సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ ఈ వారం వార్తల్లో నిలిచింది. ఈ నెల 1న వెళ్లిన ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసారు. విభజన సమస్యలు, జలవివాదాలు, రాష్ట్రాభివృద్ధికి నిధులు సహా పలు అంశాలను ఆయన వారితో చర్చించారు. యాదాద్రి ఆలయ ప్రారంభానికి రావాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించారు. కాగా, కేసీఆర్-మోడీల భేటీ మరుసటి రోజే ఎన్నికల కమిషన్ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలకు చెందిన నాలుగు శాసనసభ స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూలును ప్రకటించింది. అందులో మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన హుజూరాబాద్ లేకపోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. హుజూరాబాద్ ఎన్నికను పండుగల తర్వాతే నిర్వహిస్తామని ఈసీ స్పష్టం చేయడం అనుమానాలకు తావిచ్చింది. ఎన్నిక ఎంత ఆలస్యమైతే అధికార టీఆర్ఎస్‌కు అంత లాభమంటున్న పరిస్థితిలో ఇది కేసీఆర్-మోడీల భేటీ ఫలితమేనన్న విషయంపై ప్రజానీకంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఆకస్మిక పరిణామం రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు ఈటలనూ హతాశులను చేసింది. కరోనా కారణంగా ఇప్పుడే ఉపఎన్నిక నిర్వహించడం తగదంటూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన నివేదికను ఈసీ ఏకపక్షంగా ఎందుకు ఆమోదించిందన్న ప్రశ్నలు సర్వత్రా ఉత్పన్నమయ్యాయి. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు అన్ని రకాల విద్యాసంస్థలను తెరిచే నిర్ణయానికి అడ్డురాని కరోనా ఎన్నికల నిర్వహణకు మాత్రం ఎలా అడ్డువస్తుందని ఎందుకు ఆలోచించలేదని పలువురు అడుగుతున్నారు. కేసీఆర్-మోడీల ఏకాంత భేటీలో ఏదో జరిగిందని, కేంద్రం మాకు.. రాష్ట్రం మీకు.. ఫార్ములాతో ఒప్పందం జరిగిందని అనుమానిస్తున్నారు.
కేసీఆర్-మోడీల మధ్య ఈ అనుమానాస్పద సంబంధాల చరిత్ర ఇప్పటిది కాదు. 2014లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కేసీఆర్ పలుమార్లు ఢిల్లీ వెళ్లారు. మోడీ, షా సహా పలువురు నేతలను కలిసివచ్చారు. అలా కలిసినప్పుడల్లా టీఆర్ఎస్‌కు ఏదో ఒక అనుకూల పరిణామం జరగడం ఆనవాయితీగా వస్తున్నది. కేసీఆర్ ప్రతిపాదనలకు, అభ్యర్థనలకు గ్రీన్‌సిగ్నల్ లభిస్తున్నది. తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రులు టీఆర్ఎస్ పాలనను, డబుల్ బెడ్రూం, మిషన్ భగీరథ వంటి పథకాలను మెచ్చుకుని వెళుతున్నారు. ఓ వైపు రాష్ట్ర బీజేపీ నేతలు కేసీఆర్ సర్కారు అవినీతిపై అస్త్రాలు ఎక్కుపెడుతుంటే ఢిల్లీ నేతలు ఇలా మాట్లాడడం చాలాసార్లు ఇబ్బందికరంగా పరిణమించింది కూడా. మరోవైపు, టీఆర్ఎస్ కూడా కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో పెట్టిన పలు కీలక బిల్లులకు ఆమోదముద్ర వేసింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బేషరతుగా మద్దతిచ్చింది. ఒక్కటంటే ఒకటే సందర్భంలో కేంద్రం నుంచి తెలంగాణకు అందిన నిధుల విషయంలో అమిత్ షాపై విరుచుకుపడడం తప్ప కేసీఆర్ కేంద్రంపై విమర్శల బాణం ఎక్కుపెట్టిందే లేదు. కేటీఆర్, ఇతర మంత్రులు అప్పుడప్పుడు ఏవో మాటల తూటాలు పేల్చడం మినహా మొదటి దఫా పాలన(2014-18)లో టీఆర్ఎస్ కమలనాథులపై నిజమైన యుద్ధం చేసిందే లేదు.
2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ల నిశ్చయించిన గులాబీ బాస్ అకస్మాత్తుగా రూటు మార్చారు. తాను ఢిల్లీ వెళతానని, జాతీయ రాజకీయాల్లో పాల్గొంటానని, జాతీయపార్టీల 70 ఏళ్ల అసమర్థ పాలనను రూపుమాపుతానని, తెలంగాణలో తెచ్చిన పథకాలను దేశవ్యాప్తంగా అమలుచేస్తానని, రైతురాజ్యం తెస్తానని ప్రకటించారు. బీజేపీని దుమ్మెత్తిపోశారు. బెంగాల్ మమతను, కర్ణాటక దేవేగౌడను, తమిళ స్టాలిన్‌ను కలిసారు. థర్డ్ ఫ్రంట్ పాలిటిక్స్ ను మొదలుపెట్టినట్లు కనిపించారు. అవసరమైతే కాంగ్రెస్‌తో కలిసి అధికారం పంచుకోవడానికి కలలు కన్నారు. ఆయన ఎత్తుగడల ఫలితమో లేక తెలంగాణ కాంగ్రెస్ స్వయంకృతాపరాధమో కాని ఈ ప్లాన్ బాగా వర్కవుట్ అయింది. ఆ ఏడు జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుంధుభి మోగించింది. బీజేపీ కాని, కాంగ్రెస్ కాని ప్రజల విశ్వాసం పొందడంలో ఘోరంగా విఫలమయ్యాయి. ఆ తర్వాత 2019 మేలో వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడు ఎంపీ స్థానాలను గెలుచుకున్నాయి.
ఇక్కడ మరో విషయం చెప్పాలి. ఢిల్లీకి వెళ్లి చక్రం తిప్పడమనే కేసీఆర్ ఎత్తుగడ ఆయన అధికార పగ్గాలు చేపట్టాకనే మొదలు కాలేదు. ప్రొఫెసర్ జయశంకర్ సార్‌తో కలిసి 2001లో టీఆర్ఎస్‌ను స్థాపించి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచీ పలు సందర్భాల్లో ఆయన లాబీయింగ్ ద్వారానే తెలంగాణ రాష్ట్ర సాధన కలను సాకారం చేయవచ్చునని చెప్పారు. అందుకోసం లెక్కలేనన్ని మార్లు దేశ రాజధానికి వెళ్లి రోజుల తరబడి మకాం చేసారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసి తన వాక్చాతుర్యంతో ప్రసన్నం చేసుకున్నారు. తెలంగాణపై యూపీఏ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత ఆ కమిటీ చైర్మన్ ప్రణబ్ ముఖర్జీని కూడా ఆకట్టుకున్నారు. కాంగ్రెస్‌లోనే తెలంగాణ డిమాండును బలపరిచే ఒక సెక్షన్‌ను తయారుచేసుకున్నారు. అంతేకాకుండా, బీజేపీ సహా పలు జాతీయపార్టీల నేతలను, లెక్కలేనన్ని చిన్నా పెద్ద ప్రాంతీయ పార్టీల నేతలను కలుసుకున్నారు. తమ పోరాటం న్యాయమైందని కన్విన్స్ చేసారు. 2009 డిసెంబర్ 9 చిదంబరం ప్రకటన నాటికి దేశవ్యాప్తంగా విస్తృత మద్దతును సంపాదించారు. ఢిల్లీ టూర్లు, కేసీఆర్ లాబీయింగే లేకపోతే ఇవేవీ సాధ్యమయ్యేవి కావు. కేవలం ప్రజా ఉద్యమం ద్వారానే తెలంగాణ రాలేదనే విషయాన్ని బహుశా రాష్ట్ర సాధన ప్రక్రియను దగ్గరి నుంచి చూసినవాళ్లు ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే.
ఏ వ్యక్తినైనా, ఎంత గొప్ప నేతనైనా, ఆ మాటకొస్తే ఎంత పెద్ద ప్రజా సమూహాన్నైనా తన మాటలతో మంత్రముగ్ధులను చేయడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. తన ఇంటికి ఆహ్వానించి, మంచి విందు భోజనం పెట్టి, తను స్వయంగా వడ్డిస్తూ అతిథులకు మర్యాద చేయడం ఆయన స్పెషాలిటీ. ఉద్యమకాలంలో నందినగర్‌లోని ఆయన నివాసం, ఇప్పుడు ప్రగతిభవన్ ఎప్పుడూ వందలాది మందితో కళకళలాడుతుంటుంది. భోజనశాలలో కూడా రుచికరమైన వంటకాలు సిద్ధంగా ఉంటాయి. ఒక్కసారి కేసీఆర్ పక్కన కూర్చుని భోజనం చేస్తే, ఇక ఎవరైనా ఇట్టే పడిపోవడం ఖాయమని చాలామంది చెబుతారు. కేసీఆర్‌లో ఉన్న ఈ విద్య ఉద్యమకాలంలో తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉపయోగపడగా, ఇప్పుడు ఆయన అధికార పీఠాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతోంది.
అయితే, కేసీఆర్‌ను మించిన వ్యూహచతురత, మాటకారితనం ఉన్నట్టుగా పేరున్న మోడీ, అమిత్ షాలు అంత ఈజీగా పడిపోతారని భావించలేం. వారి కారణాలు వారికుంటాయి. ఇప్పటికే రెండు దఫాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దక్షిణాదినే కాకుండా యూపీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రస్తుతం వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. 2024 సాధారణ ఎన్నికల్లో తిరిగి పగ్గాలు చేపట్టడం అంత సులువు కాదని వారికి అర్థమై ఉంటుంది. అందుకే, ఎన్డీయేకు బయట ఉన్న ప్రాంతీయ పార్టీలను తమ ప్రభావంలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్‌తో పాటు స్టాలిన్, ఉద్ధవ్ ఠాకరే, శరద్ పవార్ తదితరులకు కూడా గాలం వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలోనో, మరో రాష్ట్రంలోనో అధికారంలోకి రావడం వాళ్ల ఫస్ట్ ప్రయారిటీ కాదు. ఢిల్లీ గద్దెను కాపాడుకోవడం పైననే వాళ్ల కేంద్రీకరణ అంతా ఉంది. అందుకే హుజూరాబాద్‌లో కమలం గుర్తుపై పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ గెలుపు కంటే కేసీఆర్‌తో స్నేహ సంబంధాలే వాళ్లకు ముఖ్యమయ్యాయన్నది స్పష్టం.
కేసీఆర్ ఢిల్లీ వ్యూహాల మూలంగా నష్టపోయేది రాష్ట్ర బీజేపీ అయితే.. లాభపడేది మాత్రం తెలంగాణ కాంగ్రెస్. రేవంత్‌రెడ్డి నేతృత్వం కారణంగా ఇప్పటికే నిర్వీర్యత నుంచి బయటపడిన ఆ పార్టీ వచ్చే రోజుల్లో బాగా పుంజుకునే అవకాశముంది. కేసీఆర్-మోడీ భాయీ.. భాయీ.. అంటూ రేవంత్ ప్రజల్లో రెచ్చిపోయే ప్రసంగాలు చేస్తారు. బీజేపీకి ఓటేస్తే కేసీఆర్‌కు ఓటేసినట్లేనని, గెలిచిన తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్ చంకనెక్కుతారని ప్రచారం చేస్తారు. ఆ పరిస్థితుల్లో కమలనాథులు ఆత్మరక్షణలో పడకతప్పదు. కేసీఆర్‌ను జైలుకు పంపిస్తాం.. అవినీతి పాలనను అంతం చేస్తాం.. అంటూ ఆ పార్టీ నేతలు ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎంత ఆవేశంతో ప్రసంగాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి బీజేపీ అధిష్టానం ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది? రాష్ట్ర నేతలు ఎలాంటి ఎత్తుగడలు అనుసరిస్తారు? భవిష్యత్తులో ఏం జరగనుంది? వంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పగలదు.
– డి మార్కండేయ
(దిశ సౌజన్యంతో..)