరేషన్ కగార్ దాడిలో పార్టీ, పీఎల్జీఏ అధిక నష్టాలు పొందడానికి (2024 ఆగస్టు వరకు) ఆ యుధ్ద తీవ్రతను అర్థం చేసుకోకపోవడం, గెరిల్లా యుద్ధానికి కీలకమైన రహస్య పనివిధానాన్ని పాటించకపోవడం, శత్రు ఇన్ఫార్మర్ నెట్వర్క్ ను పసిగట్టలేకపోవడం, కఠిన గెరిల్లా జీవితానికి సభ్యులు సంసిద్ధంగా లేకపోవడం, క్లిష్ట పరిస్థితుల్లో చొరవ కోల్పోవడం, మొబైళ్లు, ఇంటర్నెట్, వాకీటాకీలు విచ్ఛలవిడిగా వాడడం కారణాలు.
8. దేశంలోని అన్ని ప్రాంతాల్లో పార్టీలోకి రిక్రూటుమెంటు తగ్గింది.
9. ఇక నుంచి మన పీఎల్జీఏ బలగాలను వికేంద్రీకరించాలి. ప్లాటూన్లు, కంపెనీలు, బెటాలియన్లు 4+4 సెక్షన్లుగా విడిపోయి తిరగాలి. దాడుల సందర్భంగా మాత్రమే కలవాలి. తగిన సంఖ్యలేని సైనిక నిర్మాణాలను రద్దు చేయాలి.

ఈ కమాండ్లను రద్దు చేద్దాం..

10. దేశ తూర్పు ప్రాంతంలో సైనిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న ఈస్టర్న్ రీజనల్ కమాండ్ ను, మధ్యభారత ప్రాంతంలో సైనిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న సెంట్రల్ రీజనల్ కమాండ్ ను వెంటనే రద్దు చేయాలి. వివిధ రాష్ట్రాల మధ్య కమ్యూనికేషన్ సంబంధాలు లోపించిన రీత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నాం.
11. దండకారణ్యంలో మన బలగాలను టాక్టికల్ రిట్రీట్ చేయాలి. అనగా ప్రధాన బలగాలు ఇక్కడే ఉంటాయి. కొంతమంది కీలకమైన పార్టీ, పీఎల్జీఏ నేతలను బయటకు పంపాలి. ప్రధాన బలగాలు కూడా పరిస్థితులను బట్టి పక్క ప్రాంతాలకు వెళ్లవచ్చు. కాని పరిస్థితులు చక్కబడ్డ తర్వాత మళ్లీ తిరిగి వస్తాయి.
స్ట్రాటజికల్(వ్యూహాత్మక) రిట్రీట్ అంటే ప్రధాన బలగాలతో పాటు నాయకత్వాన్నంతటినీ శాశ్వతంగా రక్షణ ప్రాంతాలకు తరలించడం. ఇప్పుడు మనం చేస్తున్నది వ్యూహాత్మక రిట్రీట్ కాదు. కేవలం ఎత్తుగడలపరమైన రిట్రీట్ మాత్రమే.
12. ఈ అన్ని పరిస్థితులను అర్థం చేసుకుని తాత్కాలిక వెనుకబాటు పరిస్థితుల రీత్యా రాబోయే కాలంలో ఆత్మరక్షణ ఎత్తుగడలను అవలంభిస్తూ పార్టీని, పీఎల్జీఏను రక్షించుకోవాలి. పరిస్థితులకు తగిన ఎత్తుగడలను అవలంభిస్తూ వర్గపోరాటాలను పెంచుతూ పార్టీని సంఘటితపర్చాలి.
-మార్కండేయ

 

Latest News