2025 అక్టోబర్ 15న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనూ తన 60 మంది సహచరులతో కలిసి గడ్చిరోలిలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఎదుట ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. రెండు రోజుల తర్వాత అక్టోబర్ 17న జగ్దల్పూర్లో తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న మరో 200 మందికి పైగా వివిధ స్థాయిల కేడర్లతో అదే పని చేశారు. అప్పటి నుంచీ (అంతకుముందు కూడా ఇలాంటి లొంగుబాట్లు జరిగినా అవి జరిగిన రూపం, సారం వేరు) మావోయిస్టుల ఆయుధాల విసర్జన, పోలీసుల సమక్షంలో లొంగుబాట్ల పర్వం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఎంఎంసీ(మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్), ఏఓబీ(ఆంధ్రా-ఒడిషా సరిహద్దు), తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిసి సుమారు మూడు వేల మంది మావోయిస్టులు చట్టబద్ధ జీవనంలోకి వచ్చారు. ఇందులో పొలిట్‌బ్యూరో సభ్యులు ఇద్దరు, కేంద్రకమిటీ సభ్యులు ఐదుగురు ఉన్నారు. 20కి మించిన సంఖ్యలో రాష్ట్ర కమిటీల సభ్యులు, సుమారు వంద మంది వరకూ జిల్లా, డివిజన్ కమిటీల సభ్యులు, పలువురు కంపెనీ, ప్లాటూన్ కమాండర్లు, సీవైపీసీ, పీపీసిల సభ్యులు, ఏరియా కమిటీల కార్యదర్శులు, సభ్యులు ఉన్నారు. ఈ మూడు వేల మందిలో 50శాతం కంటే ఎక్కువ మంది మహిళలు, 98శాతం వరకూ ఆదివాసులు ఉండడం గమనార్హం.
సాయుధ పోరాట పంథాకు కాలం చెల్లింది..
తన లొంగుబాటకు ముందే విడుదల చేసిన పలు ప్రకటనల్లో మల్లోజుల అలియాస్ సోనూ కొన్ని విషయాలను చాలా స్పష్టంగా చెప్పారు. దేశంలో మారిన సామాజిక-ఆర్థిక సంబంధాల మూలంగా ప్రస్తుతం దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథాకు కాలం చెల్లిందని అభిప్రాయపడ్డారు. మావోయిస్టు పార్టీ ఉన్నత నాయకత్వం స్థల, కాల పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించలేకపోయిందని, పిడివాద వైఖరి అవలంభించిందని చెప్పారు. తమ తప్పుడు ఆచరణ మూలంగా ప్రజలకు ప్రత్యేకించి విప్లవ శ్రేణులకు తీవ్ర నష్టం జరిగిందని వివరించారు. అందుకు తాను పశ్చాత్తాప పడుతున్నానని, బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. ఇకముందు జరిగే తప్పులకు తాను బాధ్యత వహించదల్చుకోలేదని, తక్షణం పొలిట్‌బ్యూరో పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఆ తర్వాత నెల రోజులకు జనజీవన స్రవంతిలోకి వచ్చారు. మల్లోజుల బాటలో ఆ తర్వాత వచ్చిన అందరు నేతలు, కేడర్ కూడా ఆయన చెప్పిన విషయాలనే వేర్వేరు రూపాల్లో, వ్యక్తీకరణల్లో తిరిగి చెప్పారు.
తెలంగాణ లొంగుబాట్లది మరో దారి..?
కాగా, ఇతర రాష్ట్రాల్లో జరిగిన దానికి భిన్నంగా తెలంగాణలో లొంగుబాట్లు జరిగాయి. మొదటగా వచ్చిన కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన అలియాస్ సుజాతక్క అనారోగ్య సమస్యలతో బయటకు వచ్చానని చెప్పింది. ఆ తర్వాత వచ్చిన మరో సీసీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, బండి ప్రకాశ్ తాము వయసు తెచ్చిన అనారోగ్య సమస్యలతోనే లొంగిపోతున్నట్లు చెప్పారు. పరిస్థితులు మారాయని, ఇకముందు చట్టబధ్దంగా ప్రజల కోసం పనిచేస్తామన్నారు. ఆ తర్వాత వచ్చిన తెలంగాణలో లొంగిపోయన పలువురు నేతలు ఇదే విషయాన్ని చెప్పారు. అయితే, గత నెలలో జనజీవన స్రవంతిలోకి వచ్చిన దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి మాత్రం భిన్న వైఖరి అవలంభించారు. తాము లొంగిపోలేదని, అరెస్టయ్యామని, విధిలేని పరిస్థితుల్లో అజ్ఞాత జీవితానికి స్వస్తి చెప్పాల్సివచ్చిందని ఇంటర్వ్యూల్లో వివరించారు. తాము ఇకపై చట్టబద్ధంగా పోరాడతామని వివరించారు. ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డితో జరిగిన సమావేశంలో మావోయిస్టు పార్టీపై ఉన్న నిషేధం ఎత్తివేసి, చట్టబద్ధ పార్టీగా గుర్తించాలని, తాము పీఎల్జీఏను రద్దు చేస్తామని కోరారు. అది కేంద్రం పరిధిలోని విషయం కనుక తాను హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడుతానని సీఎం హామీ ఇచ్చారు.
రెండు వర్గాలుగా చీలిక!
సోనూ-ఆశన్న వర్గాలు లొంగిపోయిన తర్వాత మావోయిస్టు పార్టీ తరఫున అభయ్ పేరుతో ఒక ప్రకటన వచ్చింది. ఈ జనవరిలో 40 పేజీల రాతపూర్వక ఇంటర్వ్యూ సైతం వెలువడింది. వీటిలో అభయ్‌గా చెప్పుకుంటున్న నేత(బహుశా దేవ్‌జీ) సోనూ-ఆశన్నలను పిరికిపందలుగా, ద్రోహులుగా, కోవర్టులుగా ప్రకటించారు. పార్టీకి చెప్పకుండా ఆయుధాలతో సహా లొంగిపోవడం విప్లవ ప్రతీఘాతుకత్వమేనని స్పష్టం చేశారు. దీనిపై సోనూ-ఆశన్న వర్గాలు స్పందించలేదు. అయితే, వివిధ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో సోనూ, ఇటీవల తెలంగాణకు వచ్చిన సందర్భంలో ఆశన్న కొన్ని విషయాలను స్పష్టం చేశారు. తాము ఈ వివాదాల్లోకి పోదలచుకోలేదని, భవిష్యత్తులో తమ ఆచరణే సమాధానం చెబుతుందని క్లారిటీ ఇచ్చారు.
విప్లవ శ్రేణులు ఏమనుకుంటున్నాయి?
ఈ లొంగుబాట్ల పర్వంపై ప్రస్తుతం తెలంగాణ సమాజం విస్మయం వ్యక్తం చేస్తున్నది. ఎంతో ఉన్నతంగా ఉన్న పార్టీ కేవలం ఏడాది కాలంలోనే ఇలా ఓటమి చెంది, అంతరించిపోతుండడం పట్ల చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయుధ పోరాట పంథా పనిచేయదని ఇప్పుడు వచ్చి చెబితే.. మరి ఇన్నేళ్ల బలిదానాలకు ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు. సిద్ధాంత రాజకీయం తెలిసిన వాళ్లు, మేధావులు మాత్రం ఇది తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిన పరిణామంగా గుర్తించి పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. కొందరు మాత్రం దేవ్‌జీ-రాజిరెడ్డి బయటకు వచ్చిన తీరును సమర్థిస్తుంటే, చాలామంది రెండు వర్గాలనూ ఒకేగాటన కడుతున్నారు. వాళ్లు అక్కడ ఆయుధాలిచ్చినా, రాజ్యాంగం చేబూనినా.. వీళ్లు ఇక్కడ ఆయుధాలు తేకున్నా, అరెస్టయినట్టు చెబుతున్నా, రాజ్యాంగ ప్రతి చేబూనక పోయినా ఇద్దరూ కలవడమే మంచిదంటున్నారు. ‘‘సోనూ-ఆశన్నలు ఆయుధాలతో లొంగిపోయినా తాము భవిష్యత్తులో కొత్త వేదిక కోసం ఆలోచిస్తున్నామని, ప్రజల కోసమే పనిచేస్తామని అంటున్నారు. దేవ్‌జీ-రాజిరెడ్డిలు ఆయుధాలతో లొంగిపోకున్నా, ఆ తర్వాత వారి దారిలో వచ్చిన కేడర్లు భారీగా ఆయుధాలు సమర్పించారు కనుకనూ, అరెస్టని చెబుతున్నా, లొంగుబాటు వేదికపై రివార్డు చెక్కులు తీసుకున్నారు కనకనూ’’ ఇద్దరినీ ఒకటిగానే చూడాలంటున్నారు.
ఏకమైతే బలమైన చట్టబద్ధ పార్టీ!
కాగా, ఫాల్స్ ప్రిస్టేజీకి లోనుగాకుండా రెండు వర్గాలు కనుక ఏకమైతే దేశంలోనే బలమైన చట్టబద్ధ మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేయవచ్చునని విప్లవాభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీల లోపల అంతర్గత పోరాటం జరిగినప్పుడు ఎలాగైతే ప్రజల మేలు కోసం ఆలోచించి నిర్ణయం తీసుకున్నారో, ఇప్పుడు కూడా ప్రజల ప్రయోజనాల ప్రాతిపదికన ఏకం కావాలని పిలుపునిస్తున్నారు. ఇరువర్గాలూ పరస్పరం ఆరోపణలు చేసుకోవడం మానేయాలంటున్నారు. ముఖ్యంగా సోనూ వర్గాన్ని ఉద్దేశించి దేవ్‌జీ వర్గం ఉపయోగిస్తున్న కోవర్ట్ పదాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. గత రెండేళ్లలో జనజీవన స్రవంతిలోకి వచ్చిన మూడు వేలకు పైగా మావోయిస్టులు పూనుకుంటే ఐక్య పార్టీ సాధ్యమేనంటున్నారు. గత ఐదు దశాబ్దాలుగా దేశంలో ప్రత్యేకించి ఉద్యమ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ సహా వివిధ మార్క్సిస్టు-లెనినిస్టు పార్టీల్లో పనిచేస్తున్న, పనిచేసి వివిధ సందర్భాల్లో బయటకు వచ్చిన వాళ్లను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య లక్ష దాటవచ్చని అంచనా వేస్తున్నారు. అప్పుడు దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా ఒక బలమైన శక్తి ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. పలు దక్షిణ అమెరికా దేశాల్లో ఇలాంటి చొరవ చేసిన కమ్యూనిస్టు పార్టీలు అధికారంలోకి వచ్చిన సందర్భాలను ఉటంకిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో విప్లవాభిమానుల డిమాండ్లు ఇవే..
- రెండు వర్గాలు వ్యక్తిగత నిందారోపణలతో కూడిన ప్రకటనలు, ఇంటర్వ్యూలు మానేయాలి.
- బయటకు వచ్చిన ఏడుగురు సీసీ సభ్యులు కలిసి సంయుక్తంగా మావోయిస్టు పార్టీ భవిష్యత్తు మీద ఒక ప్రకటన చేయాలి.
- లొంగిపోయి వివిధ రాష్ట్రాల పోలీసుల కంట్రోలులో ఉన్న మావోయిస్టులందరినీ మార్చి 31 తర్వాత విడుదల చేయాలని ఒత్తిడి తేవాలి.
- అందరూ జనంలోకి వచ్చిన వెంటనే వీలు చూసుకుని ఒక సెమినార్ నిర్వహించాలి.
- ఆ సెమినార్లో పాత నాయకత్వం తమ లోపాలను, తప్పులను బేషరతుగా అంగీకరించాలి.
- భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన రోడ్ మ్యాప్ రూపొందించాలి.
