గత మంగళవారం రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత సిగ్గు చేటైన పద్ధతిని అనుసరించిందని ఆయన దుయ్యబట్టారు. విభజన బిల్లుపై కనీసం చర్చకు అనుమతించలేదని, మైకులు ఆపి, పెప్పర్ స్ర్పేలు కొట్టి ఆమోదింపజేసుకున్నారని విమర్శించారు. ఏపీ ప్రజల పట్ల కాంగ్రెస్ దారుణంగా వ్యవహరించిందని సానుభూతిని వ్యక్తం చేశారు. అందరిని కూర్చోబెట్టి మాట్లాడి కలిసికట్టుగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసివుండచ్చునని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించడం ఆయనకు రాజకీయ అవసరమే కావచ్చు కాని ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ విభజనను ఇప్పుడు మళ్లీ తెర పైకి తేవడంలో ప్రధాని ఉద్దేశం ఏమిటన్న విషయంపై మన దగ్గర తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణలో బిజేపీ మినహా అన్ని పార్టీలూ, ప్రజాసంఘాలూ ఆయన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డాయి. నిరసన కార్యక్రమాలను నిర్వహించాయి. కేటీఆర్ సహా టీఆర్ఎస్‌కు చెందిన పలువురు మంత్రులు, నేతలు తీవ్రంగా స్పందించారు. దశాబ్దాల తెలంగాణ పోరాటాన్ని ప్రధాని అవమానించారని పేర్కొన్నారు. మోడీ తెలంగాణ వ్యతిరేకి అని, 2000లో మూడు కొత్త రాష్ట్రాలను ఇచ్చిన బీజేపీ, అప్పుడే తెలంగాణను ఏర్పాటుచేసి వుంటే 1200 మంది అమరుల బలిదానాలు తప్పేవని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శించారు.
తెలంగాణ ఏర్పాటుపై మోడీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2014 సాధారణ ఎన్నికల ప్రచారానికి ఇక్కడికి వచ్చిన సందర్భంగానూ మహబూబ్‌నగర్‌లో ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పిల్లకు పురుడు పోసి తల్లిని చంపేశారని కాంగ్రెస్ పార్టీని నిందించారు. విభజన క్రమంలో చర్చలకు ప్రాధాన్యం ఇవ్వలేదని, హడావుడిగా బలవంతపెట్టి, భయపెట్టి బిల్లును ఆమోదింపజేసుకున్నారన్నారు. ఇప్పుడు మళ్లీ తెలంగాణలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం అనుమానాలకు తావిస్తున్నది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ ప్రయోజనం ఆశించి ఇలా మాట్లాడారన్న విషయంపై విశ్లేషకుల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఏపీకి అన్యాయం జరిగిందని ఫీలయ్యారు కనుక ఆ రాష్ట్ర బీజేపీకి లాభం జరగాలి. అయితే, అక్కడ బీజేపీ ఉనికి అంతంత మాత్రమేనన్నది అందరికీ తెలిసిన విషయమే. వైసీపీతోనో, టీడీపీతోనో మైత్రి లేకుండా ఒంటరిగా ఆ పార్టీ సాధించేది ఏమీ లేదన్నదీ స్పష్టమే. మరి మోడీ ఎందుకు అలా మాట్లాడినట్లు? ఎవరికి మేలు చేయడానికి? లేదంటే ఎవరిని దెబ్బతీయడానికి? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ముంగిట ముఖ్యంగా పంజాబ్‌లో కాంగ్రెస్‌ను రాజకీయంగా ఆత్మరక్షణలో పడేయడానికి మోడీ అలా మాట్లాడారనుకున్నా అందులో ఏపీ విభజన ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం లేదు. యాభై ఏళ్ల దేశ పాలనలో కాంగ్రెస్ వైఫల్యాలను, అణచివేతలను, దురాగతాలను ఎన్నింటినో ప్రస్తావించి వుండవచ్చు. వాటిని ప్రముఖంగా పేర్కొనకుండా తన ప్రసంగంలో తెలంగాణ ఏర్పాటు పైన, ఎన్టీఆర్ బర్తరఫ్ పైన, అంజయ్యకు జరిగిన అవమానం పైన ఎక్కువగా కేంద్రీకరించి విమర్శలు చేశారు. కాని, 2009 డిసెంబర్ 9 చిదంబరం ప్రకటన నుంచి 2014లో విభజన బిల్లు చట్టసభల ఎదుటికి వచ్చేవరకు నాలుగేళ్ల పాటు జరిగిన పరిణామక్రమం ఆయనకు తెలియదా? శ్రీకృష్ట కమిటీని ఏర్పాటు చేసింది విస్తృత చర్చలు జరపడానికేనన్నది మరిచిపోయారా? వెంకయ్యనాయుడు నుంచి సుష్మా స్వరాజ్ వరకు అప్పుడు సభలో అధికార కాంగ్రెస్‌కు సహకరించిన విషయం గుర్తులేదా? చర్చ లేకుండానే బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించడానికి బీజేపీ కూడా ఒప్పుకున్నది కదా? ఏ బిల్లును ఆమోదించే సమయంలోనైనా పార్లమెంటు తలుపులు మూస్తారన్న కనీస అవగాహన ఆయనకు లేదా? ఇలాంటి ప్రశ్నలన్నీ ప్రధాని ప్రసంగంలో ఏదో రహస్య ఎజెండా ఉందన్న అనుమానాలను పెంచుతున్నాయి.
మోడీ వ్యాఖ్యలతో తెలంగాణలో ఎక్కువ లాభపడేది అధికార టీఆర్ఎస్ అయితే, నష్టపోయేది మాత్రం రాష్ట్ర బీజేపీయే. అ రోజు నుంచి గులాబీ నేతలు కమలదళంపై వరుసగా విరుచుకుపడుతున్నారు. ప్రజల్లో తెలంగాణ సెంటిమెంటును మరోమారు రగిలింపజేస్తున్నారు. వరస నిరసనలను కొనసాగిస్తున్నారు. జనగామ, యాదాద్రి సభల్లో సీఎం కేసీఆర్ ప్రధానిని మరోసారి తిట్టిపోశారు. కేటీఆర్ నిత్యం తన ట్వీట్లను ఆ పార్టీ పైనే ఎక్కుపెడుతున్నారు. టీఆర్ఎస్ ఎంపీలు ప్రధానిపై ఉభయసభల్లోనూ ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. సమావేశాలను బహిష్కరిస్తున్నారు. మరోవైపు, తెలంగాణ బీజేపీ తీవ్ర ఆత్మరక్షణలో పడింది. ప్రధాని ప్రసంగం తర్వాత ఏం మాట్లాడాలో ఆ పార్టీ నేతలకు అర్థం కాలేదు. వీలైనంతవరకు ఇష్యూ డైవర్షన్ కోసం ప్రయత్నిస్తూ కేసీఆర్ కుటుంబంపై రాజకీయ దాడి సాగిస్తున్నారు. ప్రైవేట్ టాక్‌లో మాత్రం ఇన్నాళ్ల తమ శ్రమ బూడిదలో పోసిన పన్నీరయిందని వాపోతున్నారు. కాంగ్రెస్‌ను తోసిరాజని తాము రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించామని, హుజూరాబాద్ గెలుపు తర్వాత పార్టీలో చేరికలు పెరిగి మంచి ఊపుమీదున్న పరిస్థితుల్లో ప్రధాని వ్యాఖ్యలు తమను బాగా నిరుత్సాహపర్చాయని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ బీజేపీ నేత బాధపడ్డారు. టీఆర్ఎస్ పాలనపై కేంద్ర నాయకత్వం వైఖరి తమను గత ఎనిమిదేళ్లుగా ఇబ్బంది పెడుతూనే వుందన్నారు.
ఆ బీజేపీ నాయకుని ఆవేదనలో వాస్తవముంది. 2014 నుంచీ టీఆర్ఎస్ పాలనపై, కేసీఆర్ కుటుంబ అరాచకాలపై రాష్ట్ర కమలనాథులు ఎడతెగని పోరాటం చేస్తుంటే అధిష్టానం మాత్రం అందుకు భిన్నవైఖరిని అవలంబిస్తూ వస్తున్నది. తెలంగాణ ప్రభుత్వ పథకాలను కేంద్ర మంత్రులు మెచ్చుకోవడం.. రాష్ట్రపతి-ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, కీలక బిల్లుల ఆమోదం కోసం టీఆర్ఎస్ మద్దతు పొందడం.. ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా కేసీఆర్‌కు మోడీ-షాల వద్ద రెడ్ కార్పెట్ స్వాగతం లభించడం.. వారితో సత్సంబంధాలున్నాయన్న సంకేతాలు వెలువడడం.. వంటి పరిణామాలు ఆ పార్టీ వైఖరిపై ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. టీఆర్ఎస్-బీజేపీ సంబంధాలు.. కేంద్రంలో దోస్తీ, రాష్ట్రంలో కుస్తీ.. అన్నట్లుగా తయారయ్యాయి. అయితే ఇలాంటి పరిస్థితులు తెలంగాణ బీజేపీకి నష్టం చేకూరుస్తాయన్న విషయం కేంద్ర నాయకత్వానికి తెలియకుండా ఉండదు. అయినా, అలాంటి వైఖరి అనుసరిస్తున్నారంటే కేసీఆర్‌తో అంతకంటే ఏదో పెద్ద లాభం వాళ్ల మనసుల్లో ఉందన్నమాట.
ఏడున్నరేళ్ల పాలన తర్వాత ప్రస్తుతం దేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్డీయే చేజారడం, బెంగాల్‌లో మమత ఆధిపత్యం కొనసాగడం.. బిహార్‌లో స్వల్ప మెజారిటీతోనే గట్టెక్కడం.. దక్షిణాదిన కర్ణాటక తప్ప మరోచోట పెద్దగా ఆశలు లేకపోవడం.. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో సైతం ఇబ్బందుల్లో ఉండడం.. మోడీ-షా ద్వయాన్ని ఆలోచనలో పడేసివుండవచ్చు. 2024లో కేంద్రంలో మరోసారి అధికారం దక్కించుకోవాలంటే కేసీఆర్ లాంటి ప్రాంతీయ పార్టీల నేతల అవసరాన్ని వాళ్లు గుర్తించివుండచ్చు. పైగా, కేసీఆర్‌కు ఆప్తమిత్రుడైన అసదుద్దీన్ ఎంఐఎం పార్టీ యూపీలో 100 సీట్లలో పోటీ చేయడం వల్ల ఎస్పీ-బీఎస్పీకి పడే ముస్లిం ఓట్లు చీలి చివరకు బీజేపీకే లాభం జరుగుతుందన్న అంచనాలున్నాయి. జాతీయ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన గులాబీ బాస్.. కమలదళంపై యుద్ధం పేరిట దేశమంతా తిరిగి యూపీఏ ప్రభావం నుంచో లేదంటే థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న మమత-పవార్‌ల ప్రభావం నుంచో ఏవో కొన్ని పార్టీలను బయటకు లాగగలిగినా అది చివరకు బీజేపీకే లాభిస్తుందన్న విషయమూ స్పష్టమే.
అందుకే, టీఆర్ఎస్-బీజేపీ మధ్య పోరు ఉత్తుత్తి యుద్ధమేననే అనుమానాలు పరిశీలకుల్లో ఉన్నాయి. ఉమ్మడి శత్రువైన కాంగ్రెస్‌ను తెలంగాణలోనూ, జాతీయంగానూ దెబ్బతీయడానికే మోడీ-షా-కేసీఆర్ త్రయం ఈ వ్యూహం పన్నారని వాళ్లు ఆరోపిస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య కయ్యం ప్రజలను ఎంతగా రంజింపజేస్తే అంతగా నష్టపోయేది కాంగ్రెస్సేనని చెబుతున్నారు. మోడీపై, బీజేపీపై కేసీఆర్ సమరశంఖం పూరించినప్పటి నుంచీ కాంగ్రెస్ రాష్ట్రంలో డమ్మీ అయిన సంగతిని గుర్తు చేస్తున్నారు. ఈ డ్రామాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ ఇలాగే కంటిన్యూ చేస్తే సెంటిమెంటు పండి మూడవసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ మెజారిటీ రాకపోయినా బీజేపీతో జతకట్టి ఇక్కడ సర్కారును ఏర్పరచి, పార్లమెంటు ఎన్నికల్లో కలిసి పోటీచేసే అంశాన్నీ కొట్టివేయలేమని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ బలహీనపడిన స్థితిలో థర్డ్ ఫ్రంట్ పార్టీల మధ్య చీలికలు క్రియేట్ చేయగలిగితే ఢిల్లీ పీఠం మరోసారి కమలనాథులదే అవుతుందంటున్నారు. అప్పుడు కేసీఆర్ కేంద్రమంత్రి అయితే, రాష్ట్రానికి కేటీఆర్ సీఎం కావడం సులువవుతుందని పేర్కొంటున్నారు.
మోడీ-కేసీఆర్‌ల ఈ క్విడ్ ప్రో క్వో వ్యూహం నిజంగానే సఫలమవుతుందా? కేసీఆర్ జాతీయస్థాయిలో ప్రభావం చూపగలుగుతారా? ఆయనను థర్డ్ ఫ్రంట్ నేతలు విశ్వసిస్తారా? యూపీలో ఎంఐఎంకు ఓట్ల చీలిక బీజేపీని గెలిపిస్తుందా? ఒకవేళ కేసీఆర్ మోడీపై ప్రకటించిన యుద్ధం నిజమేనా? ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు ఆయన నిర్ణయాన్ని మారుస్తాయా? వెంటిలేటర్‌పై ఉన్న కాంగ్రెస్ ఇకనైనా కోలుకుని ప్రత్యామ్నాయంగా అవతరిస్తుందా? తెలంగాణ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? అన్నది సమీప భవిష్యత్తులో తేలిపోనుంది.
- డి మార్కండేయ
(దిశ సౌజన్యంతో..)