Skip to content
Marokonam logo
Menu
  • హోమ్
  • విశ్లేషణలు
  • కథనాలు
  • బుక్స్
  • కామెంట్స్
Menu

జార్ఖండ్‌లో మరో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు గడ్చిరోలి మహిళా నేత నటాషా మృతి

Posted on April 17, 2026

దిశ, తెలంగాణ బ్యూరో: జార్ఖండ్ రాష్ట్రం సరాండా అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్ లో జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ( డీకేలో అయితే స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణలో అయితే రాష్ట్ర కమిటీ) సభ్యుడు అనూజ్ దా అలియాస్ సహదేవ్ మహతో అలియాస్ సుభాష్‌తో పాటు ఆయన భార్య, అదే స్థాయికి చెందిన నటాషా మరణించారు. ఈ ఎన్‌కౌంటర్ ఈ వారంలో జరిగిన రెండవ ఘటన కావడం గమనార్హం. అనూజ్ దా స్వస్థలం జార్ఖండ్ రాష్ట్రం హజారీభాగ్ జిల్లా కుథాన్ గ్రామం కాగా, నటాషా అలియాస్ మహేశ్వరి హోడి మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ధనోరా తాలూకాలోని కోస్మి అనే గ్రామానికి చెందిన ఆదివాసీ గోండు యువతి. 2007లో పార్టీలోకి రిక్రూటు కాగా, ఆ తర్వాతికాలంలో జార్ఖండ్‌కు బదిలీపై వెళ్లింది. ఆ సమయంలో తను డివిజన్ కమిటీ సభ్యురాలి స్థాయిలో పనిచేసింది కనుక ప్రస్తుతం స్పెషల్ ఏరియా కమిటీ సభ్యురాలై ఉంటుందని మాజీ మావోయిస్టు వర్గాలు వెల్లడించాయి.

మిసిర్ బెస్రా కోసం వేట.. ఎన్‌కౌంటర్..

కాగా, అనూజ్-నటాషాల జంట మరణించిన నేటి ఎన్‌కౌంటర్ మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, అగ్రనేత మిసిర్ బెస్రా అలియాస్ సాగర్ దా కోసం భద్రతా బలగాలు కొనసాగించిన వేటలో భాగంగానే జరిగింది. ఆ ఏరియాకు వెళ్లగానే మావోయిస్టులు తమపై కాల్పులు జరపగా.. ప్రతిదాడులు చేసినట్టు భద్రతాదళాలు వివరించాయి. కొన్ని గంటలపాటు సుదీర్ఘంగా కాల్పులు జరిగి.. ఆ తర్వాత ఆగిపోయాయని వెల్లడించారు. అయితే, ఈ ఎన్‌కౌంటర్ జరిగిన దళంలో మిసిర్ బెస్రా ఉన్నాడో లేదో తెలియదని అన్నారు. మృతుల్లో అనూజ్ దా, ఆయన భార్య నటాషా ఉన్నారని సమాచారం.

మిసిర్ బెస్రా ఎక్కడ?

ఈ నెల 3న రాంచీ జైలులో అనారోగ్యంతో మరణించిన మాజీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పాత మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్(ఎంసీసీ) మాజీ ప్రధాన కార్యదర్శి  ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దా మార్చి 20న బెస్రా పేరుతో ఉత్తరం రాసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయని, మధ్యభారత(సీఆర్బీ), తూర్పుభారత(ఈఆర్బీ) గెరిల్లా జోన్ ప్రాంతాల్లో తీవ్ర నష్టాలు జరిగాయని ఆ లెటర్ లో కిషన్ దా పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాయుధ పోరాటాన్ని సరైన అర్థంలో ముందుకు తీసుకెళ్లడం సాధ్యమేనా.. అనే విషయాన్ని ఆలోచించాల్సిందిగా కోరారు. తగిన నిర్ణయం తీసుకోవడంలో అనవసర జాప్యం జరిగితే, మరిన్ని నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు. జనజీవన స్రవంతిలో కలిసే నిర్ణయం కనుక  తీసుకుంటే, ప్రభుత్వం, పోలీసులు మీపై ఎటువంటి నిర్ణయాత్మక చర్యలు తీసుకోరని స్పష్టం చేశారు. మీ నిర్ణయాన్ని వీలైనంత త్వరగా నాకు చెప్పడానికి వీలుగా ఒక ఫోన్ నంబర్ ఇస్తున్నానన్నారు.

ఇప్పటికైనా లొంగిపోతారా?

ప్రస్తుతం తానుండే అడవుల్లోనే ఎన్‌కౌంటర్ జరిగి, ఇద్దరు నేతలు మరణించిన తర్వాత అయినా బెస్రా నిర్ణయంలో మార్పు ఉంటుందేమోననే ఆశాభావంతో ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నాయి. జనజీవన స్రవంతిలో కలుస్తారా? లేక అడవిలోనే ఉండి చివరి వరకూ పోరాడుతారా? అనే విషయం భవిష్యత్తులో తేలనుంది.

 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

©2026 Marokonam | Design: Newspaperly WordPress Theme