కూడంకుళం.. ఈ పేరు ఇటీవల తరచూ వార్తల్లోకెక్కుతోంది. రష్యా సహకారం తో ₹ 17 వేల కోట్లతో తమిళనాడు కోస్తా తీరంలో ఉన్న ఈ గ్రామంలో చేపట్టిన అణువిద్యుత్ కేంద్రం వివాదాస్పదమైంది. అభివృద్ధి పేరిట తమ ఇళ్లను, జాగలను, బతుకుదెరువును మింగేయడమే కాకుండా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని, నీటిని, ఆహారాన్ని సైతం అందకుండాచేసే అణుకేంద్రం వద్దేవద్దని స్థానికులు అంటున్నారు. చెర్నోబిల్, ఫుకుషిమా దుర్ఘటనలు సంభవించి రేడియేషన్ ప్రభావంతో క్యాన్సర్ తదితర వ్యాధులు సోకి వేలాది మంది ప్రాణాలు కోల్పోయినా పాలకులు పట్టించుకోకపోవడం అన్యాయమని వాపోతున్నారు.
సామ్రాజ్యవాదుల అండతో, బహుళజాతి కంపెనీల లాభాలే లక్ష్యంగా కొనసాగే అభివృద్ధి ప్రాజెక్టులను వ్యతిరేకించాలని, మూలవాసుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చే ‘స్వదేశీ’ విధానాలను అనుసరించాలని నినదిస్తున్నారు. అణుకేంవూదాన్ని ఎత్తేయాలని 24 ఏళ్లుగా శాంతియుత పద్ధతుల్లో పోరాడుతున్నారు. 2011 అక్టోబర్ 1న ఉద్యమకారులు చేపట్టిన సామూహిక దీక్షలు నేటికి 14వ రోజుకు చేరుకున్నాయి. స్థానికుల ఆకాంక్షలను, ఆవేదనను పట్టించుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమంపై విషవూపచారం చేయడం ద్వారా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
విదేశీ హస్తం ఉన్నదా?
కూడంకుళం ఉద్యమం వెనకాల కొన్ని విదేశీ శక్తుల హస్తం ఉన్నదని స్వయానా ప్రధాని ప్రకటించడం ఇందుకు ఉదహరణగా చెప్పవచ్చు. ప్రధాని ఆరోపణలను రష్యా సమర్థించింది. భారత-రష్యాల వ్యూహాత్మక మైత్రిని, అణు ఇంధన రంగంలో పరస్పర సహకారాన్ని ఇష్టపడని కొందరు కూడంకుళం కుట్రకు తెగబడ్డారని ఆ దేశ రాయబారి కడాకిన్ ఆరోపించారు. ‘కూడంకుళం’ వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహిస్తున్న సంస్థలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆరా తీయాలని కేంద్ర హోంశాఖ అధికారులను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో అసలు కూడంకుళంలో ఏం జరుగుతోందన్న చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. తిరునల్వేలి జిల్లా కూడంకుళం గ్రామ పరిధిలో అణు విద్యుత్ కేంద్రం నెలకొల్పాలన్న ప్రతిపాదన మొట్టమొదటగా 19లో వచ్చింది. రెండు అణు రియాక్టర్ల సహాయంతో రెండు వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే ఒప్పందాన్ని అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ, సోవియట్ యూనియన్ అధ్యక్షుడు గోర్బచేవ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం సోవియట్ యూనియన్ నీటితో చల్లబరిచే రెండు వీవీఈఆర్-1000 రకం రియాక్టర్లను సరఫరా చేస్తుంది.
2700 ఎకరాల భూసేకరణ..
కూడంకుళంతో పాటు ఇదింతకరాయ్ గ్రామ పరిసరాల్లో సుమారు 27వందల ఎకరాల భూమిని స్థానికుల నుంచి సేకరించి అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. రియాక్టర్లను చల్లబరచడానికి అవసరమైన నీటిని సమీపంలోనే ఉన్న పెచ్చిపరాయ్ డ్యాం నుంచి తరలిస్తారు. ప్లాంట్ నిర్మాణం మొదలుకొని పనిచేయించడం వరకు సోవియట్ కంపెనీలు చూసుకుంటాయి. అదే సంవత్సరం నిర్మాణపనులు మొదలయ్యాయి.
భారీ పునరావాస ప్యాకేజీ, ఉద్యోగాలు, ప్రాంత అభివృద్ధిని ఎరగా చూపిన న్యూక్లియార్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌పీసీ) అధికారులు ఎలాంటి ప్రజాభివూపాయ సేకరణ లేకుండానే స్థానికుల నుంచి భూసేకరణ చేశారు. తమిళనాడు ప్రభుత్వ పీడబ్ల్యూడీ విభాగం ఓ జీఓను జారీ చేసింది. అణుకేంవూదానికి 16 కి.మీ. పరిధిలో పది వేలకు మించిన జనాభా ఉండరాదని, 20 కి.మీ. పరిధిలో నివసించే పౌరులందరికీ ఉచిత జీవిత బీమా కల్పించాలని ఇందులో పేర్కొన్నారు.
1991లో నిర్మాణం నిలిపివేత..
1991లో అటు సోవియట్ యూనియన్ కుప్పకూలిపోవ డం, ఇటు టైగర్ల చేతిలో రాజీవ్ హత్యకు గురికావడం నేపథ్యంలో కూడంకుళం ప్లాంట్ నిర్మాణాన్ని నిలిపివేస్తున్నట్లు ఎన్‌పీసీ ప్రకటించింది. తిరిగి 1997లో దేవేగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో ఫైళ్లు మళ్లీ కదిలాయి. తీవ్ర సంక్షోభం నుంచి కోలుకుని పునరుజ్జీవం దిశగా సాగుతున్న రష్యా కూడంకుళం ప్లాంట్‌కు పావులు కదిపింది. భారీగా నిధులు సమకూర్చుకునేందుకు యుద్ధ విమానాలు, ట్యాంకులు తదితర సైనిక సామక్షిగిని కట్టబెట్టడంతో పాటు అణుకేంవూదాన్ని నిర్మించి ఇవ్వడానికి ప్రతిపాదించింది.
ఆ దేశాధ్యక్షుడు యెల్ట్సిన్‌తో ఒప్పందంపై సంతకాలు పూర్తి కాగానే పనులు వేగవంతమయ్యాయి. ఓడరేవు, రోడ్ల నిర్మాణం, సామగ్రి దిగుమతి కొనసాగింది. ముందనుకున్న రెండింటికి అదనంగా మరో నాలుగు రియాక్టర్లను జోడించి ప్లాంట్‌లో మొత్తం 9200 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని 200లో ఇరుదేశాలు నిర్ణయించాయి.
టెస్ట్ రన్ భయానకం..
2011 జులై ఒకటికల్లా మొదటి దశ నిర్మాణం పూర్తి కాగా, రియాక్టర్ ‘టెస్ట్ రన్’ను అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాంట్ నుంచి దట్టమైన పొగ, భారీ శబ్దాలు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. పైగా, ప్రజలు తమ ముక్కులకు, నోళ్లకు మాస్క్‌లు తగిలించుకోవాలని, అనుకోనిది ఏదైనా జరిగితే దూరంగా పారిపోవాలని అధికారులు మైకుల్లో హెచ్చరించడం వారిని కలవరపరిచింది. సాఫీగా సాగిపోతున్న తమ జీవితాలకు అణుకేంద్రం ముప్పుగా పరిణమించిందన్న సత్యాన్ని గ్రహించి వీధుల్లోకి వచ్చారు.
నిజానికి కూడంకుళం ప్రజలు 19లో ఒప్పందం జరిగినప్పటి నుంచే ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. అప్పటికి చెర్నోబిల్ అణువూపమాదం జరిగి రెండేళ్లే అయి నా రేడియేషన్ మానవాళికి చేయగల కీడును వాళ్లు గ్రహించలేకపోయారు. ప్లాంట్‌కు అవసరమైన నీటిని తమ పొలాలకు జలాలనందిస్తున్న పెచ్చిపరాయ్ డ్యాం నుంచి తరలించడాన్ని రైతులు తీవ్రంగా నిరసించారు. పరిక్షిశమ నుంచి వెలువడే అణువ్యర్థ పదార్థాలు సమువూదంలో కలిస్తే చేపలు నాశనమవుతాయని తెలిసిన మత్స్యకారులు వీరికి మద్దతు తెలిపారు.
సమతువ సముదాయ ఇయాక్కం(సామాజిక సమానత ఉద్యమం) నేతృత్వంలో తిరునల్వేలిలో భారీ ర్యాలీ నిర్వహించారు. కొన్ని అభ్యుదయ యువజన సంఘాలు చెన్నై నుంచి తిరునల్వేలికి సైకిల్ యాత్ర నిర్వహించాయి.
నిరసన తీవ్రరూపం..
ప్లాంట్ నిర్మాణాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో 1991లో ఈ పోరాటానికి బ్రేక్ పడింది. రైతుల నుంచి ఎదురైన నిరసనను తగ్గించేందుకు 1997లో పనులను తిరిగి ప్రారంభించినప్పుడు ప్లాంట్‌కు అవసరమైన నీటిని పెచ్చిపరాయ్ నుంచి తరలించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రంలోనే వాటర్ రీసైక్లింగ్, డీసాలినేషన్ ఏర్పాటుకు ప్రతిపాదించింది.
అయినప్పటికీ స్థానికుల నిరసన తప్పలేదు. వామపక్ష మేధావులు, అణుశక్తిని ఇంధనంగా వాడుకోవడాన్ని వ్యతిరేకించే వివిధ సంస్థలు కల్పించిన అవగాహనతో ప్రజలు ఉద్యమించారు. నిరాహారదీక్షలు, ధర్నాలు, ర్యాలీలు, సభలు నిర్వహించి తమ నిరసనను తెలిపారు. 200లో రియాక్టర్ల సంఖ్యను ఆరుకు పెంచడంతో ఈ నిరసన మరింత తీవ్రరూపం దాల్చింది.
ఆమరణ దీక్ష..
మత్స్యకారులే కాకుండా రైతులు, మధ్యతరగతి వర్గాలు, ప్లాంట్‌లో ఉద్యోగాలు, పనులు, కాంట్రాక్టులు పొందినవాళ్లు సైతం రేడియేషన్ మూలంగా పొంచివున్న ముప్పును గుర్తించి ఉద్యమంలో చేరారు. ఈ నేపథ్యంలో అణుశక్తి వ్యతిరేక ప్రజా ఉద్యమం (పీపుల్స్ మూవ్‌మెంట్ అగేనెస్ట్ న్యూక్లియార్ ఎనర్జీ-పీఎంఏఎన్‌ఈ) పురుడు పోసుకుంది. కూడంకుళం అణు కేంద్రానికి వ్యతిరేకంగా కలిసివచ్చే వారి ని, పార్టీలను సమీకరించి పోరాటాన్ని ఉధృతం చేసింది.
మొదటి రియాక్టర్ టెస్ట్ రన్ రోజు నుంచి పీఎంఏఎన్‌ఈ నేతృత్వంలో నిరసన కార్యక్షికమాలు క్రమం తప్పకుండా కొనసాగుతున్నాయి. మార్చ్ 11న జపాన్‌లోని ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగి ఘటనాస్థలంలోనే పలువురు చనిపోగా క్యాన్సర్‌కు వందలాది మంది బలవుతున్నారన్న వార్తలు ఉద్యమ బలాన్ని మరిం త పెంచాయి. ఆగస్టు నెలంతా రిలే దీక్షలు చేసిన నిరసనకారులు సెప్టెంబర్ 11న ఆమరణ దీక్షకు దిగారు.
రాష్ట్ర ప్రభుత్వ మద్దతు..
దీక్షలకు మద్దతుగా మహిళలు రహదారులను దిగ్బంధించారు. పది రోజుల తర్వాత స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఉద్యమ నేతలను చర్చలకు పిలిచారు. ప్రజల్లో నెలకొ న్న భయాలను తొలగించేవరకు కూడంకుళం పనులను ఆపాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ కేబినెట్‌లో తీర్మానించా రు. ప్రధానితో జరిగిన చర్చలు విఫలం కావడంతో అక్టోబ ర్ 13-16 వరకు వేలాదిమంది ప్లాంట్‌ను దిగ్బంధించా రు. 1 నుంచి నేటి వరకు రిలే దీక్షలను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.
కూడంకుళం ఉద్యమం వెనకాల ఎలాం టి విదేశీ శక్తులు లేవని పీఎంఏఎన్‌ఈ నేత లు స్పష్టం చేస్తున్నారు. స్థానికులు, మేధావులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలతో తాము ఉద్యమం నడుపుతున్నామని సంస్థ కోఆర్డినేటర్ ఉదయ్ కుమార్ తెలిపారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని, ప్రధానిపై తాము త్వరలో పరువు నష్టం దావా వేస్తామని ప్రకటించారు. ప్రజల మనోభావాలు అర్థం చేసుకోకుండా, వారిపై రాజవూదోహం కేసులు పెట్టడం అన్యాయమన్నారు. కూడంకుళం ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు ప్రకటించే వరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ముప్పును గుర్తించాలి..
ప్రజా సమస్యలపై పోరాడేవారిని నిందలపాలు జేయడం, విదేశీ శక్తుల కుట్రగా ఆరోపించడం, ఉగ్రవాద ముద్ర వేసి సైనికంగా అణచివేయడం భారత పాలకులకు కొత్త కాదు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ పేరిట దేశ ప్రయోజనాలను సామ్రాజ్యవాదులకు, బహుళజాతి కంపెనీలకు తాకట్టు పెట్టడమన్నది మన్మోహన్‌సింగ్‌కు వెన్నతో పెట్టిన విద్య. అణుశక్తి ద్వారానే దేశానికి ఇంధన భద్రత చేకూరుతుందని తరచూ చెప్పే ప్రధాని దేశంలో నివసిస్తున్న కోట్లాది మందికి ఆహార, ఆరోగ్య, నీటి, ఉద్యోగ, జీవన భద్రతలు లేవన్న సంగతిని గుర్తించాలి.
ప్రమాదం లేని విద్యుత్తును, రోగాలు లేని జీవితాలను, కలుషితం కాని పరిసరాలను, అందరికీ భాగస్వామ్యం కల్పించే అభివృద్ధిని డిమాండు చేస్తున్న కూడంకుళం వాసుల మొర ఆలకించాలి. తక్షణం కూడంకుళం అణువిద్యుత్ కేంద్రాన్ని ఆపేసి ప్రత్యామ్నాయ వనరులపై దృష్టిని కేంద్రీకరించాలి. మిగతా ప్రపంచ దేశాల్లాగే పవన, సౌర, జల, గ్యాస్ ఆధారిత విద్యుత్ పరిక్షిశమలను ప్రోత్సహించాలి.
-డి. మార్కండేయ