యూపీఏకు ట్రబుల్ షూటర్‌గా, సోనియాకు అత్యంత విశ్వాసపాత్రునిగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ గత వారం దేశ 13వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ప్రమాణం పూర్తయిన వెంటనే ఆయన చేసిన తొలి ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. పేదల ఆకాంక్షలను ధనికుల సిద్ధాంతాలు పరిష్కరించలేవంటూ ఆయన చెప్పిన నీతి వాక్యాలు పలువురి దృష్టిని ఆకర్షించాయి. ఆధునిక దేశ నిర్మాణంలో అన్నింటికన్నా ముఖ్యమైనది ఆర్థిక సమానత్వమని, పేదరికమనేది భారత నిఘంటువులో ఉండాల్సిన పదం కాదని, ఆకలి కంటే అవమానకరమైన విషయం మరొకటి ఉండదని ఆయన పేర్కొన్నారు.
నత్తనడకన సాగే కృషి ఈ సమస్యలను పరిష్కరించజాలదని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై చేస్తున్న పోరును నాలుగవ ప్రపంచ యుద్ధంగా అభివర్ణించారు. యుద్ధాల ద్వారా శాంతి సాధ్యం కాద ని, కండబలంతో కాకుండా ఆత్మబలంతో, విధ్వంసక జెండాతో కాకుండా అభివృద్ధి ఎజెండాతో భారత్ ప్రగతి పథాన సాగుతుందంటూ స్వామి వివేకానంద సూక్తిని ఉటంకించారు.
ప్రైవేటీకరణకు ఆయనే మూలం..
ప్రణబ్ చేసిన ఈ వ్యాఖ్యలను చూసి పరిశీలకులు నివ్వెరపోతున్నారు. గత నలభై ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో, పాలకపక్షంలో, అనేక సభాసంఘాల్లో, మంత్రుల గ్రూపుల్లో కీలక పదవులను చేబట్టి ఆధునిక భారత చరివూతను ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ దిశగా మలుపు తిప్పిన ముఖర్జీ ప్రథమ పౌరునిగా ప్రమాణం చేసిన వెంటనే పేదల పట్ల సానుభూతి వచనాలు పలుకడం దయ్యాలు వేదాలు వల్లించిన చందంగానే ఉందంటున్నారు.
ఆర్థిక మంత్రిగా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షునిగా, అప్పుడు ఇందిరకు, ఇప్పుడు సోనియాకు ప్రధాన సలహాదారుగా ఉంటూ ఆయన ఏనాడూ పేదరిక నిర్మూలన కోసం చిత్తశుద్ధితో కృషి చేయలేదని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో జీవన విధ్వంసానికి, మూలవాసుల వినాశానికి కారణమవుతున్న విధానాల రూపకల్పనలో సోనియా, మన్మోహన్, ప్రణబ్, చిదంబరం, మాంటేక్‌సింగ్ పంచపాండవులని పేర్కొంటున్నారు. నిజానికి మన్మోహన్‌సింగ్‌లోని ప్రతిభను గుర్తిం చి రిజర్వు బ్యాంకు గవర్నర్‌ను చేసింది కూడా ప్రణబేనని వివరిస్తున్నారు.
మూడుపాళ్ల ఆకలి.. ఆరుపాళ్ల పేదరికం..
దేశంలోనే అత్యున్నత పదవిని చేపట్టిన సందర్భంగా నాలుగు మంచి మాటలు మాట్లాడడం సంప్రదాయమని భావించి ముఖర్జీ ఆ వ్యాఖ్యలు చేసివుండవచ్చు. కాని తన జీవితకాలమం తా ధనికుల, కార్పొరేట్ల సేవలో తరించి ఇప్పుడు రాష్ట్రపతిగా పేదల పట్ల, పేదరికం పట్ల మొసలి కన్నీరు కార్చడం బాధ్యతారాహిత్యం కిందికే వస్తుంది. స్వాతం త్య్రం వచ్చి 65 ఏళ్లు గడిచాయి. అరవై ఆరు వార్షిక బడ్జెట్లు, పదకొండు పంచవర్ష ప్రణాళికలు, వందలాది అభివృద్ధి, సంక్షేమ పథకాల అనంతరం మూడు పాళ్ల ఆకలి.. ఆరు పాళ్ల పేదరికమన్నట్లుగా ఉంది పరిస్థితి.
జనాభాలో 41.6 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. రోజుకు కనీసం రూ.20 కూడా ఖర్చు పెట్టలేని వారు నూటికి 77 మంది ఉన్నారు. ప్రపంచ మానవాభివృద్ధి సూచికలో మన దేశం 134వ స్థానాన్ని, సంతోష సూచికలో 94వ స్థానాన్ని, ఆకలి సూచికలో 45వ స్థానాన్ని ఆక్రమించింది. ఆసరా కరువై లక్షలాది రైతులు తమ ఉసు రు తీసుకుంటున్నారు. ప్రతి వేయి మందిలో 24 మంది ఆకలితో మరణిస్తున్నారు. ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు రక్తహీనతతో, భారహీనతతో సతమతమవుతున్నారు.
పెరుగుతున్న బిలియనీర్లు..
పుట్టిన వేయి మంది శిశువుల్లో 48 మంది ఇంకా కళ్లు తెరువకముందే ఈ లోకాన్ని వీడి వెళ్తున్నారు. ఇప్పటికీ ప్రతి నలుగురిలో ఒక్కరు నిరక్షరాస్యులు. సగం మంది కి మరుగుదొడ్లు, స్నానపు గదులు, డ్రైనేజీ సౌకర్యం లేదు. మూడవ వంతు ఇళ్లకు కరెంటు లేదు. 68 శాతం మందికి రక్షిత మంచినీరు అందుబాటులో లేదు. ఇంకోవైపు, ధనికులు మరింత ధనవంతులవుతున్నారు. ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్న భారతీయుల సంఖ్య, వారి ఆస్తుల విలు వ రోజురోజుకూ పెరుగుతోంది.
ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు కలిగిన ధనవంతులు దేశంలో 59 మంది ఉంటే, ఐదు కోట్లకు పైబడిన ఆస్తులున్న వారి సంఖ్య 2009 నాటికే లక్షా 26వేల 7వందలకు చేరింది. వీరందరి వద్ద కలిపి 30 లక్షల కోట్ల రూపాయల ధనం మూలుగుతోంది. ఇక దేశ, విదేశాలకు చెందిన కార్పొరేట్ల ఐశ్వర్యానికైతే లెక్కే లేదు. ప్రతి యేటా వేలాది కోట్ల రూపాయలను లాభాల రూపంలో ఈ కంపెనీలు వెనకేసుకుంటున్నాయి. ఒక అంచనా ప్రకారం దేశంలోని 90శాతం సంపద జనాభాలోని కేవలం పది శాతం పెద్దల వద్ద పోగుబడివుంది.
విదేశీ కంపెనీలకు తలుపులు బార్లా..
అయినా ముఖర్జీ భాగస్వామిగా ఉన్న సర్కార్లు సహా వరుస ప్రభుత్వాలు పేదరికంపై యుద్ధాన్ని నిరంతరాయంగా, నిర్విరామంగా, అప్రతిహతంగా కొనసాగిస్తూనేవున్నాయి. ఆర్థిక సమానత్వమే లక్ష్యంగా విధానాలు రూపొందాలని, భాగస్వామ్యం తో కూడిన అభివృద్ధి అవసరమని ప్రధానులు ఆగస్టు 15న, రాష్ట్రపతులు జనవరి 26న ప్రసంగాలు చేస్తూనేవున్నారు. అయితే వారి నేతృత్వంలో నడిచే కేంద్ర కేబినెట్ చేసే నిర్ణయాలు, పార్లమెంట్ ఆమోదించే చట్టాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. విశాల ప్రజానీకానికి నష్టం కలిగించే, పెట్టుబడిదారులకు, విదేశీ కంపెనీలకు లాభం చేకూర్చే నిర్ణయాలు స్వాతంవూత్యానంతర కాలంలో లెక్కకు మిక్కిలి జరిగాయి.
తమ వలసవాద విధానాలకు అనుకూలంగా బ్రిటిష్ వాళ్లు చేసుకున్న చట్టాల ను స్వేచ్ఛాభారతంలోనూ యథాతథంగా అలాగే కొనసాగించడం ఒక ఎత్తయితే, ఆ చట్టాలకు సవరణల పేరిట ప్రైవేటుకు పెద్దపీట వేయడం మరో ఎత్తు. ప్రత్యేకించి 1990ల ఆర్థిక సంస్కరణల తర్వాత ‘దోచుకునే వారికి దోచుకున్నంత’ ప్రాతిపదికన కొత్త విధానాలు, చట్టాలనేకం వచ్చాయి. ప్రభుత్వ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ మొదలుకొని దేశీయ మార్కెట్‌ను బహుళజాతి కంపెనీలకు బార్లా తెరవడం వరకు ఈ క్రమం విజయవంతంగా కొనసాగుతున్నది.
యుద్ధమార్టమే అనుసరణ..
నూతన ఆర్థిక విధానా ల్లో భాగంగా రూపొందిన, రూపొందుతున్న పారిక్షిశామిక, వ్యాపార, బ్యాంకింగ్, కార్మిక, జల విధానాలు, భూసేకరణ, మైనింగ్, సెజ్ తదితర చట్టాలు, కంపెనీల చట్టానికి సవరణలు ఇందులో భాగమే. చివరకు చిరు వ్యాపారస్తులకు జీవనాధారంగా ఉన్న రిటైల్ రంగాన్ని సైతం విదేశీయులకు కట్టబెట్టడానికి కుట్ర జరుగుతోంది. అభివృద్ధిలో పేదలకు, స్థానికులకు, మూలవాసులకు ప్రయోజనం చేకూరే ఒక్కటంటే ఒక్క చట్టాన్ని పాలకులు ఆమోదించలేకపోయారు.
యుద్ధాల ద్వారా శాంతి సాధ్యం కాదని ప్రణబ్ సరిగ్గానే చెప్పారు. కాని దురదృష్టవశాత్తూ ఇక్కడి ఏ ప్రభుత్వమూ ఈ సూక్తిపై నమ్మకముంచలేదు. యుద్ధమార్గాన్నే అనుసరించాయి. 1947 తర్వాత కాశ్మీర్ మినహా మిగతా ప్రాంతాల్లో చెలరేగిన పోరాటాలు, సాయుధ ఉద్యమాలన్నీ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షల కోసం మొదలైనవేనన్నది మరవరాదు. భారత్‌లో తమ ప్రాంతాలను బలవంతంగా విలీనం చేశారని, తమకు స్వేచ్ఛ, స్వయం నిర్ణయాధికారం కావాలని ఈశాన్య రాష్ట్రాల ప్రజలు డిమాం డు చేశారు.
రావణకాష్టంలా కశ్మీర్..
ప్రజాస్వామిక పద్ధతిలో వారితో చర్చలు జరిపి సానుకూలవాతావరణంలో పరిష్కరించడానికి బదులు సైన్యాన్ని దించి, మినీ ఎమ్జన్నీ విధించి అణచివేతకు పూనుకోవడంతోనే సమస్య జఠిలరూపం దాల్చింది. మరోవైపు, భారత, పాక్ పాలకుల స్వార్థపూరిత, ఓటుబ్యాంకు రాజకీయాల మూలంగానే కాశ్మీర్‌లో ఉగ్రవాదం రావణకాష్ఠంలా కొనసాగుతోందన్నది జగద్విదితం. స్థానిక ప్రజలు ఏం కోరుకుంటున్నారో పట్టించుకున్న నాథుడు లేడు.
ప్లెబిసైట్ పజాభివూపాయ సేకరణ) జరిపి సమస్యను పరిష్కరించాల న్న ఐరాస తీర్మానానికి ఇరుదేశాలూ కట్టుబడిలేవు. సైన్యాన్ని ప్రయోగించి భారత్, ఉగ్రవాదులను ప్రవేశపెట్టి పాక్ మారణకాండలకు కారణమవుతున్నాయి. ఇక, అంతర్గత భద్రతకు పెనుముప్పుగా పరిణమించిందని ప్రధాని పదేపదే చెబుతున్న వామపక్ష ఉగ్రవాదం (మావోయిజం) సైతం మౌలిక సమస్యల నుంచి ఉద్భవించినదే. పేదరి కం, అసమానతలు, వివక్ష, అణచివేతల ఫలితంగానే ఈ ఉద్యమం విశాల ప్రజానీకం మద్దతు పొందుతోందన్నది అందరూ ఒప్పుకుంటున్న విషయం.
చిలుక పలుకులేనా?
ప్రణబ్ సహా పలువురు నేతలు ఈ విషయాన్ని పలుమార్లు నొక్కి వక్కాణించారు కూడా. అయినప్పటికీ స్వామి అగ్నివేశ్ లాంటి మేధావులు శాంతి చర్చలకు ప్రయత్నిస్తున్న సమయంలో యూపీఏ సర్కారు 2009లో ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను ప్రారంభించింది. సమస్యను సైనికంగానే పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. గ్రీన్‌హంట్ సందర్భంలో సైన్యాన్ని సైతం వినియోగించాలనే చిదంబరం వాదనను సమర్థించిన వారిలో ప్రణబ్ కూడా ఒక్కరన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం.
ప్రణబ్ సహా సర్కారీ పెద్దలు తమ చిలుక పలుకులను ఇకనైనా మానుకోవాలి. మన రాజ్యాంగ స్ఫూర్తి పౌరులందరికీ స్వేచ్ఛా సమానత్వాలను, ప్రజాస్వామ్య హక్కులను కల్పించాలని చెబుతున్నా వరుస ప్రభుత్వాలు చెప్పేదొకటి.. చేసేదొకటన్న విధానాలను అనుసరిస్తుండడం వల్లనే దేశ ప్రజలకు ఈ దుస్థితి దాపురించింది. పేదరికం విడువని శాపంగా పరిణమించింది.మూడింట రెండు వంతుల భూభాగంలో యుద్ధ పరిస్థితులు నెలకొనివున్నాయి. తాను చేసిన వ్యాఖ్యల పట్ల ప్రణబ్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాజ్యాంగాధినేతగా, ప్రజాస్వామ్య సంరక్షకునిగా తాను పదవిలో ఉండే ఐదేళ్లలో తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి.
రబ్బరు స్టాంపు రాష్ట్రపతిని కాద ని నిరూపించుకోవాలి. ధనికులకు, ప్రైవేట్ కార్పొరేట్లకు అనుకూలంగా, ప్రజలకు, ప్రజాస్వామిక విలువలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలు, బిల్లులు తన ముందుకు వచ్చినప్పుడు తిరస్కరించాలి. త్రివిధ దళాల సర్వ సైన్యాధిపతిగా దేశంలోని వివిధ ప్రాంతా ల్లో కొనసాగుతున్న ఉద్యమాలపై అణచివేతను ఆపాలి. లక్షకు పైబడిన బలగాలతో మధ్యభారతంలో నిర్వహిస్తున్న ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు ప్రారంభించాలి.
-డి మార్కండేయ