ప్రత్యేక తమిళ ఈలం(తమిళ దేశం) కోసం సుదీర్ఘకాలం పోరాడిన ఎల్టీటీఈ 2009 మేలో అంతిమ ఓటమి పాలైన విషయం మనందరికీ తెలిసిందే. శ్రీలంక ఉత్తర, పూర్వ తమిళ ప్రాంతాల్లోని మెజారిటీ భూభాగాన్ని ఏళ్ల తరబడి తన కంట్రోలులో ఉంచుకుని, పాలన చేపట్టి, వాయు, నౌకాబలగాలు సహా 40వేలకు మించిన రెగ్యులర్ సైన్యాన్ని కలిగిన ఎల్టీటీఈ.. స్థావరయుద్ధంలో ఇరుక్కుపోయి చివరకు ఘోర ఓటమిని చవిచూసింది. క్రమక్రమంగా శ్రీలంక సైన్యాలు తమ భూభాగాన్ని చుట్టుముడుతున్నాయని, తమ ఏరియా కుంచించుకుపోతున్నదని తెలిసినా, స్థావరయుద్ధ వ్యూహాన్ని వదిలిపెట్టలేదు. యాభై చ.కి.మీ.లకు, పది చ.కి.మీ.లకు, చివరకు ఒక చ.కి.మీ. ప్రాంతంలో ఇరుక్కుపోతున్నా అంతర్జాతీయ సముదాయం జోక్యం చేసుకుంటుందని ఆశించారే కాని చుట్టువేతను ఛేదించుకుని బయటకు వెళ్లడానికి, గెరిల్లా యుద్ధతంత్రానికి మారడానికి నిర్ణయం తీసుకోలేదు. వేలాది గెరిల్లాలు, కమాండర్లు చివరి వరకూ పోరాడి.. అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్‌తో సహా అందరూ వీరోచిత మరణం పొందారు.

2010లో సమీక్ష..
ఈ చారిత్రక పరిణామాన్ని మావోయిస్టు పార్టీ 2010లో సమగ్రంగా సమీక్షించింది. ఈ సమీక్ష వ్యాసాన్ని రెండు భాగాలుగా క్రాంతి పత్రికలో జనవరి-ఫిబ్రవరి, మార్చి-ఏప్రిల్ సంచికల్లో ప్రచురించింది. ఈలం పోరాటం మొదలైనప్పటి నుంచి 2009లో అంతమయ్యే వరకూ జరిగిన క్రమాన్ని విశ్లేషించింది. ఈలం-1, 2, 3, 4 వ యుద్ధాల్లో శ్రీలంక ప్రభుత్వ బలగాలు, ఎల్టీటీఈ బలగాలు చేపట్టిన వ్యూహం-ఎత్తుగడలను, రాజకీయ పరిణామాలను వివరించింది. చివరలో, ‘‘ఎల్టీటీఈ ఓటమి-గుణపాఠాలు’’ అనే శీర్షికతో టైగర్ల పరాజయానికి కారణాలను 8 పాయింట్లుగా ఇచ్చింది. ఇందులోని 2వ పాయింటు సారాంశం ఇలా ఉంది.

‘‘భూభాగాన్ని కోల్పోతున్నామని, శత్రు బలగాల చుట్టివేతకు గురవుతున్నామని తెలిసి కూడా ఎల్టీటీఈ తన స్థావర యుద్ధతంత్రాన్ని వదలలేదు. చివరి వరకూ అది పొజిషనల్ వార్‌ఫేర్‌నే అనుసరించింది. అలా కాకుండా టైగర్లు తమ ఏరియా ఆఫ్ ఆపరేషన్(తాము తిరిగే ప్రాంతాన్ని)ని విస్తరించి, గెరిల్లా యుద్ధతంత్రానికి మారాల్సివుండింది. అలా చేయని ఫలితంగా అది సైనిక విన్యాసాలు చేసే చొరవను కోల్పోయింది. చివరి వరకూ పోరాడితే, తమిళ ప్రజలపై మారణకాండను చూసి అంతర్జాతీయ సముదాయం స్పందించి, జోక్యం చేసుకుని యుద్ధం ఆపుతారని అది ఆశించింది. టైగర్ల చీఫ్ ప్రభాకరన్‌కు సామ్రాజ్యవాదుల మీద, విప్లవ ప్రతీఘాతుక శక్తుల మీద దరిదాపుగా సరైన అవగాహనే ఉన్నప్పటికీ, దాన్ని ఆచరణలోకి తేవడంలో విఫలమయ్యారు.’’

స్థావరయుద్దం నుంచి బయటకు రావాల్సింది..
పై పేరాలో టైగర్ల ఓటమిని మావోయిస్టు పార్టీ సరిగ్గానే సమీక్షించింది. తమిళ ప్రాంతాల వైశాల్యమే పరిమితమైనప్పుడు, అందులోని తమ ఏరియా కుంచించుకుపోతున్నప్పుడు కూడా ఎల్టీటీఈ ఒకచోట ఉండి చేసే స్థావర యుద్ధాన్ని అనుసరించాల్సి కాదని చెప్పింది. సుదీర్ఘకాలం కొంత భూభాగాన్ని తన కంట్రోలులో ఉంచుకుని, పాలించిన టైగర్లు దాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడలేదని వివరించింది. రెగ్యులర్ ఆర్మీ, నేవీ, ఏయిర్‌ఫోర్స్ ను సైతం అభివృద్ధి చేసుకోవడమే కాకుండా, ఏళ్ల తరబడి పోరాడిన అనుభవం ఉన్నమాట నిజమే కాని సైనిక విన్యాసాలు చేయడానికి తగినంత భూభాగం లేనప్పుడు, చుట్టివేతకు గురైనప్పుడు వాళ్లు అక్కడి నుంచి బయటకు వచ్చి గెరిల్లా యుద్ధం చేయాల్సివుండిందని అభిప్రాయపడింది. అంతర్జాతీయ సముదాయం మద్దతుపై అతి అంచనా వేసుకుని తప్పుడు వ్యూహం అవలంభించిందని వివరించింది.
బస్తర్‌లో కూడా అలాంటి పరిస్థితే..
మావోయిస్టు పార్టీ చేసిన పై సమీక్షను చదివితే మనకు ఏమనిపిస్తుంది? ఎల్టీటీఈ విషయంలో సైనిక వ్యూహం-ఎత్తుగడలను సరైన పద్ధతిలో విశ్లేషించిన ఆ పార్టీ, తాను కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నప్పుడు ఆ గుణపాఠాన్ని ఎందుకు ఆన్వయించుకోలేకపోయింది?
టైగర్లలాగే పీఎల్జీఏ బలగాలు కూడా పరిమిత ప్రాంతంలో(నారాయణపూర్, బీజాపూర్, సుక్మా జిల్లాల్లోని ప్రాంతం) ఇరుక్కుపోయాయి. పోలీసు, మిలిటరీ బలగాలు వారి ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. కార్పెట్ సెక్యూరిటీ క్యాంపింగ్ చేస్తూ లోపలకు చొచ్చుకు వస్తున్నాయి. చుట్టివేత దాడులకు పూనుకుంటున్నాయి. పీఎల్జీఏ మెయిన్ ఫోర్స్, సెకండరీ, ప్రజా మిలీషియా బలగాలు అన్నీ కలిపినా ఓ ఐదు వేలకు అయితే మించి వుండవు. శత్రు బలగాలు 300 క్యాంపుల్లో ఉన్న సంఖ్యను కలిపినా కనీసం రెండు లక్షలు దాటి ఉన్నాయి. ఆ విషయాన్ని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో తన 2024 ఆగస్టు సర్క్యులర్‌లో వెల్లడించింది కూడా. అయినప్పుడు శత్రు దాడిని ప్రతిఘటించడానికి, బలగాలను రక్షించుకోవడానికి ఎలాంటి వ్యూహం-ఎత్తుగడలను చేపట్టి ఉండాల్సింది?
శర్లంకలో టైగర్ల ఓటమి నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలను తమ పరిస్థితులకు అన్వయించుకుని తగిన నిర్ణయాలు తీసుకునివుంటే పరిస్థితి వేరే ఉండేదేమో..!
