Friday, September 19, 2025

తాగునీటి పరాయీకరణ

పీల్చే గాలి లాగే తాగే నీరూ ఉచితమనుకుంటున్న వారికి దుర్వార్త.. మినరల్ వాటర్ పేరుతో ఇప్పటికే వీటిని అమ్మకపు సరుకుగా మార్చి దండిగా లాభాలు గడిస్తున్న సామ్రాజ్యవాదులు స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుళాయిల వ్యవస్థను కూడా ప్రైవేటీకరించే ప్రయత్నాల్లో ఉన్నారు. గతవారం (2012 ఫిబ్రవరి 1-3) బెంగుళూరు నగరంలోని ఓ ఐదు నక్షత్రాల హోటల్లో నిర్వహించిన ప్రపంచ నీటి సదస్సు ఈ దిశలో వ్యూహాలను రచించింది.

నీటి నిర్వహణలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పలువురు నిపుణులు, పరిశోధకులు, ప్రభుత్వేతర సంస్థల, బహుళజాతి కంపెనీల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశం నీటి సరఫరాకు సంబంధించి దేశం ముందున్న సవాళ్లను చర్చించింది. ప్రపంచం భవిష్యత్లో తీవ్ర నీటి కొరతను ఎదుర్కొనబోతున్నదని, సమగ్ర నీటి నిర్వహణకు తాగునీటి సరఫరా రంగాన్ని ప్రైవేటుకు అప్పజెప్పడం అవసరమని అభిప్రాయపడింది.

జలవిధానం ముసాయిదా..

సరిగ్గా ఇదే సమయంలో కేంద్ర నీటి వనరుల శాఖ జాతీయ జల విధానం-2012 ముసాయిదాను విడుదల చేసింది. నీటిని ఒక సరుకుగా గుర్తిస్తే తప్ప దాని వృథాను అరికట్టడం సాధ్యం కాదని తేల్చింది. నీటిని వ్యక్తిగత ఆస్తిగా కాకుండా సామాజిక ఆస్తిగా పరిగణించాలని, భారత అనుభోగ (ఈజ్మెంట్స్) చట్టం-1882ను ఇందుకు అనుగుణంగా సవరించాలని ఇందులో పేర్కొన్నారు. ప్రజలకు నీటి విలువ తెలిసిరావాలంటే జలాలకు ధరలు నిర్ణయించక తప్పదని చెప్పారు. తాగునీటి సరఫరా బాధ్యతల నుంచి ప్రభుత్వాలు వైదొలగాలని, కేవలం నియంత్రణ, పర్యవేక్షణలకు పరిమితం కావాలని సూచించారు.

విచిత్రమేమిటంటే 2005లో ప్రపంచ బ్యాంకు రూపొందించిన విధానపత్రంలోనూ సరిగ్గా ఇవే సూచనలున్నాయి. నీటిపారుదల, తాగునీటి సరఫరా, పారిశుధ్య రంగాల్లో ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించాలని బ్యాంకు సలహా ఇచ్చింది. 2011 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4 వరకు బెంగుళూరు, ముంబై నగరాలను సందర్శించిన అమెరికన్ వాటర్ ట్రేడ్ మిషన్ భారత్లో నీటి వ్యాపారానికి గల అవకాశాలను అన్వేషించింది. ప్రముఖ వ్యాపారవేత్తలు, వాణిజ్యశాఖ ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్న ఈ మిషన్ భారత్లో దినదినం విస్తరిస్తున్న నీటి విపణిలోకి అమెరికన్ కంపెనీలను ప్రవేశపెట్టే దిశలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపింది.

గాజు నుంచి పెట్ కు..

మన దేశంలో తాగునీటి వ్యాపారం 1960లలో మినరల్ వాటర్ రూపంలో మొదలైంది. నీటిని కొనుక్కొని తాగే సంప్రదాయాన్ని ఇటలీ కంపెనీ బిస్లెరీ ప్రవేశపెట్టింది. గాజు సీసాల్లో నింపిన నీటిని ప్రధాన నగరాల్లో అమ్మడం ప్రారంభించారు. ఆ తర్వాత కోకాకోలా(కిన్లీ), పెప్సీకో(అక్వాఫినా), నెస్లె(ప్యూరైఫ్) వంటి బడా సంస్థలు ప్రవేశించాయి. గాజుసీసాలు కాస్తా పీవీసీకి, అంతిమంగా పెట్ కూ మారాయి. మొదట ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై వంటి మహానగరాలే ఈ వ్యాపారానికి వేదికలుగా ఉన్నా 90లలో వచ్చిన కలర్ టెలివిజన్ విప్లవం ఈ రంగ భవితవ్యాన్ని మార్చేసింది. మినరల్ వాటర్ తాగితే రోగాలు దరిచేరవని, రుచి, శుచితో పాటు ఆరోగ్యం మీ సొంతమవుతుందంటూ టీవీ ప్రకటనలు మధ్యతరగతి వర్గాలకు రంగుల కలలను చూపించాయి.

ఫలితంగా నీటి వ్యాపారం వేగంగా విస్తరించింది. నగరాలు, పట్టణాల నుంచి పల్లెలకు మినరల్ వాటర్ బాటిళ్లు పయనమయ్యాయి. కరెంటు కూడా లేని మారుమూల పల్లెల్లో, ఆదివాసీగూడేల్లో సైతం నేడు వాటర్ బాటిళ్లు, ప్యాకెట్లు దొరుకుతున్నాయంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో ఏటా రూ. 10 వేల కోట్ల మినరల్ వాటర్ వ్యాపారం వర్ధిల్లుతున్నది. ఇందులో పైన పేర్కొన్న 4 బహుళజాతి సంస్థల మార్కెట్ వాటా 80 శాతం కాగా మిగతా 20 శాతం వ్యాపారాన్ని దేశీయ కంపెనీలు చేసుకుంటున్నాయి. తమ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి, మూలమూలల్లోకి మినరల్ వాటర్ అలవాటును తీసుకెళ్లడానికి ఈ బహుళజాతి కంపెనీలు చేయని ప్రయత్నమంటూ లేదు.

25శాతం గ్రామాలకే రక్షిత మంచినీరు..

అయితే, ఇప్పటికీ పశ్చిమ దేశాలతో పోల్చితే మన దేశంలో మినరల్ వాటర్ వినియోగం తక్కువే. అక్కడ తలసరి వినియోగం 111 లీటర్లు కాగా మన దేశంలో కేవలం అర లీటర్ మాత్రమే. ఇప్పటికీ మన పల్లెల్లో బావుల నుంచి, బోర్ల నుంచి, వాగుల నుంచి మంచినీటిని తోడుకుని తాగేవాళ్లే ఎక్కువ. దేశంలో ఉన్న 16 లక్షల గ్రామాల్లో కేవలం 4 లక్షల గ్రామాలకు మాత్రమే రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థ అందుబాటులో ఉందని స్వయంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ గత ఆగస్టులో రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

భారత నిర్ధిష్ట పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన బహుళజాతి సంస్థలు ఇక్కడి నీటి విపణిలో చొరబడడానికి ద్విముఖ వ్యూహాన్ని రచించాయి. నీటిని కొనడమేమిటన్న సగటు భారతీయుని మనస్తత్వాన్ని మార్చడం ద్వారా ఓ వైపు మినరల్ వాటర్ మార్కెట్ను పెంచుకుంటున్నాయి. రక్షిత మంచినీరు కరువైన చోట స్తోమత కలిగిన వర్గాలచే మినరల్ వాటర్ను కొనిపిస్తున్నాయి. మరోవైపు, నగరాలు, పెద్ద పట్టణాల మంచినీటి సరఫరా రంగంలోకి ప్రవేశించడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఇప్పటికే కర్నాటకలోని హుబ్లీ – ధార్వాడ్, బెల్గాం, గుల్బర్గా నగరాల తాగునీటి సరఫరాను ఫ్రాన్స్ బహుళజాతి సంస్థ వియోలియా నిర్వహిస్తోంది. బెంగుళూరులోని కొన్ని ప్రాంతాలకు బ్రిటన్కు చెందిన థేమ్స్ నది కంపెనీ నీరందిస్తోంది.

తాగునీటి ప్రైవేటీకరణ..

సైప్రస్ కంపెనీ హైడ్రో-కాంప్ మహారాష్ట్రలోని లాతూరు, తమిళనాడులోని మధురై నగరాలను చేజిక్కించుకుంది. టాటాకు చెందిన జస్కో (జం షెడ్పూర్ యుటిలిటీస్ అండ్ సర్వీసెస్ కంపెనీ) కర్నాటకలోని మైసూరు, జార్ఖండ్లోని జంషెడ్ూర్, బెంగాల్లోని హల్దియాల్లో, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని కొన్ని ప్రాంతాల్లో నీటి నిర్వహణను చేపట్టింది. ఇంకా పలు నగరాలు, పట్టణాలకు తాగునీటిని సరఫరా చేయడానికి పలు కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వాలతో, స్థానిక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రక్రియ చాలా వేగంగా కొనసాగుతోంది.

ప్రైవేటీకరణ ద్వారానే పట్టణాల నీటి సరఫరా వ్యవస్థ మెరుగుపడగలదని ప్రపంచ బ్యాంకు సహా ఈ ప్రక్రియకు అనుకూలంగా ఉన్నవారు వాదిస్తున్నారు. వాడుకునే ప్రతి లీటర్కు బిల్లు చెల్లించాల్సివుంటుంది కనుక పౌరులు నీటిని వృథా చేయరని వీరంటున్నారు. పైపుల లీకేజీ, బిల్లుల వసూళ్లు, కనెక్షన్ల తొలగింపు, కొత్త కనెక్షన్ల మంజూరు, ఫిర్యాదులకు స్పందన తదితర విషయాల్లో ప్రైవేట్ సంస్థలు మెరుగైన పనితీరు కనబరుస్తాయని వివరిస్తున్నారు. జాతీయ జలవిధానం ముసాయిదాలో కేంద్ర ప్రభుత్వం సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

చేదు అనుభవాలు..

అయితే, వాస్తవాలు మరోలా ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు సహకారంతో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన హుబ్లీ- ధార్వాడ్ నగరాల నీటి సరఫరా వ్యవస్థ పనితీరును ఓ పరిశోధకుల బృందం అధ్యయనం చేసింది. ఇక్కడ నీటి నిల్వలను ఎల్ అండ్ టీ కంపెనీ అందిస్తుండగా, సరఫరా-నిర్వహణ బాధ్యతలను వియోలియా సంస్థ చూస్తోంది. అధిక ఒత్తిడితో కూడిన స్వచ్ఛమైన నీటిని 24 గంటలు నిరంతర సరఫరా చేసే లక్ష్యంతో మొదలైన ఈ ప్రాజెక్టు చేదు అనుభవాలనే మిగులుస్తోందని బృందం తేల్చిచెప్పింది.

ఇదివరకటి కంటే సరఫరా సమయం బాగా పెరిగినప్పటికీ వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న చార్జీలు అంతకంటే ఎక్కువే పెరిగాయని, నగరంలో 80 శాతం వరకు ఉన్న పేద, మధ్యతరగతి వర్గాలకు ఇది భారంగా మారిందని వివరించింది. అక్రమ కనెక్షన్ల క్రమబద్ధీకరణ పేరుతో మురికివాడల్లో నివసించే బడుగుల నుంచి వన్ఎం చార్జీలు వసూలు చేశారని, వీధి కుళాయిలు కూడా కనుమరుగు కావడంతో అభాగ్యులకు తాగేందుకు నీళ్లు కూడా దొరకని స్థితి ఏర్పడిందని చెప్పింది. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, సబ్లో మళ్లీ సబ్ కాంట్రాక్టుల ఫలితంగా పనుల్లో జాప్యం, పని తీరులో అసమర్థత కూడా గమనించామని పేర్కొంది.

కార్పొరేట్లకే లాభం..

ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన చోటే ఇలా ఉంటే ఇక తాగునీటి సరఫరా వ్యవస్థను ఏకంగా ప్రైవేటు అప్పగించిన చోట పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. లాభార్జనే ధ్యేయంగా పనిచేసే బహుళజాతి సంస్థలు తక్కువ పెట్టుబడులతో, అతితక్కువ నిర్వహణ వ్యయంతో ఎక్కువ లాభాలను ఆశించడం సహజం. హుబ్లీ ధార్వాడ్లలాగే మిగతా నగరాల్లో ఇదే జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే ఇప్పటివరకు మన దేశంలో ప్రైవేటీకరణ జరిగిన ఏ రంగంలోనైనా లాభపడుతున్నది బహుళజాతి సంస్థలు, దేశీయ కంపెనీలు కాగా, అంతిమంగా నష్టపోతున్నది సగటు మానవుడేనన్నది గుర్తించాల్సిన విషయం.

తాగునీరు జన్మహక్కు..

మన రాజ్యాంగం గుర్తించిన ప్రాథమిక హక్కుల్లో జీవించే హక్కు కీలకమైంది. ఈ జీవించే హక్కుకు మూలం గాలి, నీరు. తాగునీటిని ప్రజల సమష్టి ఆస్తిగా గుర్తించి దేశంలో నివసించే ప్రతి పౌరునికి ఎలాంటి షరతులు లేకుండా అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుంది. ఈ బాధ్యతను మరచిన ప్రభుత్వాలు వృథాను అరికట్టడం, భావి తరాలకు నీటి కొరతను నివారించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం వంటి కుంటిసాకులతో జలాన్ని సరుకుగా చూడాలనడం, ధరను నిర్ణయించడం అసమంజసం.

ప్రభుత్వ సంస్థలు, మున్సిపాలిటీలు, పంచాయితీలు లాభాపేక్ష లేకుండా దేశంలోని పలు నగరాలకు, పట్టణాలకు తాగునీటిని తరతరాలుగా సరఫరా చేస్తుండగా, ఆ విభాగాలను సమర్థతతో పనిచేయించాల్సిందిపోయి తన విధానాలతో ఆ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు అంటగట్ట చూస్తుండడం తగదు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ ముసుగులో ప్రజా ప్రయోజనాలను సామ్రాజ్యవాదులకు, బహుళజాతి సంస్థలకు తాకట్టు పెడుతున్న పాలకుల విధానాలను ప్రజలు వ్యతిరేకించాలి. స్థానిక సంస్థలకు మరిన్ని నిధులను, అధికారాలను సమకూర్చి వాటిని స్వయంపోషకంగా మార్చాలని, దాహం వేసిన ప్రతి వ్యక్తి దప్పిక తీర్చడం పౌరుల జన్మహక్కుగా గుర్తించాలని ఉంచాలి.

  • డి మార్కండేయ

(నమస్తే తెలంగాణ ఎడిట్ పేజీ సౌజన్యంతో..)

Latest News