జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందామంటూ కాప్-11 సదస్సుకు ఆతిథ్యమిస్తు న్న మన సర్కారు కూడంకుళంలో మానవ మనుగడకు ప్రమాదకరమ ని భావిస్తున్న అణు విద్యుత్ ప్రాజెక్టును యుద్ధవూపాతిపదికన ప్రారంభించే పనిలో పడింది. స్థానికుల తీవ్ర నిరసనను సైతం పట్టించుకోకుండా పోలీసు, పారా మిలిటరీ బలగాల సాయంతో అణు రియాక్టర్లలో ఇంధనం నింపే కార్యక్షికమాన్ని కొనసాగిస్తోంది. ప్రాజెక్టు పరిసర గ్రామాలకు చెందిన సుమారు నలభైవేల మంది ప్రజానీకం పది రోజులుగా తమ ఇళ్లకు తాళం పెట్టి విద్యుత్ కేంద్రం ఎదుట బైఠాయించినా కనికరించకుండా పాశవిక అణిచివేతకు పూనుకుంటున్నది. లాఠీలను, బాష్పవాయు గోళాలను, చివరకు తూటాలను ప్రయోగించడానికి తెగబడింది. సంబంధి త ఘటనల్లో ఇప్పటికే ఇద్దరు మత్స్యకారులు చనిపోగా, స్త్రీలు పిల్లలు సహా పలువు రు గాయపడ్డారు. అనేక మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయినా ఉద్యమకారులు వెనక్కి తగ్గకుండా శాంతియుతంగా తమ నిరసనను కొనసాగిస్తున్నారు. నీళ్ల లో నిలబడి జల సత్యాక్షిగహానికి పూనుకుంటున్నారు. వీరికి మద్దతుగా తమిళనాడు అంతటా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వ వైఖరిపై దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, పర్యావరణవేత్తలు, మేధావులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు అణువిద్యుత్‌కు ప్రాధాన్యం తగ్గిస్తూ ప్రత్యామ్నాయాలు వెదుక్కుంటున్న సమయాన మన పాలకులు అది లేనిదే దేశాభివృద్ధి సాధ్యం కాదన్నట్లు మాట్లాడడం విడ్డూరమని పేర్కొంటున్నారు. అణువిద్యుత్ తయారీలో వెలువడే రేడియేషన్, వ్యర్థ పదార్థాలు మానవాళికే కాకుండా చేపలు తదితర జీవజాతికి సైతం చేటు చేస్తాయని హెచ్చరిస్తున్నారు.
తిరునల్వేలి జిల్లా కూడంకుళం-ఇదింతకరాయ్ గ్రామాల పరిధిలో అణువిద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని 1988లో ప్రతిపాదించారు. సోవియట్ యూనియన్ సహకారంతో రెండు రియాక్టర్లను నెలకొల్పి రెండువేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలనుకున్నారు. తర్వాతి కాలంలో ఈ సామర్థ్యాన్ని ఆరు రియాక్టర్లు.. 9200 మెగావాట్ల విద్యుత్‌కు పెంచారు. సోవియట్ యూనియన్ కుప్పకూలిపోవడం, రాజీవ్‌గాంధీ హత్య జరగ డం తదితర పరిణామాల నేపథ్యంలో ప్రాజెక్టు అమలులో తీవ్ర జాప్యం జరిగింది. 1997లో దేవేగౌడ ప్రధానిగా ఉన్న కాలంలో ఫైళ్లు మళ్లీ కదిలి పనులు మొదలయ్యాయి. 2011 జూలైకల్లా ఈ పనులన్నీ పూర్తయి రియాక్టర్ టెస్ట్న్ నిర్వహించారు. ఈ రన్ సందర్భంగా ప్లాంట్ నుంచి దట్టమైన పొగ, భారీ శబ్దాలు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనల కు లోనయ్యారు. దీంతో స్థానిక జనం అప్పటికే ఫుకుషిమా దుర్ఘటనను టీవీల్లో చూసివున్నారు కనుక రేపు తమకూ అదే గతి పడుతుందని కలవరపడ్డారు. అప్ప టి వరకూ అణుశక్తి వ్యతిరేక ప్రజా ఉద్యమం (పీఎంఏఎన్‌ఈ) నేతృత్వంలో కొనసాగిస్తున్న ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. సభలు, ర్యాలీలు, రోడ్ల దిగ్బంధాలు, రిలే, ఆమరణదీక్షలకు పూనుకున్నారు. ఈ నిరసనల మూలంగా ప్రాజెక్టుకు తాత్కాలికంగా బ్రేక్ పడినా, ఈ సంవత్సరం జూన్‌లో తిరిగి పనులు వేగం పుంజుకున్నాయి. తాజాగా ఆగస్టు 31న మద్రా సు హైకోర్టు ప్రాజెక్టులోని యూనిట్-1, 2ల ప్రారంభానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఇంజనీర్లు మొదటి రియాక్టర్‌లో ఇంధనం నింపే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
ఈ పరిణామంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. తమ నిరసనను పాలకులు లెక్కచేయకపోవడం పట్ల ఆగ్రహించారు. తుది సమరానికి సిద్ధమై సెప్టెంబర్ 9న నగారా మోగించారు. ఎన్నడూ ఇళ్లకు తాళం వేయడం ఎరుగని ఇదింతకరాయ్ గ్రామస్తులు ఆ రోజు ఉదయమే తమ ఇళ్లకు తాళాలు వేసి బయలుదేరారు. పరిసర గ్రామాల ప్రజలు వారితో కలిశారు. మహిళలు, పిల్లలు ముందు నడుస్తుండగా దారి లో ఉన్న చర్చిలో ప్రార్థనలు ముగించుకుని అణువిద్యుత్‌కేంద్రం ముందట బైఠాయించారు. ప్లాంట్ లోపలికి చొచ్చుకెళ్లాలన్న ఆందోళనకారుల ప్రయత్నాలను మొద టిరోజు ప్రభుత్వ బలగాలు నిరోదించాయి. రెండవరోజు కొంతమంది మత్స్యకారులు పడవల్లో సముద్రం వైపు నుంచి వచ్చి చొరబాటుకు యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అప్పటికే సంఘటనాస్థలిలో మకాం వేసిన కలెక్టర్, ఎస్పీ తదితర అధికారులు మరికొన్ని బలగాలను రప్పించి ఉద్యమకారులపై దాడికి పూనుకున్నారు. గర్భిణులని కూడా చూడకుండా మహిళలను, చిన్నపిల్లలను చితకబాదారు. బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు అనేక మందిని అరెస్టు చేశారు. పీఎంఏఎన్‌ఈ నేత ఉదయ్‌కుమార్‌ను అరెస్టు చేయడానికి ప్రయత్నించగా ప్రజలు ఆయనను తప్పించారు. అప్పటినుంచీ నిరసన కొనసాగుతున్నది.
ఇంత జరుగుతున్నా సర్కారు మాత్రం మొండివైఖరినే ప్రదర్శిస్తున్నది. ప్లాంటు నిలుపుదలకు ససేమిరా అంటున్నది. కూడంకుళం ఉద్యమం వెనకాల విదేశీ శక్తుల హస్తం ఉన్నదని గతంలో ఆరోపించిన ప్రధాని మన్మోహన్ అణువిద్యుత్ కేంద్రాల ను మూసేయడం దేశానికి హానికరమని ఇటీవల పార్లమెంటులో చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. ఆయన మాటలు వాస్తవ విరుద్ధమని అణువిద్యుత్‌పై ఇటీవలికాలంలో ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న వైఖరే చెబుతున్నది. చెర్నోబిల్, ఫుకుషిమా అణు ప్రమాదాల అనంతరం అనేక పెద్ద దేశాలు తమ అణువిద్యుత్ ఉత్పత్తి కార్యక్షికమాలను నిలిపేయడమో లేక కుదించుకోవడమో చేస్తున్నాయి. జల, సౌర, పవన విద్యు త్ ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తున్నాయి. దేశంలో ఉన్న మొత్తం 54 రియాక్టర్లనూ జపాన్ మూసేసింది. 2022 కల్లా అన్ని అణు విద్యుత్ కేంద్రాలనూ మూసేస్తామని జర్మనీ ప్రకటించింది. గంటకు 22వేల మెగావాట్ల పవనవిద్యుత్‌ను తయారుచేసి రికార్డులకెక్కింది. చెర్నోబిల్ తర్వాత అణు కార్యక్షికమాన్ని వాయిదా వేసుకున్న ఇటలీ 2010లో తిరిగి ఆ ప్రయత్నాలు చేయగా, దేశవ్యాప్తంగా నిర్వహించిన రెఫండంలో 90 శాతం ప్రజలు వ్యతిరేకించడంతో వెనకడుగు వేసింది. మొత్తంలో 78శాతం అణువిద్యుత్‌నే తయారుచేస్తున్న ఫ్రాన్స్ కూడా 2025 కల్లా దానిని 50శాతానికి తగ్గిస్తానని ప్రకటించింది. తన వద్ద గల 104 రియాక్టర్ల పనితీరును సమీక్షించాలని అమెరికా నిర్ణయించింది. స్విట్జర్లాండు సహా పలు దేశాలు అణువిద్యుత్ వాటాను క్రమంగా తగ్గించే బాటన పయనిస్తున్నాయి.
తన ప్రసంగంలో ప్రధాని మరో అబద్ధమాడారు. దేశంలోని ఆరు అణువిద్యుత్ కేంద్రాల్లో 19 రియాక్టర్లు పనిచేస్తున్నాయని, ఇప్పటివరకు ఎక్కడా చిన్న ప్రమాద మూ జరగలేదని పేర్కొన్నారు. కానీ ఉత్తర్‌వూపదేశ్‌లోని నరోరా ప్లాంటులో 1993లో మెకానికల్ టర్బైన్ బ్లేడ్ ఫెయిలై చెర్నోబిల్ లాంటి ఘటన తృటిలో తప్పింది. కర్నాటకలోని కైగా ప్లాంటులో 1994లో 134 టన్నుల బరువున్న పైకప్పు (డోమ్) 30 మీ. ఎత్తు నుంచి రియాక్టర్‌పై కూలింది. 2009లో రేడియోధార్మికతకు గురైన నీళ్లు తాగి పలువురు ఉద్యోగులు అస్వస్థులయ్యారు. పలు సాంకేతిక సమస్యల మూలంగా రాజస్థాన్‌లోని రావల్‌భట్టా, తమిళనాడులోని కల్పాక్కం కేంద్రాల్లోని రియాక్టర్ల ఉత్పత్తి స్థాయిని తగ్గించారు. గుజరాత్‌లో కాక్రపార్ కేంద్రంలో 1991లో అగ్నివూపమాదం సంభవించగా, 94లో వరదలు ముంచెత్తాయి. ఇక 1969లోనే పనిచేయడం ఆరంభించిన తారాపూర్ రియాక్టర్లు పాతబడిపోయి అధిక రేడియేషన్‌ను వెలువరిస్తున్నాయని గుర్తించి ఉత్పత్తి స్థాయిని తగ్గించారు.
అణు కేంద్రాల నుంచి వెలువడే రేడియేషన్ మూలంగా పరిసరాల్లో నివసించే ప్రజలకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తున్నాయన్న విషయాన్ని మన ప్రభుత్వం దాచిపెడుతున్నది. అణుశక్తి విభాగం(డీఏఈ) ఆధ్వర్యంలో డాక్టర్ మంజులా దత్తా చేసిన అధ్యయనంలో కల్పాక్కం ప్లాంటుకు దూరంగా ఉన్న గ్రామాలతో పోలిస్తే పరిసర గ్రామా ల్లో 400శాతం అధికంగా క్యాన్సర్, టీబీ, సంతానలేమి, గుండెపోటు, మధుమేహం తదితర వ్యాధిక్షిగస్తులున్నారని తేలింది. డాక్టర్ పుహలేంది నేతృత్వం లో కొనసాగిన మరో అధ్యయనంలో అణుకేంవూదాల కు 500 కి.మీ.ల దూరంలో నివసిస్తున్నవారితో పోలి స్తే 40 కి.మీ.ల పరిధిలో నివసిస్తున్న ప్రజల్లో థైరాయిడ్ సమస్యలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఇక అణుకేంవూదాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎక్కువ మం ది మల్టీపుల్ మైలోమా(బోన్‌మారో క్యాన్సర్)తోనే చనిపోతున్నట్లు కూడా ఈ అధ్యయనం తేల్చింది.
అయితే కూడంకుళం ప్రజలు అణువిద్యుత్ కేంద్రంపై అనవసర భయాలు, అపోహలు కలిగివున్నారని, విదేశీ శక్తుల కుట్రలకు బలై నిరసనోద్యమాలు చేపడుతున్నారని ప్రభుత్వ వర్గాలు ఆరోపించడం అన్యా యం. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి జాతీయ విద్యుత్ విధానాన్ని సమీక్షించాలి. చెర్నోబిల్ లేదా ఫుకుషిమా లాంటిది ఒక్క ఘటన జరిగినా జాతికి పెనువూపమాదమ ని గుర్తించాలి. అణువిద్యుత్‌పై ఆధారపడే ప్రణాళికలకు స్వస్తి చెప్పాలి. తాము వాడ డం ఆపేసిన రియాక్టర్లనే రష్యా, అమెరికా తదితర అగ్రదేశాలు సహకారం పేరుతో భారత్ వంటి మూడో ప్రపంచదేశాలకు అంటగడుతున్నాయని గుర్తించాలి. కూడంకుళం, జైతాపూర్ సహా కొత్త ప్రాజెక్టులన్నింటిని రద్దు చేయాలి. పాతవాటిని దశలవారీగా ఉపసంహరించుకోవాలి. ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టిపెట్టాలి. నిపుణుల అంచనా ప్రకారం దేశంలో ఒక లక్షా 48వేల 700 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి సరిపడా జలవనరులున్నాయి. అంతే కెపాసిటీ కలిగిన థర్మల్ యూనిట్లను నెలకొల్పడానికి అవసరమైనంత బొగ్గు, సహజవాయువూ ఉంది. ఏడాది పొడుగునా సుమారు 300 రోజులు ఎండలు కాచే మన భూభాగంపై 500 కోట్ల మెగావాట్ల సౌర విద్యుత్‌ను, బలంగా వీచే గాలుల సాయంతో లక్షలాది మెగావాట్ల పవన విద్యుత్‌ను తయారుచేసుకోవచ్చునని నిపుణుల అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ వనరులపై ఆధారపడుతూ మానవాళికీ, జీవజాతులకూ, పర్యావరణానికీ చేటు చేయని విధానాలను మన పాలకులు అనుసరించాలి. జీవకోటికి హాని జరగని విధంగా విద్యుత్ ఉత్పత్తి విధానాలను పాటించేలా జీవవైవిధ్య సదస్సు జరుగుతున్న సందర్భాన నిలదీద్దాం.
– డి మార్కండేయ