రా ష్ట్రపతి.. ప్రధానమంత్రి.. కేబినెట్ కార్యదర్శిల కంటే కూడా అధిక వేత నం పొందుతున్న ప్రభుత్వోద్యోగి ఎవరో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జితేంవూదసింగ్ గత బుధవారం లోక్‌సభలో వెల్లడించారు. ఆయన పేరు కెప్టెన్ రఘురామన్. నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ (నాట్‌క్షిగిడ్)కు సీఈఓ. నెలకు రూ. 10 లక్షల జీతం. సకల సౌకర్యాలు, ఇతర భత్యాలు అదనం. ప్రైవేట్ కార్పొరేట్లకు సేవలందించి ప్రతిఫలం పొందే స్వేచ్ఛనూ ఆయనకు ప్రభుత్వం కల్పించింది. అయితే ఇక్కడ విషయం అది కాదు. రామన్ జీతభత్యాల కంటే కూడా ఎక్కువ ఆసక్తిని కలిగించే అంశాపూన్నో ఆయన పనిచేసే నాట్‌క్షిగిడ్‌లో ఉన్నాయి. 26/11 ముంబయి దాడుల నేపథ్యంలో ఉగ్రవాదుల ఆటకట్టించే లక్ష్యంతో ఏర్పాటు చేసి న ఈ సంస్థ దేశ పౌరులందరి వివరాలను, కదలికలను, కార్యకలాపాలను, లావాదేవీలను సేకరిస్తుంది. చిత్రగుప్తుని చిట్టా లాంటి సమాచార సమువూదాన్ని సృష్టిస్తుం ది. ఎప్పటికప్పుడు వివరాలను అప్‌డేట్ చేస్తూ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు, ఉగ్రవాద వ్యతిరేక సంస్థలకు, పోలీసు, మిలిటరీ బలగాలకు, ప్రభుత్వ విభాగాలకు అందుబాటులో ఉంచుతుంది. అంతర్జాతీయ అనుసంధానం పూర్తయిన తర్వాత అమెరికా, యూరోపు దేశాలు సైతం ఈ సమాచారాన్ని పొందే వీలుంటుంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నివసించే ఓ వ్యక్తి కార్యకలాపాలను, కదలికలను అమెరికాలోని పెంటగాన్ హెడ్‌క్వార్టర్స్‌లో కూర్చున్న అధికారి పరిశీలించవచ్చు. పర్యవేక్షించవచ్చు.
ఒక అంచనా ప్రకారం నాట్‌క్షిగిడ్ పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే అప్పుడు మనకంటూ ప్రైవసీ అనేది మిగిలుండదు. ఎవరికి కాల్ చేశాం.. ఏమేం మాట్లాడాం.. ఎలాంటి ఎస్సెమ్మెస్‌లు పంపించాం.. ఏ సైట్‌ను ఓపె న్ చేశాం.. ఎవరితో చాటింగ్ చేశాం.. ఏ బ్యాంకులో ఎంత డబ్బుంది.. ఎప్పుడెప్పుడు ఏ ఏటీఎంలోంచి ఎంత డబ్బు తీశాం.. రైలులో, విమానంలో ఎక్కడెక్క డ తిరిగాం.. క్రెడిట్ కార్డుతో ఏం కొన్నాం.. మన ఆదాయమెంత.. అప్పుపూంత.. ఐటీ రిటర్నుల్లో ఏ వివరాలిచ్చాం.. ఎక్కడ ఇల్లు కొన్నాం.. ఏ కంపెనీలో షేర్లు తీసుకున్నాం.. ఇలాంటి వివరాలన్నీ నాట్‌క్షిగిడ్ వద్ద లభ్యమవుతాయి. అనగా మనకు మాత్రమే తెలుసనుకు న్న రహస్యాలు ఇకముందు మనవి కాకుండా పోతా యి. పరులకు తెలుస్తాయి. గమనించాల్సిన విషయమేమిటంటే ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే పేరిట ప్రభుత్వం ఇదంతా చేస్తోంది. అయితే, తమ చేతుల్లో పడిన సమాచారాన్ని ఆయా ఏజెన్సీ లు, సంస్థలు ఎంతమేరకు కాపాడతాయి? కింది స్థాయి సిబ్బంది దుర్వినియోగం చేయకుండా ప్రభు త్వం తీసుకుంటున్న జాగ్రత్తలేమిటి? వ్యక్తిగత రహస్యాలు అవాంఛనీయ శక్తుల చేతుల్లోకెళితే పౌరుల పరిస్థితేమిటన్నది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం.
ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం చొరవతో మూడేళ్ల కిందట నాట్‌క్షిగిడ్ రూపుదిద్దుకుంది. 2008 లో ముంబైపై ఉగ్రవాదులు భీకరదాడికి పూనుకున్న నేపథ్యంలో ఆయన అంతర్గత భద్రతపై అప్పట్లో ఓ సిద్ధాంత పత్రాన్ని సమర్పించారు. ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు వాటిని ఎదుర్కోవడంలో, త్రిప్పికొట్టడంలో మనకున్న సమర్థత వాటిని ముందే పసిగట్టడంలో, దాడులను నివారించడంలో లేదని అందు లో ఆయన తేల్చిచెప్పారు. దేశ పౌరులందరి సమగ్ర సమాచార సేకరణ యంత్రాంగంగా నాట్‌క్షిగిడ్‌ను, ఉగ్రవాదులపై దాడులను కేంద్రస్థాయిలో సమన్వయించడానికి ఎన్‌సీటీసీని ప్రతిపాదించారు. నాట్‌క్షిగిడ్ లాంటి నిర్మాణముంటే లష్కరే ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ కదలికలను ముందే పసిగ ముంబై దాడులను నివారించగలిగేవాళ్లమని వాదించారు. ఆయన వాదనతో సర్కారు పెద్దలు ఏకీభవించారు.
అలా 2009 డిసెంబర్ 1న నాట్‌క్షిగిడ్ ఏర్పాటును భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఎస్) ప్రకటించింది. ఇందుకు రూ.2800 కోట్లు ఖర్చవుతుందని అంచనావేసింది. సైన్యంలో కెప్టెన్‌గా రిటైరై మహీంద్రా స్పెషల్ సర్వీస్ గ్రూపు లో సాఫ్ట్‌వేర్ నిపుణునిగా పనిచేస్తున్న రామన్‌ను సీఈఓగా నియమించింది. 2011 మార్చ్‌కల్లా దీనికి సంబంధించిన డీటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారుకాగా, జూన్‌లో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. ఆయేటి బడ్జెట్‌లో రూ. 39.75 కోట్లు, 2012 జూన్‌లో మరో 1100 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించడంతో పనులు వేగం పుంజుకున్నాయి. హారిజాన్-1,2 ల కు సంబంధించిన సాంకేతిక సామాగ్రి కొనుగోలు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్నది.
మొదటి రెండు దశల్లో అన్ని రకాల టెలికాం, ఇంట్నట్, బ్యాంకింగ్ సేవల ను, బీమా, ఇంకమ్‌టాక్స్, స్టాక్‌మ్కాట్, విదేశీ కరెన్సీ, ఆర్‌టీఏ, రిజిస్ట్రేషన్, రైల్వే, విమానయాన, ట్రాన్స్‌పోర్ట్, పాస్‌పోర్ట్-వీసా, ఎన్నికల కమిషన్, ట్రాఫిక్, జైళ్లు, పోలీస్ తదితర 21 రంగాల సమాచారాన్ని అనుసంధానిస్తారు. తదుపరి ప్రైవేట్ కంపెనీల, సంస్థల సమాచారాన్ని సైతం జోడిస్తారు. దేశ పౌరులందరికీ ప్రత్యేక గుర్తింపు నెంబర్ ఇచ్చే లక్ష్యంతో నందన్ నిలేకని నేతృత్వంలో కొనసాగుతున్న యూఐడీ ప్రాజెక్టు, 2011 జనాభా లెక్కల సేకరణలో భాగంగా రూపొందిస్తున్న నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ నాట్‌క్షిగిడ్‌కు వెన్నెముకగా పనిచేస్తాయి. ఫలితంగా ఒక వ్యక్తి గుర్తింపు నెంబర్‌ను ఫీడ్ చేయగానే ఆ వ్యక్తికి సంబంధించిన సమగ్ర సమాచారం కంప్యూటర్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. అతడు నెట్‌లో ఏ సైట్ దర్శిస్తున్నాడు? ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాడు? రైలులో/విమానంలో/టాక్సీలో ప్రయాణిస్తున్నాడా? ఎవరితో లావాదేవీలు నెరుపుతున్నాడు? తదితర వివరాలన్నీ వెంటది లైవ్‌గా తెలుసుకోవచ్చు. ఆధార్ ప్రక్రియలో భాగం గా ప్రస్తుతం సేకరిస్తున్న పౌరుల ఫొటోలు, పదివేళ్ల ముద్రలు, కళ్ల ఐరిస్ స్కాన్‌లు నేరస్తులను ఇట్టే గుర్తించడానికి, హౌజ్‌హోల్డ్ సర్వేలో భాగంగా సేకరిస్తున్న ప్రతి ఇంటి జీపీఎస్ రికార్డులు వారిని వెంటనే పట్టేయడానికి ఉపకరిస్తాయి.
ఇదంతా చెప్పుకోవడానికి బాగానే ఉంది. హోం శాఖ అధికారులు చెబుతున్నట్లుగా ఉగ్రవాదుల ఆటకట్టించడానికీ పనికిరావచ్చు కూడా. అయితే, ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఆటుపోట్లుంటాయి. తప్పొప్పులుంటాయి. తనకు మాత్రమే తెలిసిన, తెలువాల్సిన రహస్యాలనేకం ఉంటాయి. గత జీవితంలో ఒకరు జైలుకు పోవ చ్చు. మరొకరు ప్రియురాలితో రొమాంటిక్ చాటింగ్ చేయవచ్చు. ఇంకొకరు నిషేధించిన సంస్థతో సంబంధాలు నెరపవచ్చు. ఇవన్నీ ప్రభుత్వ సంస్థలకు, పోలీసు-ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు తెలవాలని ఎవరూ కోరుకోరు. మన రాజ్యాంగం సైతం ఆర్టికల్ 21 రూపంలో పౌరులందరికీ జీవించే స్వేచ్ఛను, వ్యక్తిగత స్వాతంవూత్యాన్ని కాపాడుకునే హక్కును ప్రసాదించింది. ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రవూపదేశ్ కేసులో సుప్రీంకోర్టు సైతం ప్రైవసీ హక్కు జీవించే హక్కులో విడదీయరాని భాగమని నొక్కిచెప్పింది. మేనకాగాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మరో తీర్పును వెలువరిస్తూ ఈ హక్కుకు లోబడే ఆయా ప్రభుత్వా లు చట్టాలను, విధానాలను రూపొందించాలని సూచించింది.
విచివూతమేమిటంటే నాట్‌క్షిగిడ్‌కు సంబంధించి ఇప్పటివరకూ సర్కారు ఎలాంటి చట్టమూ చేయలేదు. కేవలం కేబినెట్ నిర్ణయాలుగానే ఇదీ, ఆధార్ ప్రాజెక్టూ అమలవుతున్నాయి. ఈ ప్రాతిపదిక పైనే కొన్ని మంత్రిత్వ శాఖలు నాట్‌క్షిగిడ్‌కు, ఆధార్‌కు అభ్యంతరం చెప్పాయి. వారి అభ్యంతరంలో వాస్తవముంది. ఎందుకంటే మన దేశంలో ఇప్పటి వరకూ పౌరుల ప్రైవసీని కాపాడడంపై అంత గా చర్చ జరగలేదు. అమెరికా తదితర పశ్చిమ దేశా ల్లో ఈ అంశంపై స్పష్టమైన చట్టాలున్నా మన పాలకులు పట్టించుకోలేదు. పైగా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ వివిధ రూపాల్లో పౌరుల జీవించే స్వేచ్ఛ పై, భావవూపకటనా స్వేచ్ఛపై దాడిచేస్తూ వస్తున్నారు. అధికార పార్టీ పెద్దలు తమ శత్రువులనుకున్న వ్యక్తు ల ఫోన్ల టాపింగ్ ఇలాంటిదే. పోలీసుల ద్వారా కాల్ రికార్డింగ్, బ్యాంకు లావాదేవీల వివరాలను సైతం రాబట్టుకుంటున్నారు. పలుమార్లు ఇది బహిర్గతమై దేశంలో దుమారాన్ని సృష్టించింది.
ప్రజల్లో నిరసన పెల్లుబికింది. పార్లమెంటు దద్దరిల్లింది. ఈ నేపథ్యంలో వచ్చిందే 2008-ఇన్ఫార్మేషన్ టెక్నాలజీ యాక్ట్. ఈ చట్టం ప్రకారం ఎలాంటి వారంటు, కోర్టు ఆదేశం లేకుండా కమ్యూనికేషన్ వ్యవస్థను ప్రభు త్వం నిర్దేశించిన అధికారులు టాప్ చేయవచ్చు. రికార్డు చేయవచ్చు. ఆయా సంస్థల కంప్యూటర్ల నుంచి డాటాను పొందవచ్చు. ఒక సీఐ స్థాయి పోలీసు అధికారి తలుచుకుంటే ఏ ప్రముఖ వ్యక్తి కాల్స్‌నైనా టాప్ చేసి ఎంతటి సంచలనాలకు కారణం కావచ్చునో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఉదంతం మనకు పరిచయం చేసింది కూడా. ఐటీ యాక్ట్‌తోనే ఇంత జరిగితే రేపు నాట్‌క్షిగిడ్ పూర్తిస్థాయిలో పనిచేయడం ఆరంభిస్తే ఇంతకు మించిన సంచలనాపూన్నింటినో మనం చూడకతప్పదు. సంచలనాలే కాదు.. వ్యక్తుల రహస్యాలే అస్త్రంగా బ్లాక్‌మెయిళ్లూ, కిడ్నాపింగులూ, దోపిడీలూ, సెక్స్ స్కాంలూ, అవమానం భరించలేక ఆత్మహత్యలూ పెరగక తప్పదు.
ఇప్పటికైనా భారత ప్రభుత్వం మేల్కొనాలి. పౌరుల ప్రైవసీపై దాడి చేసే నాట్‌క్షిగిడ్ ప్రాజెక్టును రద్దు చేయాలి. ఇప్పటికే ఉనికిలో ఉన్న-రా, ఐబీ, జేఐసీ, ఎన్‌టీఆర్‌ఓ, ఈడీ, ఆర్‌ఐ తదితర ఇంటెలిజెన్స్ సంస్థలను సమర్థవంతంగా పనిచేయించాలి. ఈ సంస్థల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకునే తత్వాన్ని పెంచాలి. విదేశీయుల రాకపోకల వివరాలను కలిగివుండే ఇమ్మిక్షిగేషన్ బ్యూరో ఐబీ కంట్రోలులో నే ఉన్నప్పటికీ టెర్రరిస్టు హెడ్లీ కదలికలను ఆ సంస్థ పసిగట్టలేకపోయిందన్న అంశాన్ని గుర్తించాలి. వ్యవస్థల వైఫల్యాలను సరిదిద్దడం గాలికి వదిలేసి ఘటన జరిగినప్పుడల్లా ఒక కొత్త సంస్థను సృష్టించడం మానేయాలి. విలువైన ప్రజాధనా న్ని వృథా చేసే ఇలాంటి విధానాలకు పాలకులు ఇకనైనా స్వస్తి పలకాలని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు డిమాండు చేయాలి.
-డి. మార్కండేయ