Friday, September 19, 2025

లింగారాం కథ.. మరో వ్యథ

దంతేవాడకు చెందిన ఆదివాసీ ఉపాధ్యాయురాలు సోని సోరి వ్యథాభరిత గాథను చదివిన వారికి ఆమెతో పాటు అదే కేసులో పోలీసులు ఇరికించిన లింగారాం కొడాపె గుర్తుండే వుంటాడు. సోనికి స్వయానా మేనల్లుడైన పాతికేళ్ల లింగారాందీ చేయని నేరానికి రాజ్యం ఉక్కుపాదం కింద నలిగిపోతున్న చరిత్రే. మురియా ఆదివాసీగా పుట్టడం.. అదీ మావోయిస్టులకు ప్రభుత్వ బలగాలకు యుద్ధం నడుస్తున్న దంతేవాడ జిల్లాలో పుట్టడం ఆతడి తప్పు కాకపోయినా శిక్ష మాత్రం అనుభవిస్తున్నాడు. యే జల్.. జంగల్.. జమీన్ హమారా.. అంటూ వచ్చిన దాదాలు తొలుత లింగారాంను తమ వైపు ఆకర్షించేందుకు ప్రయత్నం చేశారు. ‘మీ చిత్తశుద్ధి మంచిదే కాని మార్గంపై అనుమానాలున్నాయ’ంటూ సున్నితంగా తిరస్కరించాడు. హింస ఎవరు చేసినా తప్పన్నాడు. అయితే, పోలీసులు ఊరుకోలేదు. నీకు నక్సల్స్‌తో సంబంధాలున్నాయని వేధించారు. లేవని తాము నమ్మాలంటే ఎస్పీఓ (స్పెషల్ పోలీస్ ఆఫీసర్)గా చేరమన్నారు. మావోయిస్టు గెరిల్లా కావడానికి ఇష్టపడని లింగారాం పోలీసుల తరఫున పనిచేయడానికీ సమ్మతించలేదు. తనను బలవంతం చేయడం అన్యాయమన్నాడు. తిరగబడ్డాడు. అంతే.. రాజ్యం కన్నెపూరజేసింది.

40 రోజులు లాకప్‌లో బంధించింది. హక్కుల గురించి మాట్లాడతావా.. నువ్వు కచ్చితంగా నక్సలైటువేనంటూ పోలీసులు లాఠీ లు ఝుళిపించారు. చెప్పరాని హింసలు పెట్టారు. కోర్టు జోక్యంతో విడుదలై ఢిల్లీకి పారిపోయి జర్నలిస్టు శిక్షణ పొందుతుంటే మావోయిస్టు అధికార ప్రతినిధివన్నారు. ఆజాద్‌కు వారసునిగా ప్రకటించారు. దంతేవాడకు వచ్చిన వెంటనే అరెస్టు చేశారు. మైనింగ్ కంపెనీ ఎస్సార్ నుంచి 15 లక్షల రూపాయలు తీసుకుని మావోయిస్టులకు చేరవేశాడని ఆరోపించారు. రాజ్యాన్ని కూలదోయడానికి కుట్ర చేస్తున్నాడంటూ చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం(యూఏపీఏ) కింద కేసు పెట్టారు. సంవత్సరకాలంగా జైలులో బంధించి వుంచారు.

కౌకొండ బ్లాక్‌లోని సమేలి గ్రామంలో కాస్త కలిగిన కుటుంబంలోనే 1987లో పుట్టాడు లింగారాం. తండ్రి మద్రూరాం మూడు సార్లు గ్రామ సర్పంచుగా ఎన్నికయ్యారు. చిన్నాన్న మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు. డిగ్రీ వరకు చదివిన లింగారాంకు ఎప్పటికైనా మంచి జర్నలిస్టు కావాలన్న కోరిక వుండేది. గ్రామంలోకి తరచూ వచ్చే నక్సల్స్ ఆశ యం పట్ల అంతగా ఆవగాహన లేకపోయినా ఆదివాసుల కోసం పనిచేస్తున్నవారిగా సానుభూతి చూపించేవాడు. ఇది పోలీసులకు కంటగింపయింది. ప్రమాదాన్ని గ్రహించిన లింగారాం తండ్రి కొడుకు చదువు మాన్పించి జీపు కొనిచ్చాడు. దాన్ని నడుపుకుంటూ బతుకుతున్నా పోలీసులు వదలలేదు. మావోయిస్టుల్లో కలిశాడంటూ ప్రచారం చేయసాగారు. 2009 ఆగస్టు 14న లింగారాం కోసం మేనత్త సోని ఇంటిపై దాడి చేశారు. అక్కడ చిక్కకపోవడంతో అదే నెల 31న స్వగ్రామం సమేలిని చుట్టుముట్టి పట్టుకున్నారు. దంతేవాడకు తీసుకెళ్లి లాకప్‌లో బంధించారు. మావోయిస్టునని ఒప్పుకొమ్మని లేదంటే ఎస్పీఓగా చేరమని ఒత్తిడి చేశారు. లింగారాం ససేమిరా అనడంతో చిత్రహింస లు పెట్టారు. తమ్ముని జాడ తెలుపాలని లింగారాం అన్న బిలాస్‌పూర్ హైకోర్టులో సెప్టెంబర్ 18న హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో వివిధ స్టేష న్లు తిప్పారు. చివరకు అక్టోబర్ 6న హైకోర్టులో హాజరుపరచారు. కోర్టు లింగారాంను విడుదల చేసింది.

ఈ ఘటన లింగారాం జీవితాన్ని మలుపు తిప్పింది. స్థానికంగా ఉంటే పోలీసుల నుంచి వేధింపులు తప్పవని భావించి ఢిల్లీ పయనమయ్యాడు. ఓ ఎన్‌జీఓ భవనంలో ఆశ్రయం సంపాదించాడు. మల్టీమీడియా జర్నలిజంలో శిక్షణ కోసం నొయిడాలోని ఓ సంస్థలో చేరాడు. ఢిల్లీ జీవితం లింగారాంలోని నిశ్శబ్దాన్ని, ఆత్మన్యూనత భావాన్ని ఛేదించింది. అనేక మంది జర్నలిస్టులతో, మేధావులతో పరిచయాన్నీ, ప్రజాస్వామిక చైతన్యాన్నీ పెంచింది. ఛత్తీస్‌గఢ్ పోలీసుల అరాచకాలను, అక్కడి ఆదివాసుల వెతలను జాతికి వెల్లడించే ఉద్దేశంతో ‘భూసేకరణ, వనరుల దోపిడి, ఆపరేషన్ గ్రీన్‌హంట్’పై 2010 ఏప్రిల్‌లో నిర్వహించిన స్వతంత్ర ప్రజా ట్రిబ్యునల్‌లో లింగారాం పాల్గొన్నాడు. స్వామి అగ్నివేశ్ తదితరుల సమక్షంలో మావోయిస్టుల అణచివేత పేరిట తన ప్రాంతంలో కొనసాగుతున్న దమనకాండ ను బహిర్గతం చేశాడు. తనను ఏ విధంగా పోలీసులు చిత్రవధ చేసిందీ కళ్లకు కట్టినట్లు వర్ణించాడు. అభివృద్ధి పేరుతో వెచ్చిస్తున్న డబ్బు నేతల జేబుల్లోకే వెళుతోందని ఆరోపించాడు. ఆయుధాలు పట్టకుండా, నక్సలైటు కాకుండా, లేదంటే ఎస్పీఓగా చేరకుండా ఈ దేశంలో గౌరవంగా బతికే హక్కు ఆదివాసులకు లేదా? అని ప్రశ్నించాడు.

లింగారాం ఆవేదన దేశ ప్రజలకు వినిపించిందో లేదో కాని ఛత్తీస్‌గఢ్ పోలీసులకు మాత్రం బాగా వినిపించింది. లింగారాం అడ్రస్ చెప్పమంటూ వాళ్లు మేనత్త సోనిని వేధించారు. అలా చేస్తే ఆమె భర్తను జైలు నుంచి విడుదల చేస్తామని ఆశపెట్టారు. వినకపోవడంతో లింగారాంకు నక్సల్స్‌తో సంబంధాలున్నాయని, వారి పనిలో ఆంధ్రవూపదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాలు తిరుగుతున్నాడని రాసివున్న పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. స్థానిక కాంగ్రెస్ నేత అవధేశ్ గౌతమ్ ఇంటిపై 2010 జూలైలో మావోయిస్టులు చేసిన దాడిలో లింగారాం పాల్గొన్నాడని ఆరోపించారు. లింగారాం మావోయిస్టు కమాండరని, ఢిల్లీ, గుజరాత్‌లలో ఆయుధ శిక్షణ పొందాడని, చనిపోయిన ఆజాద్ స్థానంలో త్వరలో మావోయిస్టు అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టనున్నాడని డీఐజీ కల్లూరి ప్రకటన విడుదల చేశాడు. అయితే, స్వామి అగ్నివేశ్, ప్రశాంత్‌భూషణ్‌లతో కలిసి ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించిన లింగారాం ఈ ఆరోపణలను ఖండించాడు. తాను సగటు ఆదివాసీ యువకుడినని, జర్నలిజం కోర్సు చదువుతున్నానని, తనకు నక్సల్స్‌తో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశాడు.

జర్నలిజం కోర్సు పూర్తి కావడంతో 2011 ఏప్రిల్‌లో లింగారాం దంతేవాడకు తిరిగివచ్చాడు. అదే సమయంలో చింతల్నార్ ఆంబుష్ అనంతరం తాడిమెట్ల, తిమ్మాపురం, మోర్పల్లి గ్రామాల్లో కోబ్రా బలగాలు, కోయ కమాండోలు, ఎస్పీఓలు సృష్టించిన విధ్వంసకాండను దృశ్యీకరించాడు. దెబ్బలు తిన్న వ్యక్తులను, అత్యాచారానికి గురైన మహిళలను కలిశాడు. ఇంట్నట్ పోర్టల్ ‘సీజీనెట్ స్వర’కు పనిచేయడం ఆరంభించాడు. ఈ క్రమంలో స్వామి అగ్నివేశ్‌తో కలిసి జూన్‌లో బస్తర్ డివిజనల్ కమిషనర్ శ్రీనివాసులును, దంతేవాడ కలెక్టర్‌ను, ఎస్పీని కలిశాడు. తనను పోలీసులు మావోయిస్టుగా అనుమానించడం వల్లే భయంతో ఢిల్లీ పోయానని, ఇకముందు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తూ బతుకుతానని విన్నవించాడు. ఆగస్టు 15 స్వాతంవూత్యదినోత్సం నాడు మావోయిస్టులు లింగారాం గ్రామం లో నల్లజెండా ఎగురవేయగా, వారిముందే దానిని లింగారాం తీసేశాడు. ఇప్పటికి జరుగుతున్న మారణకాండ చాలని, వెళ్లిపోండని ప్రార్థించాడు.

మరోవైపు, లింగా తీసిన చింతల్నార్ వీడియోలు బయటి ప్రపంచంలో కలకలం సృష్టించాయి. సీఆర్‌పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ పోలీసుల అమానుషత్వాన్ని బయటపెట్టాయి. ఈ పరిణామాలపై రమణ్‌సింగ్ సర్కారు ఆగ్రహించడంతో పోలీసు అధికారులు లింగారాంకు, ఆతనికి అండగా ఉన్న సోనికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా ఎస్సార్ కేసుకు పథకరచన చేశారు. సెప్టెంబర్ 9న లింగాను వాళ్ల గ్రామం సమేలిలో అరెస్టు చేసి 10న పాల్నార్ గ్రామ సంతకు తీసుకెళ్లారు. ఎస్సార్ కంపెనీకి కాంట్రాక్టర్‌గా ఉన్న బీ కే లాలాను కూడా తీసుకొచ్చి డబ్బుల డ్రామా ఆడారు. వీరిద్దరు డబ్బులు మార్చుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని, మూడ వ వ్యక్తి సోని సోరి పారిపోయిందని ప్రకటించారు. (ఆతర్వాత ఆమెనూ అరెస్టు చేశారు) యూఏపీఏ కింద కేసు నమోదు చేసి జైలులో బంధించారు.

ఇదీ జర్నలిస్టు కావాలనుకున్న ఆదివాసీ యువకుడు లింగారాం కథ. ఈ కథకు ముగింపూ అతనే రాశాడు. భారత ప్రజలనుద్దేశించి జైలు నుంచి అతడు ఇటీవల పంపిన బహిరంగ లేఖలోని ముఖ్యాంశాలను చదివితే ప్రజాస్వామ్యం సిగ్గుపడక తప్పదు.

‘జర్నలిస్టుగా నా సమాజానికి, సంస్కృతికి సేవ చేయాలని ఆశిస్తే పోలీసులు నన్ను మావోయిస్టు ఆజాద్‌కు వారసుడినని ప్రకటించారు.. వారి అనుమానాల ను నివృత్తి చేద్దామని దంతేవాడకు వస్తే యూఏపీఏ కేసు పెట్టి టెర్రరిస్టుగా మార్చేశారు.. జైలులో తిండి పెట్టకుండా మాడ్చుతున్నారు.. అదేమని ప్రశ్నిస్తే బట్టలూడదీసి కొడుతున్నారు.. జడ్జికి చెప్పినందుకు దంతేవాడ జైలు నుంచి జగ్దల్‌పూర్ జైలుకు మార్చారు.. దారిలోనే ఎన్‌కౌంటర్ చేయాల్సిందని కామెంటు చేస్తున్నా రు.. జైళ్లలో వందలాది ఆదివాసులు చిన్నచిన్న కేసుల్లో బెయిలు లేకుండా సంవత్సరాలు గడిపేస్తున్నారు.. జవాన్ల చేతుల్లో అత్యాచారానికి గురైన మహిళలు జైలు కు వచ్చి శిశువులకు జన్మనిస్తున్నారు.. ఉగ్రవాదం పేర నాడు సిక్కులను ఎలా చంపేశారో ఇప్పుడు నక్సలైట్ల పేరుతో ఆదివాసులను అలానే నాశనం చేస్తున్నారు.. డబ్బున్న వారికే ఈ దేశంలోని నాలుగు ఎస్టేట్లూ (శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు, మీడియా) తోడ్పడతాయి.. వీటి గురించి మా ప్రజలకు తెలువదు.. కొంచెం తెలిసిన కారణంగా నేను జైలులో ఉన్నాను..

‘‘స్వతంత్ర జర్నలిస్టునైన నా స్వేచ్ఛను రాజ్యం హరించింది. నా లేఖ మూలం గా ఆదివాసులపై దౌర్జన్యాలు మరింత పెరగనూవచ్చు. నన్నూ ఏమైనా చేయవచ్చు. చంపేస్తే పైలోకాలకు వెళ్లి సృష్టికర్తను నిలదీయాలని ఉంది. ఈ నేలపై మూలవాసులకు జీవించే హక్కు లేదా? అని అడగాలనివుంది.. సత్యం, అహింస మార్గంలో పయనించిన నేను సర్వం కోల్పోయాను. ఎల్లెడలా గాంధీ ఫొటోలు పెట్టుకుని పూజించే ప్రభుత్వాలు.. ఆయన మార్గాన్ని అనుసరించిన పాపానికి నన్ను జైళ్లో పెట్టాయెందుకని..?’’
మన దగ్గర సమాధానమున్నదా..?

 

  • డి మార్కండేయ

Latest News