దేశంలో నెలకొన్న విప్లవ పరిస్థితి, ప్రజల సంసిద్ధత విషయంలో నక్సలైట్ పార్టీలు.. ముఖ్యంగా అప్పటి పీపుల్స్‌వార్ నుంచి ఇప్పటి మావోయిస్టు పార్టీ వరకు అతివాద అంచనాలు వేశాయనే వాదన మొదటినుంచీ ఉంది. నక్సల్బరీ నిర్మాత, దేశంలో మార్క్సిస్టు-లెనినిస్టు రాజకీయాలకు ఆద్యుడు చారుమజుందార్‌తో మొదలైన ఈ అతివాద పోకడలు.. స్థల, కాల పరిస్థితులు ఎంతగా మారినా ఇసుమంతైనా మారలేదు. 1967 తర్వాతి కాలంలో చారుబాబు దేశంలో అత్యద్భుతమైన విప్లవ పరిస్థితి ఉందని, మనం చిన్న నిప్పుకణిక రగిలిస్తే చాలు.. దేశమంతా దానికదే మంట అంటుకుని విప్లవం తెస్తుందని ప్రవచించారు. కొన్ని సాయుధ దళాలు ఏర్పడి వర్గశత్రు నిర్మూలన అక్కడక్కడా చేస్తే ప్రజలు ఎక్కడికక్కడ తిరగబడతారని, ఆయుధాలు చేబూని పాలక సైన్యాలతో కొట్లాడుతారని చెప్పారు. ప్రజాసంఘాలను నిర్మించడం, వర్గపోరాటాలు చేయడమంటే రివిజనిజమేని, సమయం వృథా చేయడమేనని స్పష్టం చేశారు. ఆయన రాసిన ‘‘చారిత్రక ఎనిమిది డాక్యుమెంట్లు’’ స్థూలంగా ఇవే చెబుతాయి.
ప్రపంచ యుద్ధమే విప్లవాన్ని తెస్తుంది!
చారుబాబు మరణించిన తర్వాత కూడా విప్లవ పరిస్థితిపై అదే అతివాద ధోరణి కొనసాగింది. సీపీఐ(ఎంఎల్) సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ 1972 తర్వాత ఈ అంచనానే ముందుకు తీసుకెళ్లింది. అప్పటికి వియత్నాం, కంబోడియాలపై అమెరికా అక్రమణ, ఇతర దేశాల్లో ఆధిపత్య ధోరణి, రెండు అగ్రరాజ్యాల మధ్య వైరుధ్యాలు చివరకు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయని పలు రాజకీయ తీర్మానాల్లో పేర్కొన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ రష్యాలో, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తూర్పు యూరపు దేశాల్లో, చైనాలో విప్లవాలు బద్దలైన విధంగానే మూడవ ప్రపంచ యుద్ధం వచ్చి ఇండియా సహా పలు వెనకబడిన దేశాలు విముక్తమవుతాయని నమ్మారు. 1980లో పీపుల్స్‌వార్ గ్రూపును స్థాపించిన కొండపల్లి సీతారామయ్య సైతం తన రచనల్లో ఇదే విషయం చెప్పారు.
అగ్రరాజ్యం రష్యా 1989-90లో కుప్పకూలేవరకూ పీపుల్స్‌వార్ గ్రూపు అంచనా అలాగే ఉండింది. నాయకత్వం కొండపల్లి నుంచి గణపతి తదితరుల చేతుల్లోకి వచ్చినా, మూడో ప్రపంచ యుద్ధం బద్దలు కాకపోయినా, కనీసం ఆ జాడలు కూడా కనిపించకున్నా విప్లవ పరిస్థితిపై అంచనాలు మాత్రం అలాగే కొనసాగాయి. సోవియట్ రష్యా అంతరించిన తర్వాత మూడో ప్రపంచ యుద్ధం ప్రస్తావన రాలేదు కాని అగ్రరాజ్యం అమెరికా సహా అన్ని పెట్టుబడిదారీ దేశాలు తీవ్రాతి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని, ఏ సమయంలోనైనా ప్రపంచవ్యాప్తంగా అది బద్దలై ప్రజలు తిరగబడవచ్చని రాశారు. విప్లవ పార్టీ చేయాల్సిందల్లా అప్పటి వరకు అన్ని రకాలా తయారీలు చేసుకుంటూ దానిని సద్వినియోగం చేసుకుని రష్యా, చైనాల్లాగా విప్లవాన్ని గెలవడానికి సన్నద్ధం కావడమేనని స్పష్టం చేశారు.
పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్ని పర్వతం!
80 ఏళ్లు గడిచినా మూడవ ప్రపంచ యుద్ధం వాళ్ళు అనుకున్నట్లు బద్దలు కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధం లేని రోజు లేకుండా దాదాపు 150 యుద్ధాలు చోటుచేసుకున్నా, వాళ్లు భావించినట్లుగా ‘‘యుద్ధాలు అంతర్యుద్ధాలు’’గా మారలేదు. ‘‘మన దేశం సహా ఎక్కడా విప్లవోద్యమాలు సఫలం కాకపోవడానికి స్వీయాత్మక శక్తుల(విప్లవపార్టీ) బలహీనతే కారణం’’.. అనే మేరకు గుర్తించినా, అందుకు కారణాలు అర్థం చేసుకోవడంలో మాత్రం మళ్ళీ అతివాదమే కొనసాగింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ(సీసీ) 2021 జనవరిలో విడుదల చేసిన ‘‘భారత ఉత్పత్తి సంబంధాల్లో మార్పులు-మన రాజకీయ కార్యక్రమం’’(ఎంఓపీ గా పిలుస్తున్నారు) తెలుగు డాక్యుమెంటు 213వ పేజీలో ఇలా ఉంది.
‘‘ఇలా 136 కోట్ల మంది జనాభాను, అంటే మొత్తం ప్రపంచంలో 19 శాతం పైగా
జనాభాను కలిగిన భారతదేశం ఆగ్రహాన్ని, నిరసనను వెల్లగక్కుతూ పేలడానికి సిద్ధంగా ఉన్న ఒక అగ్నిపర్వతంలా ఉంది. భారతదేశంలో అనుకూల పరిస్థితినంతటినీ సద్వినియోగం చేసుకొని విప్లవానికి నాయకత్వం వహించాల్సిన విప్లవ(మావోయిస్టు) శక్తులు ఇప్పటికీ బలహీనంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో దళారీ పాలకవర్గ పార్టీలు, రకరకాల రివిజనిస్టులు, పోస్టుమోడర్నిస్టులు, చట్టబద్ధ పోరాటవాదాన్ని ముందుకు తెచ్చే ఎన్‌జీఓలు, సంస్కరణవాదులు, ఆర్థికవాదులు ఈ వేడిని తగ్గించేందుకు, పేలుడును వాయిదా వేయడానికి సర్వవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ, భారతదేశానికి వేనవేల నూతన భగత్‌సింగ్‌లను, చంద్రశేఖర్ ఆజాద్‌లను సృష్టించే శక్తి ఉంది. అటువంటి వారిని, సీపీఐ (మావోయిస్టు)లో చేరి వివిధ రంగాల్లో పనిచేస్తూ మృత్యువును ధిక్కరించి అమరులైన వారిలో ఇప్పటికే మనం ఎంతో మందిని చూడవచ్చు. అలాగే అలాంటి శక్తి సామ్రాజ్యవాదులకు, దళారీ పాలకులకు వ్యతిరేకంగా పోరాడే కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావి తదితర పీడిత వర్గాలలో, సెక్షన్లలో, జాతులలో నివురుగప్పిన నిప్పులా ఉంది.’’
దేశవ్యాప్తంగా వెనుకంజలో ఉద్యమం!
పై వ్యాఖ్యానం అలా ఉంటే, తమ నేతృత్వంలో కొనసాగుతున్న విప్లవోద్యమ పరిస్థితిపై ఆ పార్టీ 2011 నుంచి మొదలుకొని 2021 వరకూ వివిధ సమావేశాల్లో చేసిన సమీక్షలు అందుకు భిన్నంగా ఉన్నాయి. డీకే వ్యాప్తంగా ఉద్యమానికి ప్రజాపునాది లోపిస్తున్నదని 2011లో జరిగిన స్థానిక పార్టీ ప్లీనరీ తీర్మానించింది. 2013లో జరిగిన సీసీ సమావేశం దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని చెప్పింది. అప్పటినుంచి జరిగిన పలు సమావేశాల్లో ‘‘ఉద్యమం తాత్కాలిక గడ్డు పరిస్థితుల్లో ఉందని’’ రాసుకున్నారు. చివరగా 2024 ఆగస్టులో జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశం ‘‘ఆపరేషన్ కగార్’’ దాడి నేపథ్యంలో తన శ్రేణులకు తక్షణం చేపట్టాల్సిన చర్యల గురించి వివరిస్తూ ‘‘ప్రస్తుతం భారత విప్లవోద్యమ పరిస్థితి – మన కర్తవ్యాలు’’ అనే సర్క్యులర్ విడుదల చేసింది. అందులో ఇలా ఉంది.
‘‘మన పార్టీ కేంద్ర కమిటీ 2007 ఐక్య మహాసభ తర్వాత 14 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా జరిగిన విప్లవోద్యమాన్ని సమీక్షించి, 2020లో రాజకీయ, నిర్మాణ సమీక్ష(పీఓఆర్)ను రూపొందించింది. ‘‘దేశవ్యాప్తంగా విప్లవోద్యమం తాత్కాలిక వెనుకంజ స్థితిలో ఉందని, ఈ పరిస్థితిని అధిగమించి విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం మన ప్రధాన లక్ష్యమని ఇందులో నిర్దేశించింది.’’
అతివాద అంచనాలే ఓటమికి మూలం!
ఈ అతివాద అంచనాలు 1970ల నుంచి ఇప్పటి వరకూ పార్టీ శ్రేణుల్లో విప్లవ స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని నింపినా, చివరకు రాజకీయంగా, సైనికంగా ఘోర పరాజయం పొందడానికి దారితీసిన నిర్ణయాలకు పురికొల్పింది. ప్రజాపునాది లోపించిందని, గడ్డు పరిస్థితుల్లో ఉన్నామని, వెనకంజలో ఉన్నామని గుర్తించినా అందుకు అనుగుణంగా రాజకీయ కార్యక్రమాన్ని, వ్యూహం-ఎత్తుగడలను రూపొందించుకోవడానికి అవకాశమివ్వలేదు. కేవలం దండకారణ్యంలోని ఓ నాలుగైదు జనతన సర్కార్ల పరిధిలో ఉన్న కొన్ని లక్షల మంది ఆదివాసీ ప్రజల్లో నెలకొన్న విప్లవ సంసిద్ధత, చైతన్యం తదితర పరిస్థితులను చూసి మొత్తం దేశమంతా అలాగే ఉందని ఊహించుకునే భ్రమలకు దారితీసింది.
మేధావుల మౌనమే నష్టాలకు కారణం!
ప్రస్తుతం బయటి సమాజం స్వార్థంతో నిండా మునిగివున్నదని, మనిషి తన చుట్టూ తాను తిరుగుతూ.. అంతిమంగా డబ్బు చుట్టూ తిరుగుతున్నాడని, విప్లవ సంసిద్ధత ఏమాత్రం లేదని, ఇది సామాజిక మార్పులకు ప్రతిబింబమని అడవుల్లో ఉన్నవారికి ఎవరూ ఎందుకు చెప్పలేదు? దేశవ్యాప్తంగా మారిన ఉత్పత్తి, మానవ సంబంధాలను.. ఇప్పటికైనా డీకే నుంచి బయటకు వచ్చి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని ఎందుకు సూచించలేదు? అగ్నిపర్వతం బద్దలు కాకున్నా జెన్ జీ తరం తిరగబడిన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాల్లో కూడా తిరిగి పార్లమెంటరీ పార్టీలే అధికారంలోకి వచ్చిన విషయం ఎందుకు వివరించలేదు? ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చిన సోనూ-ఆశన్న, దేవ్‌జీ-సంగ్రామ్ దాదాలను విమర్శిస్తున్న, సమర్థిస్తున్న మేధావులకు ఈ విషయాలను మావోయిస్టు పార్టీకి నివేదించాలని ఇంతకాలం ఎందుకు అనిపించలేదు? వాళ్లు కూడా ఇదే సమాజంలో, ఇదే తరంలో బతుకుతున్నారు కదా!
