జైళ్లలో ఉన్న మావోయిస్టులకూ లొంగుబాటు ఆఫర్.. అతి త్వరలో ప్రకటన..

Man in prison hands of behind hold Steel cage jail bars. offender criminal locked in jail.

అడవులు, మైదానాల్లో పనిచేస్తున్న మావోయిస్టు నేతలు, కేడర్లకు లొంగుబాటు-పునరావాసం పథకాలను ప్రకటించి అమలు చేస్తున్న ప్రభుత్వాలు ఇక నుంచి జైలులో ఉన్న కార్యకర్తలకూ వాటిని వర్తింపజేయనున్నాయి. ఈ మేరకు ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో రాయపూర్‌లో జరిగిన సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ముందుగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో అమలయ్యే ఈ విధానాన్ని క్రమంగా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించనున్నట్లు ఛత్తీస్‌గఢ్ వర్గాలు పేర్కొన్నాయి.

జైళ్లలో వందలాది మావోయిస్టులు..

బిహార్, జార్ఖండ్, బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు పలు ఇతర రాష్ట్రాల్లోని జైళ్లలో వందల సంఖ్యలోనే మావోయిస్టు కీలక నేతలు, కార్యకర్తలు, మిలిటెంట్లు, ప్రజాసంఘాల నేతలు ఏళ్లుగా నిర్బంధించబడి ఉన్నారు. ఆపరేషన్ కగార్‌ను విజయవంతంగా అమలు చేయడం ద్వారా ఇప్పటికే మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు సహా అనేక మంది నేతలను, కింది స్థాయి కార్యకర్తలను, పీఎల్జీఏ కమాండర్లను, సభ్యులను అంతమొందించడంలో కేంద్ర ప్రభుత్వం సఫలమైంది. ఈ బల ప్రయోగం కారణంగా పలువురు కేంద్ర కమిటీ సభ్యులు సహా నేతలు, కింది స్థాయి కేడర్లు వందల సంఖ్యలోనే ఆయుధాలతో సహా లొంగిపోయారు. లొంగిపోగా మిగిలిన వేళ్లపై లెక్కబెట్టదగిన సంఖ్యలో ఉన్న నేతలు, కమాండర్లను సైతం న్యూట్రలైజ్ చేయడానికి భద్రతా బలగాలు తీవ్ర స్థాయిలో గాలింపును కొనసాగిస్తున్నాయి. ఫలితంగా మావోయిస్టు పార్టీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని స్థాయిలో నష్టాలకు గురై ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడింది.

కుటుంబ సభ్యుల మధ్యవర్తిత్వం..?

ఈ నేపథ్యంలోనే నిన్నటి సమావేశంలో జైళ్లలో ఉన్న మావోయిస్టుల లొంగుబాటుకు అవకాశం కల్పించడం గురించి చర్చ జరిగినట్లు తెలిసింది. మావోయిజాన్ని సమూలంగా నిర్మూలించాలంటే జైళ్లలో నిర్బంధించిన వాళ్లను సైతం జనజీవన స్రవంతిలో కలిసేలా చేయాలని పలువురు అధికారులు అభిప్రాయపడినట్లు సమాచారం. ఆయా కేడర్ల కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చి, వాళ్లను జైళ్లకు పంపి తమ వాళ్లతో మాట్లాడి లొంగుబాటుకు ఒప్పుకునే విధంగా ఒత్తిడి పెంచాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే లొంగిపోయిన వారిని కూడా ఇందుకు వాడుకోవాలని అనుకుంటున్నట్లు తెలిసింది. అలా లొంగిపోయిన మావోయిస్టు ఖైదీల కేసుల విషయంలో ఉదారంగా వ్యవహరించాలని, వెంటనే బెయిలుపై బయటకు తీసుకువచ్చి పునరావాస పథకాన్ని వర్తింపజేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.

మొదట ఛత్తీస్‌గఢ్‌లో, తర్వాత అంతటా..?

ఈ పథకాన్ని మొదట ఛత్తీస్‌గఢ్‌లో అమలులోకి తేవాలని, అక్కడి ఫలితాలపై ఆధారపడి మిగతా రాష్ట్రాలకు విస్తరించాలని హోం శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ పథకం సక్సెస్ అయితే మార్చి 31, 2026 కల్లా దేశం నుంచి మావోయిజాన్ని పారదోలాలన్న బీజేపీ ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లవుతుంది. నిన్నటి సమావేశంలో బస్తర్ ప్రాంతంలో ఇప్పటికీ మిగిలివున్న పాపారావు, దేవ్‌జీ వంటి నేతల కదలికలపై కేంద్రీకరించాలని, వచ్చే 50 రోజులూ ఎలాంటి సడలింపులు లేకుండా వ్యవహరించాలని నిర్ణయించినట్లు సమాచారం.

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *