ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ రాజకీయంగా, సైనికంగా పొందిన ఓటమి గురించి సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు, విశ్లేషణలు, సిద్ధాంతీకరణలు కొనసాగుతున్నాయి. ఈ దెబ్బతో భారతదేశంలో ఐదు దశాబ్దాలుగా నడుస్తున్న మావోయిస్టు ఉద్యమాల చరిత్ర ఇక అంతమైనట్లేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. సమీప భవిష్యత్తులో విప్లవోద్యమాలను ఆశించడం ఎండమావి లాంటిదేనంటున్నారు. ఒకప్పుడు మనిషి జీవితం సమాజం చుట్టూతా తిరిగితే ఇప్పటి తరం తన చుట్టూ తానే అల్లుకుని బతుకుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. తను బాగుంటే చాలని, చుట్టుపక్కల మనుషులు ఏమైనా పరవాలేదనే భ్రమల్లో ఉంటున్నారని వివరిస్తున్నారు. సమాజాన్నే కాదు.. ఊరినీ, ఇరుగుపొరుగును, చివరకు సొంత కుటుంబ సభ్యులనూ వదలి నరనరాన స్వార్థంతో బతుకుతున్నారు. కష్టంలేని సుఖమయ జీవనాన్ని కోరుకుంటున్నారంటున్నారు.
సాయుధ మావోయిస్టులు అంతమయ్యారేమో కాని మార్క్సిజం-లెనినిజం-మావోయిజం సిద్ధాంతాన్ని అంతం చేయడం అమిత్ షా కాదు కదా.. మరెవరి తరమూ కాదని మరికొందరు వాదిస్తున్నారు. దేశంలో పేదరికం, దోపిడి, అసమ అభివృద్ధి ఉన్నంత వరకూ ప్రజలు ఏదో ఒక రూపంలో, ఎక్కడో ఒకచోట మావోయిస్టు రాజకీయాల స్ఫూర్తితో పోరాడుతూనే ఉంటారని విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు సీపీఐ(ఎంఎల్), తర్వాత సీపీఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్, ఎంసీసీ, ఇటీవలి కాలంలో సీపీఐ (మావోయిస్టు) ఇలా పుట్టి పెరిగినవేనని వివరిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఏదో ఒక పేరుతో పార్టీయో, వేదికో, ఫోరమో.. ఏర్పడి పోరాడతాయన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ పొందిన రాజకీయ, సైనిక ఓటమికి కారణాల విశ్లేషణకు పూనుకోవడం కత్తి మీద సాము లాంటిదని తెలిసినా, 17 ఏళ్లు మావోయిస్టు ఉద్యమంలో, గత 24 ఏళ్లుగా జర్నలిజంలో పనిచేసిన వ్యక్తిగా ఆ పని చేయడం ఈనాడు ఎంతో అవసరంగా భావిస్తున్నాను. ఈ విశ్లేషణ కొందరిని నొప్పించినా, కోపం తెప్పించినా.. మరికొందరిని సంతోషపర్చినా.. నా వ్యక్తిగత అభిప్రాయాలను స్వీకరిస్తారనే నమ్మకంతో రాశాను. గతంలో కూడా ఇలాంటి అంశాలపై నమస్తే తెలంగాణలో ‘‘స్వార్థం.. ఉద్యమాలపై అస్త్రం’’ వంటి వ్యాసాలు, దిశలో ‘‘వారి త్యాగాలను గుర్తిద్దాం’’ వంటి సంపాదకీయ వ్యాసాల్లో కొన్ని విషయాలను నేను క్లుప్తంగా తడిమిన సందర్భాలున్నాయి. సామ్రాజ్యవాదం-ప్రపంచీకరణ, విప్లవం-రాజ్యనిర్బంధం, పేదరికం-ప్రభుత్వాల అసమర్థత వంటి అంశాల్లో నేను రాసిన వ్యాసాలు ‘‘మరోకోణం’’ పుస్తకంలో మీరు చదవవచ్చు.
ఇక విషయానికి వస్తే, మొదటి భాగంలో నేను మావోయిస్టు పార్టీ రాజకీయ ఓటమిని మాత్రమే విశ్లేషిస్తాను.
1. మన దేశంలో 1990లలో మొదలైన ప్రపంచీకరణ-ప్రైవేటీకరణ-సరళీకరణ విధానాలు ఇక్కడి సమాజంలో కాలక్రమేణా కలిగిస్తున్న ప్రభావాన్ని మావోయిస్టు పార్టీ ఎప్పటికప్పుడు అధ్యయనం చేయకుండా విధానాలను వ్యతిరేకించడం.. చదివినా, అర్థం చేసుకున్నా తనదైన చట్రంలోనే ఉండి నిర్ధిష్ట ఆచరణను రూపొందించలేదు. నగరాల్లో, పట్టణాల్లో ఈ ప్రభావం మొదట మొదలైంది. 1990లలోనే అక్కడ పార్టీ దెబ్బతిన్నది. అసలు కారణాన్ని గుర్తించకుండా శత్రువు బలంగా ఉండడం వల్లే నష్టాలు జరిగాయని సమీక్షించి పట్టణాల కేడర్లను మైదానాలకు, అడవులకు తరలించింది.
2. 2000 తర్వాత మైదానప్రాంతాలకూ ఈ మార్పులు విస్తరించాయి. ఇక్కడా పార్టీ దెబ్బతిన్నది. మళ్లీ శత్రువు కేంద్రీకరణ, టెక్నికల్-స్వీయాత్మక తప్పులను కారణాలుగా సమీక్షించింది. చనిపోగా మిగిలిన దళాలను ఆదివాసీ ప్రాంతాలకు, టెర్రయిన్ అనుకూలంగా ఉన్న ప్రాంతాలకు (దంకారణ్యం, మహారాష్ట్ర, ఏఓబీ, బాలాఘాట్ తదితర) తరలించింది.
3. 2015 నుంచి ఆదివాసీ ప్రాంతాల్లోనూ ఈ మార్పులు రావడం ఆరంభమైంది. ఇక్కడ కూడా నష్టాలు మొదలయ్యాయి. అయినా భారత సమాజంలో వచ్చిన మార్పులను గుర్తించకుండా, లోతైన అధ్యయనం చేయకుండా స్వీయాత్మకతతో పై పై సమీక్షలతో, నిర్ణయాలతో సరిపెట్టుకుంది. 2011లోనే డీకేలో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయని అక్కడి ప్లీనరీ తీర్మానించినా కారణాలను లోతుగా అన్వేషించలేకపోయింది. తప్పులను గుర్తించలేకపోయింది. 2018-20 కాలం నాటికి అక్కడ లీడర్ల, కేడర్ల మరణాలు, లొంగుబాట్లు తీవ్రమవడాన్ని సీరియస్‌గా పరిగణించలేకపోయింది. 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ దాడి మొదలై క్లైమాక్స్‌కు చేరుకున్న పరిస్థితుల్లో ఆదివాసీ, టెర్రయిన్ అనుకూల ప్రాంతాల నుంచి పార్టీని, సైన్యాన్ని తరలించడానికి దేశంలో ప్రభావిత ప్రాంతాల్లో అంతటా దారులు మూసుకున్నాయి.
4. 2010లో డీకేలో నెల రోజుల పాటు పర్యటించిన ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్.. ఆ తర్వాత దంతేవాడ ఎస్పీ రాహుల్‌సింగ్‌ను ఇంటర్వ్యూ చేశారు. అందులో ఆ ఎస్పీ స్పష్టంగా ఒక విషయం చెప్పాడు. ‘‘బస్తర్ లో వేళ్లూనుకున్న ఈ విప్లవోద్యమాన్ని ఎన్ని లక్షల బలగాలను దించినా నిర్మూలించడం సాధ్యం కాదు. ఎప్పుడైతే ప్రతి ఆదివాసీ గుడిసెలో కలర్ టీవీ వస్తుందో అప్పుడు నక్సలిజం దానంతటకదే మాయమవుతుంది.’’ ఈ విషయాన్ని ఆమె అప్పుడే రాసింది.
5. మార్క్సిస్టు ఫిలాసఫీలో పునాది-ఉపరితలం అనే ప్రస్తావన ఉంటుంది. ఒక సమాజంలోని ఆర్థిక వ్యవస్థకు అక్కడి ప్రజల సంస్కృతి, రాజకీయాలు, సంప్రదాయాలకు మధ్య విడదీయలేని సంబంధం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ మారితేనే ఉపరితలం మారుతుందని, అయితే కొన్నిసార్లు ఉపరితలం కూడా పునాది మార్పునకు కారణమవుతుందని కూడా చెబుతుంది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే ప్రపంచీకరణ అనే ప్రక్రియ భారత సమాజంలో పునాదిని ఎంత మార్చిందో చర్చోపచర్చలు జరుగుతున్నాయి కాని ఉపరితలం ఎంతగా ప్రభావితమయ్యిందో మావోయిస్టు పార్టీ సహా ఏ కమ్యూనిస్టు పార్టీ సరిగ్గా గుర్తించడంలేదు.
6. పునాది మార్పులు, ఉపరితల మార్పులు రావడం వెనుక కారణాలను మావోయిస్టు పార్టీ గుర్తించలేదు. మూలమూలలా చొచ్చుకు వచ్చిన మార్కెట్, వినిమయ సంస్కృతి ఇక్కడి ప్రజల జీవన విధానాన్ని, అలవాట్లను ఎంతగా మార్చిందంటే వాటితో ఇక్కడి ఆర్థిక వ్యవస్థ కూడా పెట్టుబడిదారీ విధానంలోకి వచ్చింది. మార్క్స్-లెనిన్-మావోలు చెప్పినట్టు అచ్చంగా రాకపోవచ్చు. కాని వంకరటింకరగానో, అసహజంగానో మొత్తానికి వచ్చింది.
7. చారుమజుందార్ వర్గశత్రు నిర్మూలన సిద్ధాంతాన్ని విభేదించి, 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలోని నక్సలైట్ గ్రూపు ‘‘సాయుధ పోరాట తాత్కాలిక విరమణ’’ చేసి ప్రజాసంఘాలు నిర్మించడం ప్రారంభించింది. ఫలితంగా 1983కల్లా విద్యార్థుల్లో ఆర్ఎస్యూ (రాడికల్ స్టూడెంట్స్ యూనియన్), యువజనుల్లో ఆర్‌వైఎల్ (రాడికల్ యూత్ లీగ్), రైతుకూలీల్లో ఆర్సీఎస్ (రైతుకూలీ సంఘం) బలంగా తయారయ్యాయి. అయితే, పార్టీలో పాత చారుమజుందార్ వాసనలు పోలేదు. పైగా అతివాద వాదనలు దినదినం చెదలులా తినసాగాయి. ఫలితంగా ప్రజాసంఘాల్లో పార్టీ నిర్మాణాన్ని పెంపొందించే బదులు, వారిని అండర్ గ్రౌండుకు పంపి దళాల నిర్మాణానికి సులువైన ఏకైక మార్గాన్ని ఎంచుకుంది. ఒక పోరాటం చేస్తున్నామంటే అందులో నుంచి దళాలకు ఎంత మంది రిక్రూటు అవుతారన్నదే కొలమానంగా మారింది. రహస్య పార్టీకి నిర్వచనం మారింది.
8. పార్టీలో నిర్మాణ, మిలిటరీ కర్తవ్యాల విషయంలో గందరగోళం మొదటి నుంచీ ఉన్నది. 1980లలో 1+2 సిస్టమ్ నుంచే ఇది ప్రారంభమైంది. అప్పటి ఒక సర్క్యులర్‌లోనే ‘‘సీఓ (సెంట్రల్ ఆర్గనైజర్) పార్టీ నిర్మాణమైతే, ఇద్దరు దళ సభ్యులు మిలిటరీ నిర్మాణమని’’ రాశారు. ఆ తర్వాత మినీ దళాలు, పెద్ద దళాలు ఏర్పడినా సారాంశంలో ఇలాగే పనిచేశాయి. 1995లో సీఓసీ (సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ) కొత్తగా ఎల్జీఎస్ (లోకల్ గెరిల్లా స్క్వాడ్), సీజీఎస్ (సెంట్రల్ గెరిల్లా స్క్వాడ్, ఎస్జీఎస్ (స్పెషల్ గెరిల్లా స్క్వాడ్) తెచ్చినా, 2000 తర్వాత పీఎల్జీఏ(పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) ఏర్పడి లోకల్‌గా ఎల్ఓఎస్ (లోకల్ఆర్గనైజేషనల్ స్క్వాడ్)లు ఏర్పడినా ఇదే గందరగోళం కొనసాగింది.
9. పార్టీ కేంద్ర నాయకత్వం ముఖ్యంగా సీసీ (కేంద్ర కమిటీ), పీబీ (పొలిట్ బ్యూరో) అధ్యయనం కంటే ఆచరణ పైనే ఎక్కువ కేంద్రీకరించాయి. మొత్తం సీసీ కాని, కార్యదర్శి సహా ఏ ఒక్క కీలక కామ్రేడ్ కాని దేశ కాల పరిస్థితులకు తగిన విధంగా కొత్త ఆలోచనా విధానాన్ని రూపొందించే పని చేయలేకపోయారు. ఆచరణ వెంటే పరుగెత్తి వెళ్లారు. తద్విరుద్ధంగా రష్యా విప్లవంలో లెనిన్, చైనా విప్లవంలో మావో మొత్తంగా సిద్ధాంత అధ్యయనం పైనే కేంద్రీకరించారు. లెనిన్ విదేశాల్లో ఉన్నా, మావో యేనాన్ వంటి విముక్తి ప్రాంతాల్లో ఉన్నా వారికి ఆచరణను సిద్ధాంతంతో, సిద్ధాంతాన్ని దేశ కాల పరిస్థితులతో మేళవించే తీరిక దొరికింది. మావోయిస్టు పార్టీ సీసీలోని ఏ ఒక్కరూ ఇలాంటి కర్తవ్యాన్ని నిర్వహించలేదు. మరోవైపు, బయటి నగరాల్లో, పట్టణాల్లో ఉన్న సీసీ కేంద్రాలు ఎత్తేసుకుని అబూజ్‌మాడ్‌కు మార్చడం ఒక వ్యూహాత్మక తప్పిదం. బయటుంటే శత్రువుకు పట్టబడతారు.. అడవి లోపల అయితే సేఫ్.. అనే అవగాహన తప్పు.
10. మావోయిస్టు పార్టీలో మొదటినుంచీ సిద్ధాంతం ఎక్కువగా చదివే వాళ్లంటే చిన్నచూపు ఉన్నది. ఎన్ని పుస్తకాలు చదివామన్నది కాదు.. ఎన్ని పోరాటాలు తెచ్చామన్నదే కీలకంగా మారింది. మేధావుల నుంచి వచ్చిన వారికి తుపాకులు ఇచ్చి యాక్షన్ చేయమనడం, ఆదివాసీ, రైతాంగ వర్గాల నుంచి వచ్చిన కేడర్లను 2000లో పీఎల్జీఏ ఏర్పడేవరకూ సిద్ధాంతం తెలువదనే కారణంతో పార్టీ పదవులు ఇవ్వకపోవడం, వారు రాజకీయంగా ఎదగడానికి అవసరమైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోకపోవడం కొనసాగింది.
11. డీకే ముఖ్యంగా మాడ్, దక్షిణ బస్తర్ ప్రాంతాలు 2007 నుంచి 2024లో ఆపరేషన్ కగార్ మొదలయ్యే వరకూ కూడా పార్టీ కంట్రోలులో ఉండడం అనేది పార్టీ నాయకత్వం ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి గల అనుకూల పరిస్థితిని దూరం చేసింది. బయట మారుతున్న సామాజిక సంబంధాలనూ, ప్రజల నుంచి పార్టీ దూరమవుతున్న విషయాన్నీ గుర్తించకుండా చేసింది. డీకేలో ఉన్న 30-40 లక్షల ఆదివాసులనే భారత ప్రజలుగా భావించే పరిస్థితి కొనసాగింది. 17 ఏళ్లు విముక్తి ప్రాంతంలాగా ఉన్న పరిస్థితి.. గ్రీన్‌హంట్ మొదటి రెండవ దశలో ఎదుర్కొంటూ నిలబడడమనే విశ్వాసం.. అసలు సత్యాన్ని గుర్తించనివ్వలేదు. ఎన్ని లక్షల బలగాలు వచ్చినా డీకే ఉద్యమాన్ని అణచివేయలేరని, ఈలోపు బయటి పౌర సమాజం పట్టించుకుంటుందనీ భావించారు. ఆ పరుగులో తింటున్న ఎదురు దెబ్బలని మార్క్సిస్ట్ భూతద్దంలో విశ్లేషించుకోలేదు. చివరకు సుమారు 500 మంది గెరిల్లా బలగాలు, నేతలు కర్రెగుట్టలపై అడ్డా వేసి కేంద్ర బలగాల ఆపరేషన్ మొదలవ్వగానే నిస్సహాయ పరిస్థితుల్లోకి నెట్టబడి.. బయటి ఒత్తిడి, శాంతి చర్చల ప్రతిపాదన తమను కాపాడతాయి లేదంటే ధైర్యంగా కొట్లాడి ప్రజల కోసం ప్రాణాలు అర్పిద్దాం.. అని తెగించారంటే వారి త్యాగశీలతను కీర్తించాలో లేక అర్ద దశాబ్దం పాటు అమరుల రక్తతర్పణతో నిర్మించుకుని చరిత్రలోనే అతి పెద్ద మావోయిస్టు పార్టీ ఓటమికి కారణమయ్యారని నిందించాలో అర్థం కాని పరిస్థితి ఉంది.

– దూడెం మార్కండేయ
దిశ ఎడిటర్
editor@dishadaily.com
