మరోకోణం: జీవన్‌రెడ్డి పార్టీ మార్పు.. రాజకీయ పునరుజ్జీవమా? పతనమా?

రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం, సిద్ధాంతాల పట్ల నిబద్ధత, సామాజిక అంశాలపై లోతైన అవగాహన ఉన్న నాయకుడిగా జగిత్యాల సీనియర్ నేత తాటిపర్తి జీవన్‌రెడ్డికి తెలంగాణ సమాజంలో ఒక ప్రత్యేక గౌరవం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఆయనొక వటవృక్షం. అయితే, నాలుగు దశాబ్దాల పాటు ఏ పార్టీనైతే నమ్ముకున్నారో ఆ కాంగ్రెస్‌ను ఆయన ఇటీవల వదిలిపెట్టడం వివాదాస్పదమైంది. ఏ నాయకత్వాన్నైతే ఇంతకాలం తూర్పారబట్టారో అదే బీఆర్ఎస్ గూటికి చేరడం ద్వారా జీవన్ తన రాజకీయ జీవితంలో అతిపెద్ద తప్పిదం చేశారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఈ నిర్ణయం తన రాజకీయ ప్రస్థానానికి ఒక గౌరవప్రదమైన ముగింపు కోసమని ఆయన భావిస్తుండవచ్చు గాక.. కాని, ఆ ప్రయాణం అందుకు బదులుగా రాజకీయ పతనం దిశగా సాగుతోందన్న విమర్శలు ఆయనను సుదీర్ఘకాలంగా గమనిస్తున్న వాళ్లు చేస్తున్నారు.

కేసీఆర్ విధానాలపై ధర్మఘంట..

ఒక ఆదర్శ రాజకీయ నాయకుడికి ఉండాల్సిన అతిపెద్ద ఆస్తి విశ్వసనీయత. జీవన్‌రెడ్డి గత పాతికేళ్లుగా కేసీఆర్ కుటుంబ పాలనను, నిరంకుశ పోకడలను నిరసిస్తూనే ఎదిగారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, ఆ తర్వాత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ కేసీఆర్ విధానాలను ఒక ధర్మఘంటలా ఎప్పటికప్పుడు శాసనసభ లోపలా, బయటా ప్రశ్నించారు. 2006లో, 2008లో కరీంనగర్ లోక్‌సభకు జరిగిన ఉపఎన్నికల్లో ఆయన అదే కేసీఆర్‌ను బ్యాలట్ పోరులో నేరుగా ఢీకొన్నారు. మొదటిసారి రెండు లక్షలకు పైగా మెజారిటీతో ఘోర పరాజయం పొందారు. 2008లో మాత్రం కేవలం 15వేల పైచిలుకు ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2006లో తను ఓటర్ల ఎదుట కేసీఆర్‌పై ఏ విమర్శలు, ఏ ఆరోపణలు చేశారో.. వాటిని 2008లో అదే ఓటర్లు నమ్మారు. ఇది ఆయన రాజకీయ పరిపక్వతకు నిదర్శనంగా భావించవచ్చు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి(టీఆర్ఎస్‌తో కూటమి) రమణ చేతిలో ఓడిపోయినా, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్‌ను ఓడించి కారు గుర్తు ఊపును సైతం తట్టుకుని అనూహ్యంగా విజయం సాధించారు. 2018, 2023 ఎన్నికల్లో మాత్రం అదే సంజయ్ చేతిలో వరస పరాజయం పొందారు.

పౌరహక్కుల నేతగా ప్రసిద్ధుడు..

వృత్తిరీత్యా లాయర్ అయిన జీవన్.. ఎమర్జెన్సీలో, ఆ తర్వాతా పౌరహక్కుల ఉద్యమ కార్యకర్తగా పలు కేసులు వాదించారు. జగిత్యాల కోర్టుకు వచ్చిన నక్సలైటు కేసులన్నీ ఆయనే తీసుకునేవారు. భూస్వామ్య వ్యవస్థ బలంగా ఉన్న ఆ రోజుల్లో గ్రామీణ పేదల హక్కుల కోసం పోరాడారు. ఈ హక్కుల పోరాటాలే ఆయన్ను ప్రజాక్షేత్రంలోకి నడిపించాయి. కేవలం కోర్టుల ద్వారానే కాకుండా, రాజకీయ అధికారం ద్వారానే వ్యవస్థలో మార్పు తేవచ్చని నమ్మారు. అందుకే 1981లో ఎటువంటి పార్టీ ముద్ర లేకుండా మల్యాల పంచాయతీ సమితి ప్రెసిడెంట్‌గా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. తర్వాత ఎన్టీఆర్ పిలుపుతో ప్రారంభంలోనే టీడీపీలో చేరి, ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. 1984 సంక్షోభంలో తప్పటడుగు వేసి నాదెండ్ల వైపు చేరడంతో ఆయన ప్రతిష్ట ఒక్కసారిగా మసకబారింది. అయితే, వెంటనే తప్పును గుర్తించి కాంగ్రెస్‌లో చేరారు. గత నలభై యేళ్లుగా ఆ పార్టీలోనే ఉండి అనేక ఉత్థాన పతనాలను చవిచూశారు.

ఆత్మాభిమానమా? మొండిపట్టా..?

ఇలాంటి గొప్ప నేపథ్యం, చరిత్ర ఉన్న జీవన్‌రెడ్డి.. కేవలం ఆత్మగౌరవం సాకుతో సైద్ధాంతిక విలువలకు తిలోదకాలివ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 75 ఏళ్ల వయసులో ఇంకా ఏం సాధించాలని బీఆర్ఎస్‌లో చేరారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. నిన్నటి వరకు ఎవరినైతే అవినీతిపరులంటూ విమర్శించారో, నేడు వారితోనే వేదిక పంచుకోవడం ఆయన వ్యక్తిత్వాన్ని అభిమానించే వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఒక సీనియర్ నేతగా తనను విస్మరించారనే అసంతృప్తితో పార్టీని వీడడం ఆయన తొందరపాటుతనాన్ని సూచిస్తుంది. ఆత్మాభిమానం పేరుతో, తన రాజకీయ ప్రత్యర్థి అయిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ను కాంగ్రెస్‌లోకి రానివ్వకూడదనే మొండి పట్టుదలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో కేసీఆర్ కూడా ఫిరాయింపులను ప్రోత్సహించి ఎందరో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకున్నారు. చివరకు సీఎల్పీని సైతం విలీనం చేసుకున్నారు. అప్పుడు కేసీఆర్‌ను తిట్టిపోసిన జీవన్.. ఇప్పుడు సీఎం రేవంత్ అదే పని చేస్తే విమర్శిస్తున్నారు. ఇది ద్వంద్వ నీతి కాక మరేమవుతుంది?

పరిమితులను అర్థం చేసుకోలేదా?

వయసు మూలంగా స్థానికంగా తనకు ఏర్పడిన పరిమితులను అర్థం చేసుకుని ఆయన తన పరిధిని నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి పెంచుకుని ఉండవచ్చు. తన వారసులకు తగిన బాధ్యతలు ఇవ్వమని అధిష్టానాన్ని డిమాండ్ చేయవచ్చు. జానారెడ్డి, వీహెచ్ వంటి సీనియర్ల బాటలో నడిచి తన గౌరవాన్ని నిలబెట్టుకుని ఉండవచ్చు. కానీ, ఎంత మంది దూతలు వెళ్లి బతిమిలాడినా, బుజ్జగించినా ఖాతరు చేయకుండా మొండిగా నిర్ణయం తీసుకున్నారు. జగిత్యాలలో రెండుమార్లు వరస ఓటమి తర్వాత కూడా మారకపోవడం ఆయనలోని రాజకీయ స్తబ్ధతను తెలియజేస్తుంది. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా తక్షణం నియమితులైన ఆయన ఇప్పుడు ఏం చేయగలరు? తన పూర్వ పార్టీని విమర్శిస్తూ కాలం గడపడం తప్ప.

కాంగ్రెస్ నాయకత్వ వైఖరి మారాలి..

ఇక, తెగేదాకా లాగే వైఖరిని అవలంభించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా ఇక్కడ తప్పు పట్టాల్సిందే. జీవన్‌రెడ్డి వయసుకు, రాజకీయ పరిపక్వతకు తగిన గౌరవం ఇవ్వడంలో, సముచిత స్థానం కల్పించడంలో వాళ్లు విఫలమయ్యారు. తమ పట్టింపులేనితనంతో కేసీఆర్‌కు ఒక అస్త్రాన్ని చేజేతులా అందించారు. ఇకనైనా వాళ్లు తమ వ్యవస్థాపరమైన లోపాలను గుర్తించి పార్టీని అంతర్గతంగా బలోపేతం చేసుకోవాలి. సీనియర్లలో కొనసాగుతున్న అసంతృప్తిని ఇప్పటికైనా గుర్తించి సరిదిద్దుకోవాలి. లేదంటే ఇంకెంతో మంది జీవన్‌రెడ్డిలు భవిష్యత్తులో పార్టీకి సమస్యలు తెచ్చే ప్రమాదముంది.

-దూడం మార్కండేయ,

ఎడిటర్, దిశ

(దిశ పత్రిక సౌజన్యంతో)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *