టెర్రరిస్టు కార్యకలాపాలను సమర్థవంతంగా అణచివేసే ఉద్దేశంతో జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రాన్ని (ఎన్సీటీసీ) ఏర్పాటుచేస్తూ ఫిబ్రవరి 3న కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్ పర్యవేక్షణలో సర్వస్వతంత్రంగా పనిచేసే ఈ కేంద్రానికి ఉగ్రవాదుల కార్యకలాపాలపై గూఢచర్యం నెరపడంతో పాటు దేశంలో ఎక్కడైనా సోదాలు చేసే, ఎవరినైనా అరెస్టు చేసే అధికారాలను కట్టబెట్టడం వివాదాస్పదమైంది.
ఇది ఫెడరల్ స్ఫూర్తికి, ప్రజాస్వామిక విలువలకు విరుద్ధమని పలువురు విమర్శించారు. ఉగ్రవాద నిర్మూలన పేరుతో రాష్ట్రాల అధికారాలను కబళించే ప్రయత్నాలను తాము సహించబోమని కాంగ్రేసేతర పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు హెచ్చరించారు. ఉగ్రవాద నిర్మూలనకు తాము వ్యతిరేకం కాదని, తమను ఏమాత్రం సంప్రదించకుండా కేంద్రం ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం అన్యాయమని వారు ఆరోపించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
యూపీఏలోనూ వ్యతిరేకత..
కేంద్రం చర్యను వ్యతిరేకించిన వారిలో యూపీఏ కూటమికి చెందిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాల బీహార్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కర్నాటక, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, త్రిపుర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈ వ్యతిరేకత నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో సంప్రదించి వారు ఆమోదించిన తర్వాతే నోటిఫికేషనన్ను అమలు చేస్తామని ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం పని చేయడం ఆరంభించే మార్చి 1వ తేదీ లోపలే ఈ సంప్రదింపుల ప్రక్రియను ముగించాల్సిందిగా హోం మంత్రి చిదంబరానికి సూచించారు.
కాగా, ఉగ్రవాద నిర్మూలన మనందరి సమష్టి బాధ్యతగా గుర్తించాలని, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించకుండా నిర్ణయాలు చేయాలన్నది కేంద్రం ఉద్దేశం కానేకాదని ఎన్సీటీసీ లక్ష్యాలను వివరిస్తూ చిదంబరం తాజాగా ఆయా ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. త్వరలోనే రాష్ట్రాల డీజీపీల, ఉగ్రవాద వ్యతిరేక విభాగాధిపతుల సమావేశం ఏర్పాటుచేసి అపోహలను తొలగిస్తామని వివరించారు.
ముంబై దాడులతో బీజాలు..
26/11(2008) ముంబై దాడుల నేపథ్యంలో ఈ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రానికి బీజాలు పడ్డాయి. 9/11(2001) దాడుల అనంతరం అమెరికా ఏర్పాటుచేసిన ఎన్సీటీసీని స్ఫూర్తిగా తీసుకున్న చిదంబరం మన దేశంలో కూడా అలాంటి బలమైన వ్యవస్థ అవసరమని భావించారు. బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ, సింగపూర్ తదితర దేశాల్లో ఏర్పాటు చేసిన ఉగ్రవాద వ్యతిరేక కేంద్రాల విధి విధానాలను అధ్యయనం చేసి ప్రతిపాదనలు రూపొందించారు.
ఈ యేడాది జనవరి రెండో వారంలో సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపింది. నోటిఫికేషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం ఉగ్రవాద నిర్మూలనలో ఎన్సీటీ సీకి విస్తృతాధికారాలు ఉంటాయి. ఐబీలో అడిషనల్ డైరెక్టర్ స్థాయి అధికారి దీనికి నేతృత్వం వహిస్తారు. పలువురు జాయింట్ డైరెక్టర్లు ఇతనికి సహకరిస్తారు. దేశవ్యాప్తంగా 500 టీంలను, రాష్ట్ర స్థాయి ఎస్సీటీసీలను ఏర్పాటుచేస్తారు.
తొమ్మిది విభాగాల నుంచి..
ఎన్సీటీసీలో పని చేయడం కోసం అధికారులను, సిబ్బందిని ఐబీ, రా(రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్), జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ, త్రివిధ దళాలకు చెందిన గూఢచార సంస్థలు, జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ(ఎన్టీఆర్డీ), డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ), సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోల నుంచి రిక్రూట్ చేసుకుంటారు.
టెర్రరిస్టుల, వారి అనుచరుల, మద్దతుదారుల, స్నేహితుల, కుటుంబసభ్యుల కార్యకలాపాల గురించిన సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడమే కాకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ-1967)లోని సెక్షన్ 43(ఎ) ప్రకారం అనుమానితులను అరెస్టు చేసే, ఉగ్రవాదుల స్థావరాలుగా భావించిన స్థలాలను సోదా చేసే అధికారం కూడా ఈ కేంద్రానికి ఉంటుంది. ఇందుకోసం ఎన్ఎస్ఓ, నావికాదళ ప్రత్యేక బలగాలు, సీఆర్పీఎఫ్కు చెందిన కోబ్రా దళాలు సహా అన్ని రకాల కమాండో బలగాల, కోవర్ట్ ఆపరేషన్స్ నిర్వహించే రహస్య సంస్థల సేవలను వాడుకోవచ్చు.
ఉగ్ర ముప్పుపై అంచనా..
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ యంత్రాంగం, విదేశాల్లోని భారత రాయబార కార్యాలయ అధికారులు ఎన్సీటీ నీకి సహకరించాల్సివుంటుంది. డాక్యుమెంట్లు, రహస్య నివేదికలు, రాతప్రతులు, కంప్యూటరైజ్డ్ డాటా తదితర ఏ రూపంలో ఉన్న సమాచారాన్నైనా అడిగిన వెంటనే అందించాల్సివుంటుంది. సీబీఐ, ఎస్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ), నాట్ గ్రిడ్ నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్), ఎన్టీఆర్, డీఆర్(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్), పారా మిలిటరీ, రాష్ట్రాల పోలీసు బలగాలు సైతం ఎన్సీటీసీ అడిగిన సమాచారాన్ని వెంటనే ఇవ్వాల్సివుంటుంది.
ఈ కేంద్రానికి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వడానికి వివిధ రాష్ట్రాల ఉగ్రవాద వ్యతిరేక విభాగాల అధిపతులు సభ్యులుగా ఉండే స్టాండింగ్ కౌన్సిల్ను ఏర్పాటుచేస్తారు. ఈ కౌన్సిల్ తరచూ సమావేశమవుతూ ఉగ్రవాదుల నుంచి పొంచి వున్న ముప్పును అంచనా వేస్తుంది. రోజువారీగా వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తుంది.
అపరిమిత అధికారాలు..
వచ్చిన చిక్కల్లా ఎన్సీటీసీ విధి విధానాలతోనే. మాతృ సంస్థ ఐబీకి సైతంలేని కార్యనిర్వాహక అధికారాలను ఎన్సీటీసీకి కట్టబెట్టడం వ్యతిరేకతకు కారణమైంది. కేంద్రస్థాయిలో సీబీఐ, ఎన్ఐలకు, రాష్ట్రస్థాయిలో పోలీసులకు మాత్రమే ఇప్పటివరకు పౌరులను అరెస్టు చేసే సోదాలు నిర్వహించే అధికారాలున్నాయి. మరే సంస్థకూ లేవు. ఆ మాటకొస్తే అమెరికన్ ఎన్సీటీసీకి సైతం ఇలాంటి అధికారాలు లేవు. ఎన్సీటీసీ లాంటి గూఢచార సంస్థకు అనుమానితులను అరెస్టు చేసే అధికారమిస్తే అది దుర్వినియోగమవుతుందని, ఉగ్రవాద నిర్మూలనకు బదులుగా రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి అస్త్రంగా మారుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ దేశంలో ఇప్పటివరకు జరిగిన గూఢచర్యమంతా ప్రతిపక్షాలే లక్ష్యంగా కొనసాగిందని గతంలో ఐబీలో పనిచేసిన ఎం కె ధర్ తను రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. ఎమర్జెన్సీలో కొనసాగిన ఆకృత్యాలను విచారించిన షా కమిషన్ నివేదిక సైతం ఇదే విషయాన్ని ధృవీకరించింది. రాజకీయ ప్రత్యర్థుల వేధింపు కోసం ఇందిరాగాంధీ సీబీఐతో పాటు ఐబీని విచ్చలవిడిగా వాడుకున్నారని తేల్చిచెప్పింది. అరెస్టు చేసే అధికారాలు లేని సమయంలోనే ఆధికార పార్టీకి ఐబీ అలా ఉపయోగపడితే ఇప్పుడు అదే సంస్థ అధిపతి కింద పనిచేసే ఎన్సీటీసీ ఉగ్రవాద కార్యకలాపాల అణచివేత పేరిట రాజకీయ ప్రత్యర్థులను వేధించదనే గ్యారంటీ ఎక్కడుందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
వ్యతిరేకించిన సీఎంలు..
విమర్శలకు తావిచ్చిన మరో అంశం ఫెడరల్ సూత్రాల ఉల్లంఘన. మమత మొదలు జయలలిత వరకు పలువురు ముఖ్యమంత్రులు ఎన్సీటీసీపై తమ విమర్శను ఈ అంశంపైనే ఎక్కుపెట్టారు. పైకి చెప్పకపోయినా కొందరు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా ఈ విషయంలో తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారని సమాచారం. రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకారం శాంతిభద్రతల అంశం పూర్తిగా రాష్ట్రాలకు సంబంధించిన విషయం. సీబీఐ సైతం ఆయా రాష్ట్రాల అంగీకారంతోనే కేసుల విచారణ చేబడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే.
2008లో ప్రత్యేకచట్టం ద్వారా ఏర్పరచిన ఎన్ఐఏ మాత్రమే దేశ సమగ్రతకు, భద్రతకు భంగం కలిగించే కార్యకలాపాలపై ఏ రాష్ట్రంలోనైనా దర్యాప్తు చేబట్టే అధికారాన్ని కలిగివుంది. ఎస్ఐఏ దర్యాప్తు సంస్థ కాగా ఎన్సీటీసీ గూఢచార సంస్థ అనీ, గూఢచార సంస్థకు దేశవ్యాప్త అరెస్టు అధికారాలను అప్పగించడం ప్రపంచంలో ఎక్కడా లేదని సీపీఐ అగ్రనేత డి రాజా విమర్శించడం గమనార్హం. ఎన్ఐఏ చట్టం సైతం ముంబై దాడుల నేపథ్యంలో, ఒక భావోద్వేగ వాతావరణంలో ఆమోదించబడిందని, ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్న ఆ చట్టాన్ని సమీక్షించాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎన్సీటీసీపై వాద ప్రతివాదాలెలా ఉన్నా ఉగ్రవాద నిర్మూలన పేరిట గతంలో అమలులోకి వచ్చిన చట్టాలన్నీ ప్రజాస్వామ్య విలువల ఉల్లంఘనలకు తావిచ్చాయన్నది కఠోర వాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన టాడా, ఎన్డీఏ సర్కారు ఆమోదించిన పోటా ఇలాంటి ఆరోపణల నేపథ్యంలోనే రద్దయ్యాయి. 1958 నుంచి ఈశాన్యంలో, కాశ్మీర్ లో అమలవుతున్న సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టంపై సైతం ఇవే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, ఏ కారణాలు చెప్పి ఏర్పాటుచేసినా ప్రస్తుత ఎన్సీటీసీ కూడా ఇలాగే అప్రతిష్ఠపాలు కాకతప్పదు.
అసంతృప్తే పునాది..
రాష్ట్రాల అధికారాలకే కాకుండా పౌరహక్కులకు సైతం ముప్పుగా మారనున్న ఎన్సీటీసీ నోటిఫికేషన్ను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను తీర్చకుండా, వారెదుర్కుంటున్న మౌలిక సమస్యలకు పరిష్కారం చూపకుండా కొత్తగా ఎన్ని చట్టాలను తెచ్చినా, బలగాలకు ఎన్ని అధికారాలను కట్టబెట్టినా ఉగ్రవాదాన్ని నిర్మూలించడం సాధ్యం కాదు. అంతర్గత భద్రతకు అత్యంత ప్రమాదకారిగా పరిణమించిందని ప్రధాన చెప్పిన వామపక్ష తీవ్రవాదానికైనా, జాతుల స్వయంనిర్ణయాధికారాన్ని డిమాండు చేస్తూ ఈశాన్యంలో, కాశ్మీర్లో సాయుధంగా పోరాడుతున్న సంస్థలకైనా ప్రజల్లో నెలకొన్న అసంతృప్త పునాది.
దేశీయంగా అసంతృప్తి లేకుండా పొరుగు దేశాలు టెర్రరిజాన్ని ప్రేరేపించడం సాధ్యం కాదు. అలాంటి అసంతృప్తికి, అలజడికి కారణమైన సమస్యలను పరిష్కరించడం వదిలేసి, అభివృద్ధిలో అణగారిన వర్గాలను భాగస్వాములు చేయడం మానేసి ఉద్యమాలపై ఉగ్రవాద ముద్రవేసి సైనికంగా అణచివేయజూడడం భారత్ లాంటి ప్రజాస్వామిక, సమాఖ్య రాజ్యాంగం కలిగివున్న దేశానికి సమంజసం కాదు.
- డి మార్కండేయ
(నమస్తే తెలంగాణ ఎడిట్ పేజీ సౌజన్యంతో..)