మావోయిస్టు పార్టీ ఓటమిపై నేను వరసగా చేస్తున్న విశ్లేషణల నేపథ్యంలో కొంతమంది విప్లవాభిమానుల నుంచి డిఫరెంట్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ‘‘పార్టీ ఓటమిపై మీరు చేస్తున్న సమీక్షలను, చెబుతున్న విషయాలను ఎవరూ కాదనలేరు.. మీ రచనలు ఆలోచింపదగినవిగా, భవిష్యత్ తరాలు గుణపాఠం నేర్చుకునే విధంగా ఉన్నాయి. అయితే, గత 60 ఏళ్లలో ఆ పార్టీ తెలుగు రాష్ట్రాల్లోని, ఇతర రాష్ట్రాల ఆదివాసీ ప్రాంతాల్లోని పేద, అట్టడుగు వర్గాల జీవితాల్లో, మొత్తం సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు రావడానికి కారణమైందనే కోణం మిస్సవుతున్న ఫీలింగ్ కలుగుతోంది. వాటి పైన కూడా రాస్తే బాగుంటుంది’’ అని అభిప్రాయపడ్డారు. ఈ ఫీడ్‌బ్యాక్ నన్ను ఆలోచింపజేసింది.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మౌలిక మార్పులు..
నిజమే.. నక్సలైట్, మావోయిస్టు ఉద్యమం తెలంగాణ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ సమాజంలో కాలం చెల్లిన సామాజిక కట్టుబాట్లను కూల్చివేయడంలో ప్రధాన భూమిక పోషించింది. దొరల గడీల అరాచకాలను ఎదిరించి, దశాబ్దాల కాలంగా సాగుతున్న వెట్టి చాకిరిని అంతం చేయడంలో విజయం సాధించింది. భూస్వాముల కబ్జాలో ఉన్న వేలాది ఎకరాలను “దున్నేవారికే భూమి” లక్ష్యంతో పేదలకు పంపిణీ చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మౌలిక మార్పులకు పునాదులు వేసింది. ఈ క్రమంలో దళితులు, ఆదివాసులు, వెనుకబడిన వర్గాల్లో ఆత్మగౌరవం పెరిగింది. కుల వివక్షకు వ్యతిరేకంగా బలమైన సామాజిక చైతన్యం ఆవిర్భవించింది. ప్రధాన స్రవంతి రాజకీయాల్లో వాళ్లు చేరడానికి తోడ్పడింది.
.
ఆదివాసీలకు స్వయంపాలన పాఠాలు..
ఆదివాసీ ప్రాంతాల్లో నక్సలైట్ ఉద్యమం అటవీ హక్కుల పోరాటానికి శంఖం ఊదింది. ఛత్తీస్‌గఢ్, గడ్చిరోలి, ఒరిస్సా, జార్ఖండ్ తదితర ప్రాంతాల్లో జనతన సర్కార్లు, క్రాంతికారీ కిసాన్ కమిటీల రూపంలో ఆదివాసీలకు స్వయంపాలనపై, జల్-జంగల్-జమీన్‌పై తమకున్న హక్కులపై అవగాహన కల్పించింది. తునికాకు సేకరణ, ఇతర అటవీ ఉత్పత్తుల అమ్మకాల్లో కాంట్రాక్టర్ల దోపిడీని అడ్డుకుని, కూలీ రేట్లను గణనీయంగా పెంచడం ద్వారా వారి ఆర్థిక స్థితిగతులలో గొప్ప మార్పు తెచ్చింది. అబూజ్‌మాడ్ వంటి మారుమూల ప్రాంతాల్లో సైతం మహిళలను క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘం వంటి సంస్థల్లో చేర్చి, వారిని సామాజిక, రాజకీయ నిర్ణయాల్లో భాగస్వాములను చేసి పితృస్వామ్య పోకడలపై పోరాడింది.
సాంస్కృతిక, భావజాల రంగంలో ఈ ఉద్యమం ఒక నూతన సంప్రదాయాన్ని సృష్టించింది. జన నాట్య మండలి, విరసంలే కాకుండా ఎక్కడికక్కడే వేర్వేరు సాహితీ కళా సంస్థల ద్వారా కవులు, రచయితలు, కళాకారులు ఎన్నెన్నో సాహిత్య, జానపద రూపాలను విప్లవ భావజాలంతో జోడించి ప్రజల్లోకి తీసుకెళ్లారు. విప్లవ సాహిత్యం తెలుగు భాషకు కొత్త రూపాన్నిచ్చింది. లిపి లేని భాషలకు గొంతుకనిచ్చింది. సామాన్యుడి కష్టాలను పాటలుగా, కథలుగా, కవితలుగా మలిచింది.

రక్తచరిత్ర దారుల్లోనే సమాజాభివృద్ధి..
ఇలా చెపుతూ పోతుంటే ఎన్ని పేజీలైనా, ఎన్ని పుస్తకాలైనా సరిపోవు. ఎందరు రాసినా చాలదు. సుదీర్ఘకాలం నడిచిన ఒక సాయుధ ఉద్యమం కొన్ని ముఖ్యమైన స్వీయాత్మక(పార్టీ అంతర్గత నిర్ణయాలు), వస్తుగత(సామాజిక మార్పులు) లోపాల మూలంగా అనివార్య పరిస్థితుల్లో ఓటమి పాలైంది. అలాంటి ఓటమిని అన్ని కోణాల్లో విశ్లేషించి, కారణాలను వెలికి తీయడం, గుణపాఠాలు నేర్చుకోవడం నేటి చారిత్రక అవసరం. మానవాభివృద్ధి చరిత్రలో ఇలాంటి ఎన్నో సాయుధ, నిరాయుధ ఉద్యమాలు, విప్లవాలు కొనసాగాయి. కొన్ని గెలిచాయి. చాలా ఓడిపోయాయి. లక్షలాది మంది వీరయోధులు సామాజిక మార్పునకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టారు. అలాంటి రక్తచరిత్ర దారుల్లోనే ఆదిమ సమాజం బానిస సమాజంగా, భూస్వామ్య సమాజంగా, పెట్టుబడిదారీ సమాజంగా పరివర్తన చెందింది. పరిస్థితులు కలిసివచ్చిన కారణంగా సోవియట్ రష్యా, తూర్పు యూరపు దేశాలు, చైనా, క్యూబా, వియత్నాం వంటి దేశాల్లో తాత్కాలికంగా సోషలిస్టు సమాజాలు ఏర్పడినా అవి ఎక్కువ కాలం నిలువకుండా తిరిగి పెట్టుబడిదారీ వ్యవస్థలుగా మారిపోయాయి.
అంతర్గత భద్రతకు అతిపెద్ద ప్రమాదకారి..
మరోవైపు, అనేక మూడవ ప్రపంచ దేశాల్లో భూస్వామ్య సమాజాలు కాస్తా అర్ధవలస-అర్ధభూస్వామ్య సమాజాలుగా మారిపోయాయి. ఈ దేశాల్లో శతాబ్దాల నుంచే సాయుధ ప్రజాస్వామిక ఉద్యమాలు పుట్టి పెరిగాయి. కొన్ని దేశాల్లో కాలక్రమేణా అవి విఫలమైనా, మరికొన్ని దేశాల్లో ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు.. పద్ధతిలో పడుతూ లేస్తూ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి సాయుధ ప్రజాస్వామిక విప్లవోద్యమాల్లో అతి పెద్దదీ, విస్తారమైనదీ, ప్రభావవంతమైనదీ, శక్తిమంతమైనదీ భారత మావోయిస్టు ఉద్యమం. 2009 కల్లా దేశంలోని 18 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ కోట్లాది అభిమానులను, లక్షలాది స్థానిక కార్యకర్తలను, వేలాది ఫుల్‌టైం కేడర్లను, గెరిల్లాలను కలిగియుండి సాక్షాత్తూ అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నోట ‘‘దేశ అంతర్గత భద్రతకు అతిపెద్ద ప్రమాదకారి’’ అనిపించుకున్నది మావోయిస్టు ఉద్యమం ఒక్కటే.
అనుభవాలను రాయండి..
అలాంటి గొప్ప ఉద్యమం ప్రపంచీకరణ-ప్రైవేటీకరణ-ఉదారీకరణ విధానాలు తెచ్చిన మార్పుల మూలంగానో, పెట్టుబడిదారీ విధానం అడ్డదిడ్డంగా, అరాచకంగా ప్రవేశించిన కారణంగానో, ఉద్యమ నాయకత్వం స్థల, కాల పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోనందువల్లనో, చిన్న ప్రాంతంలో ఇరుక్కుపోయి, బయటి ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకోకపోవడం వల్లనో, తను తీసుకున్న నిర్ణయాలపై మొండిగా నిలబడినందువల్లనో ఘోర పరాజయం పాలైంది. సమీప భవిష్యత్తులో మళ్లీ కోలుకోలేనంత స్థాయిలో దెబ్బతినింది. ఇలాంటి సమయంలో ఆ ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్నవాళ్లు.. అనుకూల, వ్యతిరేక సంబంధాలు కలిగిన వాళ్లు.. అందరూ తమ భావాలను సమాజం ఎదుట పెట్టాల్సిన అవసరం నేడు ముందుకు వచ్చింది.

నక్సలైటు ఉద్యమంతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు కలిగిన, ఎంతో మంది తెలుగు రాష్ట్రాల రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, మేధో రంగాల్లో నేడు కీలక స్థానాల్లో ఉన్నారు. మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఇతర ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వాళ్లు.. పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన వాళ్లు.. కార్మిక, ప్రజా సంఘాల నేతలుగా పనిచేసిన వాళ్లు.. కవులు, కళాకారులు, విద్యార్థి, మేధావి శక్తులు, విద్యావేత్తలు.. ఎందరో ఉన్నారు. వీరంతా మావోయిస్టు ఉద్యమం సాధించిన విజయాలపై, అది పొందిన ఓటమిపై విశ్లేషించాల్సిన అవసరం ఎంతో ఉంది. తమకు ఆ ఉద్యమంతో ఏర్పడిన పరిచయం, పొందిన అనుభవాలు, నేర్చుకున్న జీవిత పాఠాలు, మంచీ చెడూ అన్నీ రాయాల్సిన సమయం ఆసన్నమైంది.
తద్వారానే నక్సలైటు ఉద్యమంపై భవిష్యత్ తరాలకు ఒక సమగ్ర అవగాహన ఏర్పడుతుంది. భావి భారత పౌరులు తమ భవిష్యత్తు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో పాజిటివ్, నెగెటివ్ గుణపాఠాలను నేర్చుకోగలుగుతారు. ఇవేమీ చేయకుండా సోషల్ మీడియాలో ఆ ఉద్యమాన్ని గుడ్డిగా వెనకేసుకు రావడమో.. మొండిగా విమర్శించడమో.. చేస్తే(నేడు అదే జరుగుతోంది) ఎలాంటి ఫలితమూ ఉండదు. నా వంతుగా నేనైతే 1981 నుంచి 2000 వరకూ నక్సలైటు ఉద్యమంతో నాకున్న అనుబంధాన్నీ, అనుభవాలనూ ఒక పుస్తకంగా తేవాలని నిశ్చయించుకున్నాను. మరి మీరో..?
