ఆపరేషన్ కగార్‌ను అంచనా వేయడంలో జరిగిన ఘోర తప్పిదం మూలంగానే మావోయిస్టు పార్టీ.. చరిత్రలోనే కనీ వినీ ఎరుగని నష్టాలను చవిచూసిందా? ఆ పార్టీ కార్యదర్శి బసవరాజ్ సహా పలువురు సీసీ, ఎస్జెడ్సీ, డీవీసీ సభ్యులు, హిడ్మా సహా పీఎల్జీఏ బెటాలియన్, కంపెనీ, ప్లాటూన్ల కమాండర్లు, కీలక సభ్యులు చనిపోవడానికి పొలిట్‌బ్యూరో తీసుకున్న తప్పుడు నిర్ణయమే కారణమా? 2024 ఆగస్టులో విడుదల చేసిన సర్క్యులర్‌లో పార్టీ శ్రేణులకు, గెరిల్లా బలగాలకు సరైన వ్యూహం-ఎత్తుగడలను కనుక సూచించి ఉంటే ఇన్ని నష్టాలు జరిగేవి కావా? కగార్ దాడి తీవ్రతను పార్టీ, పీఎల్జీఏ నాయకత్వ కమిటీలు తక్కువ అంచనా వేయడం వల్లే నష్టాలు జరుగుతున్నాయని(2024 జనవరి నుంచి జులై కాలంలో) గుర్తించిన పొలిట్‌బ్యూరో.. కింది కమిటీలు చేసిన తప్పిదాన్నే తాను కూడా చేసిందా? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది.
కార్పెట్ క్యాంపింగ్ ఎత్తుగడలు..
ఆగస్టు సర్క్యులర్‌లో ఆపరేషన్ కగార్ గురించిన వివరాలను పొలిట్‌బ్యూరో సరిగ్గానే ఇచ్చింది. 2024 జనవరిలో ప్రారంభమైన ఈ యుద్ధచర్యలో శత్రువు ఇదివరకెన్నడూ లేని స్థాయిలో భారీ దాడికి పూనుకుంటున్నాడని వివరించింది. గతంలో కొనసాగిన ఆపరేషన్ గ్రీన్‌హంట్-1 అండ్ 2, ఆపరేషన్ సమాధాన్‌లకు ఈ కగార్ పూర్తి భిన్నంగా ఉన్నదని తెలిపింది. ఈసారి శత్రువు కార్పెట్ క్యాంపింగ్ పద్ధతిని అవలంభిస్తున్నాడని, 2019-2023 కాలంలో ఏర్పాటు చేసిన 199 పోలీసు క్యాంపులకు తోడుగా మరిన్ని క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాడని పేర్కొంది. 500 నుంచి 1000 వరకు సీఆర్పీఎఫ్ కోబ్రా, బీఎస్ఎఫ్ వగైరా బలగాలుండే ఈ క్యాంపులను ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్(ఎఫ్ఓబీ)లుగా పిలుస్తున్నారని, భవిష్యత్తులో వీటి సంఖ్య మరింత పెరగనున్నదని వివరించింది. గ్రీన్‌హంట్ కాలంలోనే 200 పోలీసు క్యాంపులను పెట్టారని, 2200 కమ్యూనికేషన్ టవర్లను నిర్మించారని తెలిపింది.
బస్తర్‌ను విముక్తి చేయడమే లక్ష్యం..
కగార్ యుద్ధం లక్ష్యం మావోయిస్టుల నుంచి బస్తర్ ప్రాంతాన్ని.. ప్రత్యేకించి అబూజ్మాడ్, దక్షిణ బస్తర్ గెరిల్లా బేస్‌లను 2025 చివరకల్లా విముక్తి చేయడంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్దేశించారని సర్క్యులర్‌లో ఆరోపించింది. జిల్లా, రాష్ట్ర, కేంద్ర బలగాలు, ఆర్మీ, ఎన్ఎస్జీ కమాండోలు, వాయుసేన కలిపి ఇప్పటికే బస్తర్‌లో సుమారు ఏడు లక్షల శత్రు బలగాలున్నాయని అలర్ట్ చేసింది. ఈ బలగాలు అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నాయని, శాటిలైట్స్, డ్రోన్స్, నైట్ విజన్ డివైసెస్‌ను విచ్ఛలవిడిగా వాడుతున్నాయని చెప్పింది.
5-10 కిమీ.లకు ఒక క్యాంపు..
కగార్ దాడి ప్రధానంగా చుట్టివేత దాడుల రూపంలో జరగనుందని పొలిట్‌బ్యూరో సరిగ్గానే అంచనా వేసింది. కార్పెట్ క్యాంపింగ్ అంటే ఉద్యమ ప్రాంతాలను చిన్న చిన్న క్లస్టర్లుగా విభజించి ప్రతి 5 నుంచి 10 కిమీ.లకు ఒక క్యాంపును ఏర్పాటు చేయడమని తెలిపింది. ఫలితంగా పీఎల్జీఏ బలగాల మొబిలిటీకి పరిమితులు ఏర్పడతాయని, బెటాలియన్, కంపెనీ స్థాయి పెద్ద ఫార్మేషన్లు తిరగడం కష్టమవుతుందని అర్థం చేయించింది. ఈ పరిస్థితుల్లో దాడులు చేస్తున్నప్పుడు తప్ప మిగతా అన్ని సమయాల్లో నాలుగేసి సభ్యులున్న రెండు టీంలతో కలిపి 8 మందితో ఏర్పడిన సెక్షన్ల సంఖ్యలోనే తిరగాలని, గెరిల్లా యుద్ధానికి అవసరమైన రహస్య పనివిధానాన్ని ఖచ్చితంగా పాటించాలని, ఆత్మరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది. పార్టీ, మిలిటరీ నిర్మాణాలకు సంబంధించి ఇంకా పలు నిర్ణయాలను తీసుకుంది. సంఖ్య లేని కొన్ని నిర్మాణాలను రద్దు చేసింది.
బ్లండర్ మిస్టేక్ ఇదే..
అయితే, కగార్ దాడిపై ఇన్ని వివరాలను, నిర్మాణాల్లో మార్పులు-చేర్పులను, వ్యూహం-ఎత్తుగడల విషయంలో జాగ్రత్తలను చెప్పిన పొలిట్‌బ్యూరో కీలకమైన నిర్ణయానికి సంబంధించి బ్లండర్ మిస్టేక్ చేసింది. 31 పేజీల(ఇంగ్లిష్) ఆ సర్య్కులర్లోని 25వ పేజీలో, ఇతర పేజీల్లో ఇలా చెప్పింది.
‘‘మన బలగాలను సాధ్యమైనంత వరకు రక్షించుకుంటూ.. శత్రుబలగాలను సాధ్యమైనంత ఎక్కువగా నిర్మూలించడమే యుద్ధ లక్ష్యంగా ఉండాల’’ని మావో చెప్పారు. మన ప్రధాన బలగాలను, ప్రధాన నాయకత్వాన్ని యుద్ధరంగం నుంచి దూరంగా తరలించడం.. పాక్షికంగా ఎక్కువ కాలం తరలించడం వ్యూహాత్మక తిరోగమనం(స్ట్రాటజికల్ రిట్రీట్) కిందికి వస్తుంది. ప్రధాన బలగాలు మినహా ఇతర ద్వితీయ, తృతీయ బలగాల్లో కొంత భాగాన్ని, పార్టీ నాయకత్వంలో కొంత భాగాన్ని యుద్ధరంగం నుంచి దూరంగా తరలించడం.. పాక్షికంగా తక్కువకాలం తరలించడం.. ఎత్తుగడల రీత్యా తిరోగమనం(టాక్టికల్ రిట్రీట్) కిందికి వస్తుంది.

ఈ యుద్ధ సిద్ధాంతాలను గమనంలో ఉంచుకుంటే ప్రస్తుతం(2024 ఆగస్టు) దండకారణ్యం గెరిల్లా జోన్లో మనం చేపట్టాల్సింది టాక్టికల్ రిట్రీట్. అనగా ప్రధాన బలగాలను ఇక్కడే ఉంచి, ఇతర బలగాలలో, పార్టీ నాయకత్వంలో కొంత భాగాన్ని కార్పెట్ సెక్యూరిటీ ఉన్న ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు తరలించాలి. ఇక్కడున్న ప్రధాన బలగాలు మారిన పరిస్థితుల్లో చిన్న ఫార్మేషన్లుగా తిరగాలి. దాడుల సమయంలో కలవడం, తర్వాత విడిపోవడం ప్రాతిపదికన అబూజ్మాడ్, దక్షిణ బస్తర్ బెటాలియన్లు పనిచేయాలి.’’
టాక్టికల్ రిట్రీట్ నిర్ణయం ఫలితమే..
పై నిర్ణయమే మావోయిస్టు పార్టీ, పీఎల్జీఏ బలగాల పాలిట అశనిపాతంలా పరిణమించిందని తదుపరి జరిగిన పరిణామాలను బట్టి చెప్పవచ్చు. ఈ సర్య్కులర్‌లో పొలిట్‌బ్యూరో చెప్పిన ప్రభుత్వ కగార్ యుద్ధవ్యూహాన్ని, ఎథ్తుగడలను మిలిటరీపరంగా విశ్లేషిస్తే అబూజ్మాడ్, దక్షిణ బస్తర్ ప్రాంతాల నుంచి పార్టీ చేయాల్సింది టాక్టికల్ రిట్రీట్ కాదు. నిజానికి స్ట్రాటజికల్ రిట్రీట్ చేయాలి. భారత మిలిటరీ, పారా మిలిటరీ బలగాల సంఖ్య, ఆయుధసంపత్తి, వనరులతో పోల్చితే, మావోయిస్టు బలగాలకు హస్తి మశకాంతరం వంటి తేడా ప్రస్ఫుటంగా కనపడుతుంది. కేవలం నారాయణపూర్, బీజాపూర్, సుక్మా జిల్లాల్లోని భూభాగంతో కూడిన పరిమిత ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన మెయిన్ ఫోర్స్ గా ఉన్న రెండు బెటాలియన్లు, సెకండరీ ఫోర్స్ గా ఉన్న మరికొన్ని కంపెనీలు, ప్లాటూన్లు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. శత్రువు ప్రతి 5 నుంచి 10 కిమీ.ల పరిధిలో 500-1000 మంది బలగాలతో కూడిన ఒక క్యాంపును కార్పెట్ సెక్యూరిటీలో భాగంగా ఏర్పాటు చేస్తున్నాడంటే, ఆ విషయాన్ని పొలిట్‌బ్యూరో సీరియస్‌గా తీసుకోవాల్సివుండింది.
పరిస్థితులపై లోపించిన అంచనా..
2024లోనే ఈ పరిస్థితి ఉందంటే సమీప భవిష్యత్తులో పోలీసులు మరిన్ని క్యాంపులు ఏర్పాటుచేసి గెరిల్లా ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టి, దాడులు కొనసాగిస్తాడనే అంచనాకు అది రావాల్సివుండింది. ఎందుకంటే కగార్ మొదలైనప్పటి నుంచి అనగా 2024 జనవరి నుంచి 2025 అక్టోబర్ 7వ తేదీ వరకు పాత 200 క్యాంపులకు తోడుగా కొత్తగా ప్రభుత్వం మరో 100 క్యాంపులను ఏర్పాటుచేసింది. అనగా మూడు జిల్లాల ప్రాంతంలో మొత్తం 300 క్యాంపులు ఉన్న పరిస్థితుల్లో గెరిల్లా బలగాలు మనగలగడం కష్టమని పొలిట్‌బ్యూరో గుర్తించాల్సివుండింది.

ఈ బ్లండర్ మిస్టేకే తదుపరి పోలీసు బలగాలు క్రమంగా గెరిల్లా ప్రాంతాలను చుట్టుముడుతూ, ఒక్కో గ్రామాన్ని తమ స్వాధీనంలోకి తీసుకుంటూ విజృంభించడానికి దారితీసింది. అలా మారుమూల అడవుల్లోకి, మావోయిస్టు షెల్టర్ జోన్లలోకి చొచ్చుకురావడం, చుట్టుముట్టడం, కార్డన్ సెర్చ్ చేసి మావోయిస్టు నాయకత్వాన్ని, బలగాలను, కేడర్లను నిర్మూలించడం జరిగింది. కార్యదర్శి బసవరాజ్ సహా పలువురు కేంద్ర కమిటీ సభ్యులు, ఇతర స్పెషల్ జోన్, డివిజన్, ఏరియా స్థాయి పార్టీ నేతలు, కేడరు, పీఎల్జీఏ కమాండర్లు, గెరిల్లాలు ఇలాంటి చుట్టివేత దాడుల్లోనే మరణించారు.
వ్యూహాత్మక తిరోగమనం చేసివుంటే..
టాక్టికల్ రిట్రీట్ బదులుగా స్ట్రాటజికల్ రిట్రీట్‌కు కనుక నిర్ణయం తీసుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. మెయిన్ ఫోర్స్ గా ఉన్న రెండు బెటాలియన్లను, వాటి నాయకత్వాన్ని, పార్టీ కార్యదర్శి బసవరాజ్ సహా పలువురు సీసీ సభ్యులను, ముఖ్యమైన డీకే ఎస్జెడ్సీ సభ్యులను బయటి ప్రాంతాలకు 2025 ప్రవేశించడానికి ముందే కనుక తరలించివుంటే ప్రస్తుత పరిస్థితి ఉత్పన్నమయ్యేదే కాదు. ప్రజల మనోనిబ్బరం నిలబెట్టడానికి, శత్రుబలగాలను చికాకుపర్చే చర్యలు చేపట్టడానికి పీఎల్జీఏకు చెందిన సెకండరీ ఫోర్స్, ప్రజా మిలీషియాకు చెందిన ప్లాటూన్లను, పార్టీ నిర్మాణ దళాలను(ఎల్ఓఎస్) మాత్రం ఉంచివుంటే అవి ప్రజల సహకారంతో రహస్యంగా సంచరించేవి. ప్రభుత్వ బలగాలకు వాటి ఆనుపానులు దొరకడం కష్టమయ్యేది.
అలా కాకుండా బెటాలియన్, కంపెనీ స్థాయి ఫార్మేషన్లను గెరిల్లా బేస్ ప్రాంతాల్లోనే ఉంచిన ఫలితంగా వాటి కదలికలను, క్యాంపుల ఉనికిని పోలీసులు డ్రోన్స్, శాటిలైట్స్ ద్వారా చాలా సులభంగా గుర్తించగలిగారు. ఆ సర్క్యులర్‌లోనే చెప్పినట్టు ప్రభుత్వ బలగాల కంట్రోలులోకి వచ్చిన గ్రామాల్లో ఏర్పరచుకున్న ఇన్ఫార్మర్ నెట్వర్క్ కూడా వారికి బాగానే ఉపయోగపడింది. వచ్చిన సమాచారాన్ని వినియోగించుకుని, టెర్రయిన్ పైన పట్టు ఉన్న స్థానిక ఆదివాసీలతో కూడిన డీఆర్జీ బలగాల సహకారంతో దాడులు చేసి తీవ్ర నష్టాలను కలిగించింది.
చైనాలో లాంగ్‌మార్చ్ ఎందుకు చేశారంటే..
చైనా మార్గమే మన మార్గమంటూ.. దీర్ఘకాలిక ప్రజా యుద్ధపంథాను అనుసరించిన మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో.. మావో చైనా విప్లవ యుద్ధంలో అనుసరించిన వ్యూహం-ఎత్తుగడలను అధ్యయనం చేయడంలో, ఆచరణకు ఆన్వయించడంలో ఘోరంగా విఫలమైనట్లు భావించాలి. 1934లో చాంగ్‌కైషేక్ ప్రభుత్వ బలగాలు చేపట్టిన ఐదవ చుట్టివేత-అణచివేత దాడుల సందర్భంగా చేపట్టిన లాంగ్‌మార్చ్ ను మనం మరచిపోకూడదు. శత్రువు చుట్టుముట్టిన జియాంగ్సీ విముక్తి ప్రాంతంలోనే ప్రధాన బలగాలు ఉంటే అవి నిర్మూలనకు గురయ్యే ప్రమాదం ఉందని గుర్తించిన చైనా కమ్యూనిస్టు పార్టీ 86వేల సంఖ్యలో ఉన్న ఎర్రసైన్యం చేత ఉత్తర రాష్ట్రాలకు తిరోగమింపజేసింది. ఏడాది పాటు కొనసాగిన ఈ లాంగ్‌మార్చ్ చివరకు 1935 అక్టోబర్‌లో యేనాన్ చేరింది. కేవలం 8వేల మంది సైనికులే మిగిలినా, ఆ బలగాన్ని మావో పాల నుంచి తీసిన వెన్నతో పాల్చాడు. ఆ చిన్న సైన్యమే తదనంతర కాలంలో ఇంతింతై వటుడింతై.. అన్న స్థాయిలో పెరిగి చివరకు చైనా విప్లవాన్ని విజయవంతం చేసింది.

దండకారణ్యంలో కూడా మావోయిస్టు పార్టీ పైవిధంగా వ్యూహాత్మక తిరోగమనం ఎత్తుగడలను చేపట్టి ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, జార్ఖండ్‌ల మీదుగా తిరోగమించివుంటే లేదా ప్రధాన బలగాలను, నాయకత్వాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలించివుంటే చరిత్ర ఇంకో రకంగా ఉండేదేమో.
-మార్కండేయ
